దేశం అబ్బురపడేలా రెవెన్యూ చట్టం

Mon,September 23, 2019 02:27 AM

-రైతులకు న్యాయం చేస్తాం
-ఎవరు అడ్డుపడినా సహించబోము
-ఉద్యోగులు చెప్పుడు మాటలు వినొద్దు

కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అద్భుతమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని వాస్తవ రైతులకు అన్యాయం, నష్టం జరుగనీయమన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చే క్రమంలో ఎవరు అడ్డుపడినా సహించబోమని, ఒకరిద్దరికి భయపడేది లేదని సీఎం స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిక్టేట్ చేయలేరని సీఎం అన్నారు. కుక్క తోకను ఊపుతుందా.. తోక కుక్కను ఊపుతుందా? ప్రభుత్వం నిర్దేశించిన పనులను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలి. అంతేకానీ ప్రభుత్వానికి సలహాలు ఇస్తాం, మేం వ్యతిరేకిస్తం అంటే ఎట్ల? ఎవరో నాయకుల పిచ్చి మాటలు పట్టుకుని సమ్మెలు చేయవద్దు. ఉద్యోగులను ఎట్ల చూసుకోవాలో మాకు తెలుసు. శాసనసభలో.. శాసనసభ్యులుచేసిన చట్టాలను వ్యతిరేకిస్తామంటే ఎలా.. ప్రజలు, రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు తీసుకొస్తున్నం అని పేర్కొన్నారు.

వీఆర్వోలపై నిర్ణయం తీసుకోలేదు

సాదాబైనామాల మీద మాట్లాడే అధికారం కాంగ్రెస్ నేతలకు లేదని.. 8 లక్షల మందికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు తీసుకొని అతి తక్కువ మందికి చేసిందని తెలిపారు. చట్టాలు మార్చొద్దు అంతా అట్లనే ఉండాలి.. అప్పు తేవొద్దు అభివృద్ధి జరగొద్దు అంటే కుదరదని స్పష్టంచేశారు. తాము ఎక్కడ చట్టాలు మార్చాలో అక్కడ మారుస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ చట్టం ఎవరి ఘనత? రెవెన్యూలో జరిగే అవకతవకలన్నీ ఎవరి పుణ్యం? మేం చేసినమా? నిజంగా ఆర్వోఆర్‌లు, జమాబందీలన్నీ పక్కాగా జరిగితే ప్రజలకు ఇన్ని కష్టాలెందుకొస్తాయ్? వీఆర్వోలను మేం ఉంచుతున్నమని చెప్పినమా? తీసేస్తమని చెప్పినామా? ప్రభుత్వమే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీఆర్వోలను తీసేస్త్తమని మేమెక్కడా చెప్పలేదు. దీనిపై అందరితో చర్చిస్తున్నం. వీఆర్వోలను తొలగించాల్సిన అవసరమొస్తే తొలగిస్తం. పటేల్, పట్వారీ వ్యవస్థలు పోతేనే కదా వీళ్లు వచ్చిండ్రు. ఆ వ్యవస్థ ఫ్యూడలిజంకు మారుపేరుగా నిలుస్తున్నదని.. వాళ్లు ప్రజల్ని పట్టి పీడిస్తున్నరనే.. దాన్ని రద్దుచేసి వీఆర్వో వ్యవస్థను తీసుకొచ్చినరు.

మరి, వీరు అంతకంటే డబుల్, ట్రిపుల్ అయితే, అప్పుడేం చేయాలె? అందుకే.. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైన రెవెన్యూ చట్టం తీసుకొస్తం. ధరణి వెబ్‌సైటు ఇంకా ప్రారంభం కాలేదు. ఆ ధరణి వెబ్‌సైటు వచ్చినప్పుడు.. గంటలోపు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మ్యుటేషన్ అయిపోతుంది. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వని రైతు చట్టం తీసుకొస్తం. అనుభవదారు కాలమ్ తీసేయాలని నేనే చెప్పిన. ఇది చాలా దుర్మార్గమైనది. కౌలుదారులను మేం గుర్తించదల్చుకోలేదు. ఆ వ్యవస్థ రైతుకు, కౌలుదారుకు మధ్య సంబంధం మాత్రమే. ఒకప్పుడు భూమి అంతా భూస్వాముల చేతుల్లో ఉన్నప్పుడు ఈ కౌలుదారు చట్టం వచ్చింది. ఇప్పుడు బడా భూస్వాములు ఎక్కడున్నరు? 20 శాతం భూములు ఉన్నతవర్గాల చేతిలో ఉన్నాయి. మిగతావి ఎస్సీ, ఎస్టీ, బీసీల చేతుల్లో ఉన్నాయి. పెద్ద భూస్వాములకే పని అవుతుందని 1940 లో చెప్పిన డైలాగులు ఇప్పుడు పనికిరావు. భూ యజమాని భూ యజమానే. సొంత బిడ్డను కాపాడుకున్నట్టు యజమానులు తమ భూముల్ని కాపాడుకుంటరు. మేం రైతుల కోసం ఉన్నం. రైతులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వం. అనుభవదారు కాలమ్ ఉండాలని కోరితే మీరు (కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ) రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తారు అని తేల్చిచెప్పారు.

1346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles