అతి త్వరలో అందుబాటులోకి ధరణి


Mon,April 15, 2019 01:35 AM

Dharani website will soon be available to the public

-ఏర్పాట్లు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం
-రెవెన్యూ యంత్రాంగం చకచక ఏర్పాట్లు
-భూముల క్రయవిక్రయాలన్నీ ధరణి ద్వారానే
-రైతులు కార్యాలయాలకు వెళ్లకుండానే పనులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ధరణి వెబ్‌సైట్ అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం రెవెన్యూ యంత్రాంగం చకచక ఏర్పాట్లు చేస్తున్నది. ఒక్కసారి ధరణి అందుబాటులోకి వస్తే భూముల వివరాలన్నీ అంతర్జాలంలోనే ఎక్కడైనా చూసుకోవచ్చు. భూముల క్రయవిక్రయాలన్నీ ధరణి ద్వారానే జరుగుతాయి. ధరణి ద్వారా భూమి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత తిరిగి అమ్మిన రైతు కానీ, కొన్న రైతు కాని మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సిన పని ఉండదు. నిర్ణీత కాలవ్యవధిలో కొనుగోలుదారుడి పేరున మ్యుటేషన్‌చేసి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని కొనుగోలుచేసిన రైతు ఇంటికి పంపిస్తారు. భూమిని విక్రయించిన రైతు ఖాతాలో నుంచి అమ్మిన మేరకు భూమిని తొలిగిస్తారు. ఇందుకోసం కోర్ బ్యాంకింగ్ విధానాన్ని ధరణి ద్వారా అమలుచేయనున్నారు. దీంతో అధికారులకు, సిబ్బందికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నం కాదు. ధరణి వెబ్‌సైట్‌లో భూమి వివరాలు కనిపించిన తరువాత ఎలాంటి జాప్యం చేయడానికి వీలులేకుండా డాక్యుమెంటేషన్ పరిశీలించి రిజిస్టర్ చేయాల్సిందే. భూమిని రిజిస్టర్ చేసిన వెంటనే తహసీల్దార్‌కు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ వెళ్తుంది. ఆ వెంటనే తహసీల్దార్ మ్యుటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ చైన్‌లింక్‌లో ఏ అధికారి అయినా కావాలని పనిని పెండింగ్‌లో పెట్టి లంచం తీసుకోవాలని చూస్తే తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని సరిగ్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తరువాత పెండింగ్‌లో పెడితే తహసీల్దార్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా ప్రతి పనికి నిరిష్టమైన గడువు విధిస్తారు. బ్యాంకులకు ధరణి వెబ్‌సైట్‌ను లింక్ చేస్తారు. బ్యాంకు అధికారులు రైతులకు రుణాలు మంజూరుచేయడానికి ధరణిలో వివరాలను చూసుకొని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు పహాణీల కోసం తహసీల్దార్ కార్యాలయానికి తిరిగే అవసరం ధరణి అందుబాటులోకి వచ్చాక ఉండదు.

6468
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles