రోడ్డుపై రయ్.. రయ్

Thu,October 10, 2019 04:12 AM

-ఆగని చక్రం.. పండుగ వేళ కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం..
-ప్రయాణికుల రద్దీని బట్టి వాహనాల ఏర్పాటు
-రోజుకు సగటున 8 వేల వాహనాలు తిప్పిన రవాణాశాఖ
-చార్జీలు ఎక్కువ వసూలుచేస్తే కఠిన చర్యలు
-అన్ని బస్సుల్లో ప్రయాణ చార్జీల పట్టిక
-డీఎస్పీస్థాయి అధికారితో కంట్రోల్‌రూం
-14 నుంచి షెడ్యూలు ప్రకారం నడుపుతాం: ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్
-పోలీసుల సహాయంతో ప్రయాణికులకు భద్రత: రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌కుమార్
-బస్‌డిపోలు, బస్టాండ్ల వద్ద గట్టి బందోబస్తు: డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్/ఖమ్మం, నమస్తే తెలంగాణ: దసరా పండుగ నేపథ్యంలోనూ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం అంతంతమాత్రంగానే ఉన్నది. ప్రగతిచక్రం ఆగకుండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నది. పండుగపూట ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొన్నది. ఆర్టీసీ పరిధిలోని అద్దె బస్సులన్నీ యథావిధిగా నడిచాయి. వీటితోపాటు ఆర్టీసీ సొంత బస్సులు 30% వరకు నడిచాయి. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. లక్షలమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. రాష్ట్రమంతటా ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. చార్జీల వసూళ్లకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించామని, టిక్కెట్ ధరకంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలుచేసినా కఠినచర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లినవారు తిరిగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్, డివిజనల్ మేనేజర్లు, ఆర్టీవోలతో నాలుగు గంటలకుపైగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ నుంచి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

తగ్గిన ఇబ్బందులు

సమ్మె నేపథ్యంలో రవాణావ్యవస్థకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఆశించిన ఫలితాలనిస్తున్నాయి. తొలిరోజు నుంచే అవసరమైనంత మేరకు ప్రైవేట్ వాహనాలకు తాత్కాలిక పర్మిట్లు జారీచేశారు. ఆర్టీసీ పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కాకపోయినా బస్సులను యథావిధిగా తిప్పడంలో ప్రభుత్వం విజయవంతమైంది. తొలిరోజున 2386 ఆర్టీసీ బస్సులతోపాటు అద్దె బస్సులు 1696, ప్రైవేట్ వాహనాలు 5448 కలిపి మొత్తం 9,530 వాహనాలను అందుబాటులో ఉంచారు. తర్వాత ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, కంట్రోల్ రూంల ద్వారా అంచనావేస్తూ వాహనాలను సమకూరుస్తున్నారు. అన్ని డిపోల్లో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులు కలిసి కంట్రోల్‌రూంలను నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా బస్సుల గురించి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారమిస్తే అక్కడికి మరో వాహనాన్ని పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ అద్దె బస్సులకు డ్రైవర్లను నియమించడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుభవం, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నవారికి బస్సులు అప్పగిస్తున్నారు.

దీంతో ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. పండుగ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినా.. ప్రభుత్వం కావాల్సిన మేరకు వాహనాలను తిప్పడంతో రవాణాకు ఆటంకం కలుగలేదు. దసరా రోజు కూడా 1448 ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చాయి. బుధవారం 3 వేలకుపైగా బస్సులు నడిపించారు. పండుగల అనంతరం తిరుగుప్రయాణమయ్యేవారికోసం కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాలకు వచ్చేవారి కోసం జిల్లా, డివిజన్ల నుంచి మరిన్ని వాహనాలను ఏర్పాటుచేస్తున్నారు. ఆర్టీసీ నడిపే బస్సులకు రెండింతలుగా ప్రైవేట్ వాహనాలను నడిపించనున్నారు.

tsrtc2

ప్రతి బస్సులో టికెట్ ధరల పట్టిక

-అన్ని డిపోల్లో డీఎస్పీ ఇంచార్జిగా కంట్రోల్ రూం
-వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పువ్వాడ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. బుధవారం సాయంత్రం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మతోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. సమ్మె జరుగుతున్నప్పటికీ 50% నుంచి 60% బస్సులు నడుస్తున్నాయన్నారు. కొన్నిచోట్ల టికెట్ రేట్ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బస్సులో ఆయా రూట్లలో ఉండే చార్జీల పట్టికను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటుచేసి డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారిని ఇంచార్జీగా నియమిస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో డ్రైవర్ సీటు వెనుకాల చార్జీల పట్టిక.. దాని కింద ఆయా కంట్రోల్ రూంల నంబర్లను కూడా ప్రదర్శిస్తామన్నారు. టికెట్ ధర కంటే ఎక్కువ చార్జీ తీసుకుంటే ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు. ఈ నెల 14 నుంచి విద్యాసంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో.. షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్‌ను శుక్రవారం నుంచి అమలుచేస్తామని వెల్లడించారు.

ఆర్టీసీ బస్సులన్నింటా విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతోపాటు బస్‌పాసులన్నీ అనుమతించాలని మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజారవాణా స్థితిగతులన్నీ పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి పువ్వాడ వివరించారు. పోలీస్ శాఖ సహాయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తెలిపారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లోకి చేరని సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొంటూ బస్‌డిపోలు, బస్టాండ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ప్రయాణికుల రక్షణకు సంబంధించి ఏ చిన్న ఘటన జరిగినా ఎఫ్‌ఐఆర్‌నమోదుచేయాలని పేర్కొన్నారు.

సమ్మె జీతాల కోసం కాదు

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థ్థామరెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని, ఆర్టీసీని బతికించుకోవడమే లక్ష్యమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. తాము చేస్తున్న సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలతోపాటు, ఉద్యోగసంఘాల నేతలు కూడా మద్దతునివ్వాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా త్వరలో తెలంగాణ బంద్‌కు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణపై బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చి నిబంధనల ప్రకారమే సమ్మె చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, ఆయా రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
tsrtc3

4294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles