ప్రగతిలో పట్టణాలే కీలకం

Fri,November 8, 2019 02:43 AM

-భవిష్యత్ అవసరాలమేరకు మాస్టర్‌ప్లానింగ్
-పట్టణాభివృద్ధి సంస్థలు కార్యాచరణ చేపట్టాలి
-పట్టణాభివృద్ధి సంస్థల సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రగతిలో పట్టణాలు ప్రముఖపాత్ర వహిస్తున్నాయని, వాటిభవిష్యత్తు కోసం పట్టణాభివృద్ధి సంస్థలు పనిచేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, అధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. 43 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నదని, రానున్న సంవత్సరాల్లో ఇది 50 శాతం దాటుతుందన్నారు. పట్టణాభివృద్ధి సంస్థలతోనే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధ్యమని, పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు ఇందుకోసం కృషిచేయాలని చెప్పారు. భవిష్యత్తు అవసరాలను దృష్టి లో పెట్టుకుని మాస్టర్‌ప్లాన్ తయారుచేయడం, పట్టణాభివృద్ధి సంస్థల ప్రాథమిక విధి అని, ఆ దిశగా అన్ని సంస్థలు కార్యాచరణ ప్రారంభించాలని కేటీఆర్ కోరారు.

పట్టణాలకు అవసరమైన గ్రీన్, ఇండస్ట్రియల్ జోన్లు.. చెరువులు, సరస్సులవంటి నీటి వనరుల రక్షణ, సబర్బన్ ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ తయారుచేసిన మాస్టర్‌ప్లాన్ ప్రచురణకు సిద్ధంగా ఉన్నదని కేసీఆర్ తెలిపారు. వరంగల్ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో అవలంబించిన ప్రక్రియను అవగాహన చేసుకోవడంతోపాటు పట్టణాభివృద్ధిసంస్థల అధికారాలు, రాబడి వనరుల వంటి విషయాలపై చర్చించేందుకు శుక్రవారం డీటీసీపీ, మున్సిపల్ శాఖాధికారులతో సమావేశం కావాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి సంస్థలు అంతిమంగా స్వయంసమృద్ధి సాధించేదిశగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్-అభివృద్ధి విధానం లాంటి మార్గాలను అనుసరించాలని ఆయన సూచించారు.

ల్యాండ్‌బ్యాంకు వివరాలు సిద్ధంచేసుకోవాలి

కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ఎల్‌ఆర్‌ఎస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్రమ లేఅవుట్లు లేకుండా చూసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అటవీ భూ ములతో కూడిన ల్యాండ్‌బ్యాంకు వివరాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో హెచ్‌ఎండీఏ 7,600 చదరపు కిలోమీటర్ల పరిధిలో వినూత్నమైన విధానాలు, కార్యక్రమాలతో పనిచేస్తున్నదని, ఆ సంస్థ అనుభవాలను తెలుసుకొని మిగిలిన పట్టణాభివృద్ధి సంస్థలు నేర్చుకోవాలన్నారు. మరింత అవగాహన కోసం అవసరమైతే దేశంలోని మంచి ప్రగతి సాధిస్తున్న పట్టణాభివృద్ధి సంస్థలను అధ్యయనం చేసేందుకు వెళ్లిరావాలని సూచించారు. నూతన మున్సిపాలిటీ చట్టం నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంస్థలు, హెచ్‌ఎండీఏ చట్టాల్లోనూ తీసుకురావాల్సిన మార్పులపైన ఒక నివేదికను తయారు చేయాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, శాలివాహన పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ పాల్గొన్నారు.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles