ఫార్మా ఉత్పత్తుల సరఫరాకు సహకారం

Fri,November 15, 2019 03:44 AM

-డల్లాస్‌కు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులు కావాలి
-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ను కోరిన అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దక్షిణ అమెరికాకు తెలంగాణ నుంచి ఫార్మా ఉత్పత్తులు సరఫరాచేసేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్‌వర్త్ శాఖ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న వినోద్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో బుధవారం డల్లాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్‌వర్త్ అధ్యక్షుడు నీల్ గోనుగుంట్ల నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. దక్షిణ అమెరికాలో పెద్దసంఖ్యలో ఎన్నారైలు స్థిరపడ్డారని, భారత సంతతికి చెందినవారు మాతృ దేశం, ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ ఫార్మా ఉత్పత్తులను ఇష్టపడుతారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కార్గో విమాన సర్వీసుల ద్వారా తెలంగాణ ఫార్మా ఉత్పత్తులను డల్లాస్, ఫోర్ట్‌వర్త్‌తోపాటు దక్షిణ అమెరికాకు సరఫరాచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున ఉంటున్నందున హైదరాబాద్ నుంచి డల్లాస్‌కు నేరుగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు ప్రారంభించడానికి కృషిచేయాలని వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో చేయనున్న నూతన విద్యా పాలసీ-2019 చట్టంతో ఇప్పటివరకు విదేశీ వర్సిటీలకు దేశంలో ఉన్న నిషేధం తొలిగిపోనున్నదని, తెలంగాణలో అమెరికా వర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. దక్షిణ అమెరికాకు హైదరాబాద్ నుంచి ఫార్మా ఉత్పత్తులను సరఫరాచేసేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని వినోద్‌కుమార్ తెలిపారు. ఎయిర్ ఇండియా సర్వీసుల విషయంలో కేంద్రం ఉన్నతస్థాయిలో చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ సమావేశంలో ఎన్నారై తెలంగాణ ప్రతినిధులు డాక్టర్ దేవయ్య, దయాకర్ పుష్కూర్ తదితరులు పాల్గొన్నారు.

212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles