ఆర్టీసీపై కమిటీ

Wed,October 23, 2019 03:14 AM

-విలీనం తప్ప 21 అంశాలను పరిశీలించాలి
-సీఎం కేసీఆర్ ఆదేశం
-అధ్యయనం కోసం ఆరుగురు ఈడీలతో కమిటీ
-కమిటీ సూచనల ఆధారంగా హైకోర్టుకు నివేదిక
-తక్షణం వెయ్యి అద్దెబస్సులకు నోటిఫికేషన్
-ఆర్టీసీ సంఘాల ప్రోద్బలంతోనే సమ్మె
-చట్టవ్యతిరేక సమ్మెకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు అనైతికం
-కాంగ్రెస్ హయాంలోనే మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీ మూసివేత
-మోదీ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారం
-తెలంగాణలో చేస్తున్న డిమాండ్లు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలుచేస్తున్నారా?
-ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ చర్యలపై సుదీర్ఘ సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-స్థానిక బీజేపీ నేతల తీరుపై ప్రధానికి,కేంద్ర రవాణామంత్రికి లేఖ రాయటంపై చర్చ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మికసంఘాలు తమంతటతామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఈడీలతో ఆర్టీసీ ఎండీ ఒక కమిటీని నియమించారు. కమిటీ సూచనల ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మికసంఘాల నాయకులు మొదట ప్రకటించారు.

అదే తమ ప్రథమ అవసరమని కూడా చెప్పారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్టబోమని తెలిపారు. కార్మికసంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ నెరవేర్చితే తప్ప చర్చలకు రాబోమని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీచేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టుకోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ డిమాండ్లు పరిశీలించాలి. దానికోసం అధ్యయనం చేయండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా కమిటీ

ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్న రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ.. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆరుగురు అధికారులతో కమిటీవేశారు. అధ్యక్షుడిగా ఈడీ టీ వెంకటేశ్వర్‌రావు, సభ్యులుగా ఈడీలు ఏ పురుషోత్తం, సీ వినోద్‌కుమార్, ఈ యాదగిరి, వీ వెంకటేశ్వర్లు, ఆర్థికసలహాదారు ఎన్ రమేశ్ ఉంటారు. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకట్రెండురోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందిస్తుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

చట్టవ్యతిరేక సమ్మెకు మద్దతు అనైతికం

ఆర్టీసీ కార్మికసంఘాల ప్రోద్బలంతో చట్టవ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు పలుకడం అనైతికమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, బీజేపీ పాలితరాష్ర్టాల్లో అమలుచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ వాదనలు విచిత్రంగా ఉన్నాయి. రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ), రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ నరేంద్రమోదీ ప్రభుత్వం చట్టంచేసింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది. కానీ ఆ పార్టీలు తెలంగాణ విషయంలో మాత్రం విచిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నాయి అని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రైవేట్‌కు అవకాశమిచ్చిందే మోదీ

1950లో జవహర్‌లాల్‌నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటర్ వెహికిల్ చట్టం రూపొందించారు. దాని ప్రకారమే రాష్ర్టాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటువాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా ఆ చట్టంలో పేర్కొన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టంలోని 3వ సెక్షన్‌లో సవరణలు చేస్తూ 2019 బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ఆమోదించి, చట్టంచేసింది. మోటర్ వెహికిల్ (సవరణ) చట్టం- 2019 పేరిట అమలవుతున్న చట్టంలో ఆర్టీసీలో ప్రైవేటురంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్రప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కూడా కేంద్రం పేర్కొన్నది.

మొబైల్ రంగంలో, విమానయానరంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడంవల్ల ఆయారంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలుచేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, స్థానిక బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్న విషయంపై ప్రధానికి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రికి లేఖరాయాలనే విషయం కూడా సమీక్షలో చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ముఖ్యకార్యదర్శులు సునీల్‌శర్మ, నర్సింగ్‌రావు, ప్రభుత్వసలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, రవాణాకమిషనర్ సందీప్ సుల్తానియా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

4949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles