ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ప్రజాసంక్షేమం ఆగదు


Tue,September 10, 2019 04:07 AM

CM kcr presents Rs 146492 30 crore Budget

-పలు రాష్ర్టాల ఆదాయాభివృద్ధి రేటు తిరోగమనంలో..
-మన పరిస్థితి కొంతలోకొంత నయం
-వచ్చేరోజుల్లో పరిస్థితి మెరుగుపడితే అంచనాల సవరణ
- ఆర్థిక పురోగమనంతోనే గ్రామసీమలకు ఆర్థిక ప్రేరణ
-పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం
-రైతుబంధు, రైతుబీమా పథకాలు యథాతథం
-సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుంది
-దృఢంగా మన ఆర్థికవ్యవస్థ.. 10.5% వృద్ధిరేటు
-రైతులు, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం
-వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన
-కేంద్రపథకాలపై పూర్తి అవగాహనతో నిర్ణయం
-ఆయుష్మాన్ భారత్‌కంటే ఆరోగ్యశ్రీ ఎంతో విశిష్టమైనది
-బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : దేశంలో తీవ్రమైన ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ.. రాష్ట్రప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమానికి ఇబ్బందులు రానీయబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థికసంక్షోభంలో రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన వ్యవసాయం, సంక్షేమరంగాలకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని, దీనిద్వారా రైతులు, పేదల జీవితాల్లో వెలుగులు తేవాలనే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉన్నదని తేలిందని వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా యథాతథంగా కొనసాగిస్తామని, ఆసరా పింఛన్ల అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదించి త్వరలోనే వారందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్షి, ఆరోగ్యలక్ష్మి, ఆరుకిలోల బియ్యం వంటి పథకాలకు నిధుల కొరత రానీయబోమన్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,46,492.30 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు.

cm-kcr-budget3

బడ్జెట్ అంచనాలు ఇవీ..

2019-20 ఆర్థికసంవత్సరంలో రూ.1,82,017 కోట్లను ప్రతిపాదిత వ్యయంగా ఓటాన్ అకౌంట్‌లో ప్రభుత్వం అంచనా వేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ దేశంలో గడిచిన 18 నెలలుగా ఆర్థికమాంద్యం స్థిరంగా కొనసాగుతున్నదని, దీంతో దేశీయోత్పత్తి బాగా పడిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధానరంగాలన్నీ తిరోగమనంలో పయనిస్తున్నాయని, ఆదాయాలు పడిపోయాయని వివరించారు. దేశ ఆర్థికపరిస్థితి ప్రభావం రాష్ట్రంపై కూడా పడిందని చెప్తూ.. మారిన పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 2019-20 ఆర్థికసంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం రూ.1,46,492.30 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు ఉన్నదన్నారు. బడ్జెట్ అంచనాలలో మిగులు రూ.2,044.08 కోట్లు కాగా.. ఆర్థికలోటు రూ.24,081.74 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. పూర్తి అశావహ దృక్పథంతో, వాస్తవిక పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం. ఆర్థికమాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ.. పరిస్థితుల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ను రూపొందించాం అని తెలిపారు.

పరిస్థితి మెరుగుపడితే సవరిస్తాం

రానున్న రోజుల్లో ఆర్థికపరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించే వెసులుబాటు ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడటానికి, కోర్టుల్లో మగ్గుతున్న భూ వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం రాజీలేని న్యాయపోరాటం చేసిందని, వాటి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. చేజారిపోతున్న వేలకోట్ల విలువైన భూములపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు కలిగిందని, ఈ భూములను దశలవారీగా విక్రయించడంతో రాష్ర్టానికి ఆదనంగా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఇలా సమకూరిన ఆదాయాన్ని ఎస్డీడీఎఫ్‌కు కేటాయించి, ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏ శాఖలో ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆదాయవనరులనుబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రాథమ్యాలను నిర్ణయించుకుంటూ.. సవరించుకుంటూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

అన్నిరంగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం

దురదృష్టవశాత్తు గడిచిన ఏడాదిన్నరకాలం నుంచి దేశం తీవ్ర ఆర్థికమాంద్యానికి గురవుతూ వస్తుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. 2018-19 మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదైంది. అప్పటినుంచి క్రమంగా తగ్గుకుంటూనే వస్తున్నది. రెండో త్రైమాసికంలో 7 శాతానికి, మూడో త్రైమాసికానికి 6.6 శాతానికి, చివరి త్రైమాసికానికి 5.8 శాతానికి జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి 5% కనిష్ఠ వృద్ధిని నమోదుచేయగలగడం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతం. ఈ గణాంకాలన్నీ కేంద్రం సాధికారికంగా వెలువరించినవే. అవి ఆర్థికమాంద్యాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక మాంద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారితీస్తున్న పరిణామాలను మనం అనునిత్యం గమనిస్తూనే ఉన్నాం. ఆర్థికమాంద్యం అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశ ఆర్థికస్థితిగతులకు సూచికలుగా నిలిచే అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనంలో, పరిస్థితి పూర్తి నిరాశాపూరితంగా ఉన్నదని ఆయా సంస్థల గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33% తగ్గింది. వాహనాల అమ్మకాలు 10.65% తగ్గాయి.

ఇప్పటికే తయారైన వాహనాలను కొనేవారులేక దేశంలోని ప్రముఖ కంపెనీలు వాహనాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొన్నది. దీనివల్ల వాహనాల అమ్మకంద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి, వ్యాట్ తగ్గిపోయింది. లక్షలమంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఆటోమొబైల్ రంగంలో ఇటీవల మూడున్నర లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం విషమపరిస్థితికి అద్దంపడుతున్నది. గతేడాది విమాన ప్రయాణికుల వృద్ధి 11.6% ఉంటే, ఈ ఏడాది మైనస్ 0.3 శాతంగా నమోదైంది. మొత్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య వృద్ధి 11.9% తగ్గింది. కార్గో విమానాల్లో జరిగే సరుకు రవాణాలో వృద్ధిరేటు ఏకంగా 10.6% తగ్గింది. 6% నుంచి మైనస్ 4.6 శాతానికి పడిపోయింది. అన్నిరకాల వస్తువుల డిమాండ్ పడిపోయి, సరుకు రవాణాచేసే గూడ్సు వ్యాగన్ల బుకింగులలో వృద్ధిరేటు 4.1% నుంచి 1.6 శాతానికి తగ్గింది. చాలా పరిశ్రమలు మూతపడటంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది. దీంతో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధిశాతం 10.6% నుంచి మైనస్ 5.1 శాతానికి పడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ అత్యంత కనిష్ఠంగా రూ.72.43కు పడిపోయింది అని సీఎం వివరించారు. ఈ విషయాలన్నీ ప్రతిరోజూ ప్రపంచం కోడై కూస్తున్న సంగతులేనన్నారు.

kcr-budget3

జీఎస్టీ పరిహారం పొందాల్సిన దుస్థితి

దేశంలో నెలకొన్న ఆర్థికసంక్షోభం ప్రభావం తెలంగాణ రాష్ట్రఆర్థిక పరిస్థితిపై కూడా గణనీయంగా పడిందని సీఎం కేసీఆర్ చెప్పారు. జీఎస్టీ అమలుచేసిన మొదటి సంవత్సరంలో లెక్కలు తేలకపోవడంతో అన్ని రాష్ర్టాలకు ఇచ్చినట్లే తెలంగాణకు పరిహారం అందించారు. ఆ తర్వాత మళ్లీ తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరమే రాలేదు. కానీ ఇటీవలి ఆర్థికమాంద్యం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.175 కోట్లు, జూన్, జూలై నెలల్లో రూ.700 కోట్లు జీఎస్టీ పరిహారంగా తీసుకున్నాం. ఏప్రిల్, మే నెలల్లో తీసుకున్న పరిహారం కన్నా జూన్, జూలైలో తీసుకున్న పరిహారం నాలుగింతలు పెరుగటం దిగజారిన ఆర్థిక పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో అర్థం చేసుకోవాలని చెప్పారు.

కేంద్రం నుంచి సాయం లేదు

కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వివిధరకాల పన్నుల ద్వారా రాష్ట్రం నుంచి గత ఐదేండ్లలో కేంద్రానికి అందిన మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిన గణాంకాల ప్రకారం రూ.2,72,926 కోట్లు. ఈ నిధుల్లో అన్ని రాష్ర్టాలకు వచ్చిన విధంగానే, కేంద్ర పథకాల అమలుకోసం మనకు రూ.31,802 వేల కోట్లు వచ్చాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను మన రాష్ర్టానికి ఇవ్వాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీనిప్రకారంగా ఏడాదికి ఇచ్చే రూ.450 కోట్లలో కూడా.. ఇంకా ఒక ఏడాది నిధులను కేంద్రం ఇవ్వలేదు అని సీఎం చెప్పారు. కాగ్ నివేదిక ప్రకారం తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమానికి గత ఐదేండ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చుపెడితే.. అందులో కేంద్ర పథకాల అమలుకు రాష్ర్టానికి అందిన నిధులు రూ.31,802 కోట్లు మాత్రమేనని, అంతకుమించి రూపాయి కూడా రాష్ర్టానికి అందలేదని స్పష్టంచేశారు.

కేంద్రపథకాలపై అవగాహనతో నిర్ణయాలు

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటున్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రజలకు మేలు చేయగలవని భావించిన కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలుచేస్తున్నామన్నారు. ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాలకోసం ప్రజాధనాన్ని వృథా చేయదలచుకోలేదని చెప్పారు. ఉదాహరణకు రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ.. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కన్నా ఎంతో విశిష్టమైనది. ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ.1,336 కోట్లను రాష్ట్రం ఖర్చుచేస్తున్నది. కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ.250 కోట్ల విలువైన వైద్యసేవలే అందుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 85.34 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలుకలిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవు. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నోరెట్లు మెరుగైనది కాబట్టి మనం కేంద్ర పథకాన్ని వద్దనుకున్నాం అని సీఎం వివరించారు.

kcr-budget4

పరిపాలనా సౌలభ్యం

స్వరాష్ట్రంలో సుపరిపాలన నినాదంతో ప్రభుత్వం పెద్దఎత్తున పరిపాలనా సంస్కరణలు అమలుచేస్తున్నదని సీఎం చెప్పారు. పాలనను ప్రజలకు మరింత చేరువచేసేందుకు, ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ అమలుకు సరైన పర్యవేక్షణతో పారదర్శక పాలన అందించేందుకు పరిపాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్లను 69కి, 459 మండలాలను 584కి పెంచుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, వాటిని 142కు పెంచుకున్నాం. కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటుచేసి, కార్పొరేషన్ల సంఖ్యను 13కు పెంచుకున్నాం. మారుమూల పల్లెలు, గిరిజన తండాలు, ఆదివాసీగూడేలను ప్రత్యేక పంచాయతీలుగా చేసుకున్నాం. గతంలో 8,690 గ్రామ పంచాయతీలుంటే, ఇప్పుడు తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి అని సీఎం చెప్పారు.

చట్టాల సవరణ

కేవలం డబ్బు ఖర్చుచేయడంవల్లే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం సాధ్యంకాదని, ఎన్ని కోట్లు వెచ్చించినా జరుగని మార్పు.. ఒక మంచివిధానం తీసుకురావడంవల్ల సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాలు, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర గ్రామీణ, పట్టణవిధానాలు తీసుకొచ్చింది. కాలంచెల్లిన చట్టాలస్థానంలో కొత్త చట్టాలను అమలుచేస్తున్నది. ఇటీవలే కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చింది. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందిలేని, అవినీతికి ఆస్కారంలేని, పారదర్శకంగా సేవలందించే కొత్త రెవెన్యూచట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నది అని తెలిపారు. పాలనా వ్యవహారాల్లో ఎవరి బాధ్యత ఏమిటో చట్టంలో స్పష్టమైన నియమ, నిబంధనలున్నాయి. స్థానికసంస్థల అధికారాలు, వి ధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఏర్పడింది. ఎవరైనా విధి నిర్వహణలో విఫలమైతే, వారిని ఆ బాధ్యతల నుంచి తొలిగించే అధికారం ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి ఉంటుంది. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నత స్థాయిసేవలు అందాలని ప్రభుత్వం ఆశిస్తున్నది.

కొత్తచట్టాలవల్ల నిశ్చయంగా గ్రామ పంచాయతీలు, పురపాలకసంఘాల్లో బాధ్యతాయుత వైఖరి రావాలని ప్రభుత్వం కోరుతున్నది. ఈ సంస్కరణల ఫలితంగా గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతితో పట్టణాలు తయారుకావాలని, ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనం లభించాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ నెల 6 నుంచి గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమయింది అని సీఎం చెప్పారు. పచ్చదనం పెంచటం, పరిశుభ్రత కాపాడటం, నియంత్రిత పద్ధతిలో నిధులు ఖర్చుచేయటం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించటం, గ్రామ అవసరాలకు తగ్గట్టు బడ్జెట్ రూపకల్పన, విద్యుత్ సంబంధ సమస్యలు పరిష్కరించుకోవటం తదితర పనులు ప్రజల విస్తృత భాగస్వామ్యంతో జరిపించాలి అని సీఎం కేసీఆర్ కోరారు.

kcr-budget2

సంక్షేమానికి చేయూత

సమైక్యరాష్ట్రంలో దారుణంగాదెబ్బతిన్న గ్రామసీమలు, వ్యవసాయం, కులవృత్తులు, చేనేతరంగాలకు పునరుత్తేజం తీసుకురావటానికి ప్రభుత్వం తగిన ఆర్థికప్రేరణ అందించగలుగుతున్నదని సీఎం చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా పురోగమించినందునే ఇది సాధ్యమవుతున్నదన్నారు. అత్యున్నత నాణ్యమైన విద్యాప్రమాణాలతో ప్రభుత్వం నెలకొల్పిన వందల గురుకుల పాఠశాలల్లో లక్షలమంది పేదవిద్యార్థులు కార్పొరేట్‌స్థాయి విద్య అభ్యసించగలుగుతున్నారని చెప్పారు. రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. మిషన్‌కాకతీయ ద్వారా వేలచెరువులు పునరుద్ధరించుకున్నాం. మిషన్‌భగీరథ ద్వారా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాం. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా ఐదేండ్లుగా రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చిత్తశుద్ధితో అమలుచేస్తున్న పథకాలవల్ల.. సమైక్యపాలనలోని జీవనవిధ్వంసంలోంచి తెలంగాణ సమాజం తేరుకుని, కుదుటపడి, స్థిమితపడింది అని సీఎం చెప్పారు.

ముందుగా బకాయిలన్నీ చెల్లిస్తం

ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడానికి, వాస్తవాలను ప్రజల ముందుంచే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. నిజానిజాలను స్పష్టంగా, స్ఫటిక సదృశ్యంగా సభముందు, సభద్వారా ప్రజలముందు ఉంచుతున్నామని చెప్పారు. దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం కారణంగా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గిన మాట కఠిన వాస్తవం. దీనికారణంగా అనేక ఒడిదుడుకులు ఎదురైన విషయం కూడా అంతే వాస్తవం. ఈ కఠిన వాస్తవాల ప్రాతిపదికగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు తయారుచేసింది. సరైన ఆర్థికనిర్వహణ జరుగాలని అభిలషిస్తున్నది. ముందుగా అన్ని శాఖల్లోనూ ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ బడ్జెట్లో తగిన కేటాయింపులు చేసింది. బకాయిలు చెల్లించిన తర్వాతే, కొత్త పనులు చేపట్టాలనే విధాననిర్ణయం కూడా తీసుకున్నది. దీనికి అనుగుణంగానే ఆయా మంత్రిత్వశాఖలు పరిమితులకు లోబడి, ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధులు ఖర్చుచేయాలని మంత్రు లు, కార్యదర్శులకు ఆర్థికశాఖ తరఫున ఆదేశాలు ఇచ్చాం అని సీఎం చెప్పారు.

Electricity

విద్యుత్తుపై వెనక్కి తగ్గేది లేదు

వ్యవసాయంతోపాటు అన్నిరంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాచేసేందుకు ప్రభుత్వం విద్యుత్‌సంస్థలకు ఎప్పటికప్పుడు తగిన ఆర్థికసహకారం అందిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టాభివృద్ధిలో విద్యుత్‌రంగానికున్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఖర్చుకు వెనుకాడకుండా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచింది. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంకోసం ఇప్పటివరకు మొత్తం రూ.20,925 కోట్లను విద్యుత్‌సంస్థలకు చెల్లించింది. ఉదయ్ పథకం ద్వారా డిస్కమ్‌లకున్న రూ.9,695 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వమే భరించింది. విద్యుత్‌సంస్థలు సింగరేణికి బకాయిపడిన రూ.5,772 కోట్లను చెల్లించింది. గరిష్ఠ డిమాండ్ వచ్చినప్పుడు జరిపే అదనపు విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే వ్యయాన్ని ఎప్పటికప్పుడు భరిస్తున్నది. మొత్తంగా గడిచిన ఐదేండ్లలో రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌సంస్థలకు రూ.42,632 కోట్ల ఆర్థికసహాయం అందించింది. అన్నిరంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండటంవల్ల పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ప్రగతి సూచికల్లో అతి ప్రధానమైన తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని సీఎం వివరించారు.

Project

ప్రాజెక్టుల నిర్మాణం యథాతథం

-పలు రాష్ర్టాల ఆదాయాభివృద్ధి రేటు తిరోగమనంలో
-మన పరిస్థితి కొంతలోకొంత నయం
-బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం యథాతథంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెడుతూ, దేశంలోని చాలారాష్ర్టాల పరిస్థితి మనకంటే అధ్వానంగా ఉన్నది. కాగ్ నివేదిక ప్రకారం కర్ణాటక, పంజాబ్, హర్యానా తదితర రాష్ర్టాలు ఆదాయాభివృద్ధి రేటులో తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఇతర రాష్ర్టాలతో పోల్చినప్పుడు మన పరిస్థితి కొంతలో కొంత నయంగా కనిపిస్తున్నది. స్థిరమైన ఆర్థికప్రగతి, పటుత్వమైన ఆర్థికక్రమశిక్షణ పాటించిన ఫలితంగా సాధించిన పరపతితో ఇతర ఆర్థికసంస్థలనుంచి నిధులు సమీకరించుకోగలుగుతున్నది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి, కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఆర్థికసంస్థల నుంచి నిధులు సమీకరిస్తున్నది. భారీప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని సంకల్పించింది. ఆర్థికసంస్థలు, మూలధనవాటాను కలిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణం యథాతథంగా కొనసాగుతుంది అని చెప్పారు.

farmers

రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు

రైతుసంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థికసంక్షోభ పరిస్థితుల్లో మనకున్న పరిమితుల్లోనే పేదలు, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. రైతుబంధు కింద ఎకరాకు ఇస్తున్న సహాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం రైతుసంక్షేమంపట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనం. రైతుబంధు యథాతథంగా కొనసాగుతుంది. దీనికోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లను ప్రతిపాదించాం. రైతుబీమా పథకాన్ని కూడా యథాతథంగా కొనసాగిస్తాం. రైతుబీమా ప్రీమియం చెల్లింపునకు రూ.1,137 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రైతుల పంటరుణాలను మాఫీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.6,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికయ్యే విద్యుత్‌బిల్లుల భారం రైతులపై వేయకుండా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించాం. దీంతో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల వ్యయం పెరిగింది. చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ సబ్సిడీలకు రూ.8,000 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నం అని సీఎం చెప్పారు.

harish-rao

మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన మండలి సమావేశమైంది. 11:32 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన మంత్రి హరీశ్.. వివిధ రంగాలకు జరిపిన కేటాయింపులను వివరించారు. ఆయన ప్రసంగం దాదాపు 38 నిమిషాలపాటు సాగింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సభను వాయిదావేశారు.

ఈ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి చింతిస్తున్న

దేశంలో స్థూల ఆర్థికవిధానాలను శాసించేది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్రం విధానాన్నే రాష్ర్టాలు అనుసరించాలి తప్ప, గత్యంతరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. దీనికి తెలంగాణ అతీతంకాదని చెప్పారు. దేశ, రాష్ట్ర ఆర్థికవ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న సమయంలో 2019-20 ఆర్థికసంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. అనేక పరిమితులను దాటిపోలేమని, మనచుట్టూ అలుముకున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ తీవ్ర మేధోమథనం చేసి, ఆర్థికగణాంక నిపుణులతో చర్చించి, నిర్థారణ చేసుకున్న వాస్తవిక దృక్పథంతో 2019-20 బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్టు చెప్పారు. గతంలో ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర ఓటాన్ అకౌంట్లలో సమర్పించిన అంచనాలకు, నేడు బడ్జెట్ ప్రవేశపెడుతున్న పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం వచ్చింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. కేంద్రానికి పన్నుల ఆదాయంలో 22.69% వృద్ధి ఉంటుందని అంచనావేస్తే, 2019-20 మొదటి త్రైమాసికంలో 1.36% మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలో 15% ఆదాయాభివృద్ధి ఆశించాం.

కానీ 5.46% వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. గడిచిన ఐదు ఆర్థికసంవత్సరాల్లో రాష్ట్రం వాణిజ్య పన్నుల విభాగంలో 13.6% సగటు వార్షికవృద్ధిరేటు సాధిస్తే, ఈ ఆర్థికసంవత్సరం మొదటి 4 నెలల్లో 6.61% వృద్ధిరేటునే సాధించగలిగింది. ఎక్సైజ్ ఆదాయంలో ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 2.59% వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరం వరకు 19.8% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే, ఈ ఏడాది మొదటి 4 నెలలు 17.5% నమోదైంది. మోటర్ వెహికల్ ట్యాక్స్‌లో ఆదాయం మరింత దారుణంగా పడిపోయింది. గత ఐదేండ్లలో మోటరు వాహనాల పన్ను ఆదాయంలో 19% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే, ఈ ఏడాది మొదటి నాలుగునెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో పన్నేతర ఆదాయం కూడా భారీగా తగ్గింది. మొత్తంగా పన్నేతర ఆదాయం 29% తగ్గింది. ఈ దుస్థితికి ముమ్మాటికీ ఆర్థికమాంద్యం ప్రభావమే కారణం. రాష్ర్టానికి స్వీయ ఆదాయంలో వచ్చిన తగ్గుదలతోపాటు పన్నుల్లో వాటా చెల్లించే విషయంలో, నిధుల బదలాయింపులో కూడా కేంద్రం కోతపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల్లో వాటాకింద రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో 4.19% కోత పెట్టింది. మిగతా అన్ని విషయాల్లోనూ ఇలాగే కోత విధించడంతో మనకు తీవ్రనష్టం కలిగింది అని సీఎం పేర్కొన్నారు.
ts-budget

1390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles