బాహుబలి ప్రారంభం!


Tue,August 13, 2019 09:41 AM

cm kcr inaugurates bahubali Lift Irrigation motor tomorrow

-రేపు సీఎం కేసీఆర్ చేతులమీదుగా
-మేఘా ఇన్‌ఫ్రా వెల్లడి
-గాయత్రి పంప్‌హౌస్‌లో 4, 5 మోటర్ల ట్రయల్ వెట్ ర‌న్‌ సక్సెస్
-గోదావరి నదిలో స్థిరంగా ప్రవాహం
-కన్నెపల్లిలో మళ్లీ మోటర్ల ప్రారంభానికి చర్యలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నెట్‌వర్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన.. బాహుబలిగా పిలుస్తున్న.. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల మోటర్‌ను బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించే అవకాశం ఉన్నదని నిర్మాణసంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్ అయిన గాయత్రి (ప్యాకేజీ-8, లక్ష్మీపూర్) పంప్‌హౌస్‌లో 139 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు మోటర్లను అమర్చిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రాజెక్టు అధికారులు ఐదో మోటర్ ట్రయల్ వెట్ ర‌న్‌ను విజయవంతంగా నిర్వహించారు. మూడువేల క్యూసెక్కుల గోదావరి జలాలు గ్రావిటీ కాల్వనుంచి మిడ్‌మానేరుకు పరుగులు తీశాయి. సోమవారం మధ్యాహ్నం ఐదో మోటర్‌ను 45 నిమిషాలపాటు ఇంజినీర్లు నడిపారు.

89.73 క్యూమెక్స్‌ల వేగంతో 85,54,589 ఘనపుటడుగుల నీటిని డెలివరీ సిస్టర్న్ ద్వారా కాల్వలోకి వదిలారు. లిఫ్ట్ అడ్వైజర్ పెంటారెడ్డి స్విచ్చాన్‌చేసి ప్రారంభించగా.. 5.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న (శ్రీరాముల సమీపంలోని) వరదకాల్వ జంక్షన్ పాయింట్‌వద్ద నీటి ప్రవాహాన్ని ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్ పరిశీలించారు. ఆ వెంటే నాలుగో మోటర్ వెట్ ర‌న్‌కు చర్యలు ప్రారంభించారు. రాత్రి 9.17 గంటలకు నాలుగో మోటర్‌ను ప్రారంభించి 11.27 గంటలవరకు నడిపించారు. ఆ మోటర్ 214 ఆర్పీఎంకు చేరుకొని 3150 క్యూసెక్కుల నీటిని 115 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌చేసింది. నంది (నందిమేడారం) రిజర్వాయర్ నుంచి దఫదఫాలుగా గాయత్రి పంప్‌హౌస్‌కు నీటివిడుదల కొనసాగుతున్నది. సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడుతలుగా నీటిని విడుదలచేసినట్లు ఏఈఈ పరుశురాంగౌడ్ తెలిపారు.

నాలుగో మోటర్ వెట్ ర‌న్‌ను వీక్షించిన సీఎం

నాలుగో మోటర్ వెట్ ట్రయల్ రన్ ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి సీసీ కెమెరాల ద్వారా వీక్షించారు. లిఫ్ట్ అడ్వయిజర్, ఈఎన్సీలకు అభినందనలు తెలిపి, నాలుగో మోటర్ ద్వారా వచ్చే నీటిని మధ్యమానేరుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో డీఈ గోపాలకృష్ణ, ఏఈఈలు శ్రీనివాస్, సురేశ్, రమేశ్‌నాయక్, వెంకటేశ్, ప్రసాద్ హర్షం వ్యక్తంచేశారు.

cm-kcr-bahubali2

లక్ష్మి పంప్‌హౌస్‌లో మోటర్ల పునఃప్రారంభానికి చర్యలు

మరోవైపు సరస్వతి (అన్నారం) బరాజ్‌కు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఆదివారం పది గేట్లు వదిలి దిగువకు నీళ్లు వదిలిన అధికారులు సోమవారం అన్ని గేట్లను మూసివేశారు. బరాజ్‌లో సోమవారం 6.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని ఇంజినీర్లు తెలిపారు. వరద ప్రవాహం తగ్గడంతో లక్ష్మి పంప్‌హౌస్ (కన్నెపల్లి)లో మోటర్లను ప్రారంభించేందుకు ఇంజినీర్లు ఏర్పాట్లుచేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి వరద సోమవారం సాయంత్రానికి 2.15 లక్షల క్యూసెక్కులుగా పారుతున్నది. లక్ష్మి బరాజ్ (మేడిగడ్డ)లో సోమవారం నీటి ప్రవాహం నిలకడగా ఉన్నది. సోమవారం బరాజ్‌కు 2.14 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం లక్ష్మి బరాజ్‌లో 2.3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని ఇంజినీర్లు వెల్లడించారు.

స్థిరంగా వరద ప్రవాహం

ఎగువన మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుకు 33 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండటంతో ప్రాజెక్టు నెమ్మదిగా నిండుతున్నది. 102.73 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వకుగాను ప్రస్తుతం 93.76 టీఎంసీలుగా ఉన్నది. శ్రీరాంసాగర్‌కు కూడా వరద స్వల్పంగా వస్తున్నది. సోమవారం సాయంత్రం 2,960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా జలాశయ నిల్వ 90.31 టీఎంసీలకుగాను 16.35 టీఎంసీలుగా ఉన్నది. కడెంకు నాలుగు పైచిలుకు క్యూసెక్కుల వరద వస్తుండగా... అధికారులు 5700 క్యూసెక్కులకు పైగా దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో ఎల్లంపల్లి వద్ద ఇన్‌ఫ్లో-అవుట్‌ఫ్లో 5570 క్యూసెక్కులుగా నమోదవుతున్నది.

కిన్నెరసాని వద్ద రెండుగేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేశారు. భద్రాద్రి పట్టణంలో గోదావరి నీటిమట్టం సోమవారం రాత్రికి 32.9 అడుగుల మేర ఉన్నది. పేరూరు దగ్గర గోదావరి ఉధృతి స్థిరంగా కొనసాగుతున్నది. ఏడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద దిగువకు వెళ్తుండగా.. ధవళేశ్వరం వద్ద 12.33 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. అధికారులు అంతేమేర దిగువన సముద్రంలోకి వదులుతున్నారు. ఈ క్రమంలో తాజా నీటి సంవత్సరంలో ఇప్పటివరకు 1203 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయి.

5198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles