చిన్నచిన్న లోపాలను పెద్దవి చేయొద్దు


Tue,September 10, 2019 03:20 AM

Dont make small errors big

-వార్డు మారితే ఓటు హక్కు పోయినట్టు కాదు
-మున్సిపల్ ఎన్నికల కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
-ఆదిలాబాద్‌వాసులను మహబూబ్‌నగర్ వెళ్లి ఓటు వేయాలనడం లేదు కదా?
-పోలింగ్ రోజు తమ ఓటు ఎక్కడుందో ప్రజలకు తెలుస్తుంది
-మున్సిపల్‌శాఖకు ఎన్నికల సంఘం కొంత సమయమివ్వాలి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒక వార్డులో ఉన్న ఓటు మరో వార్డుకు మారినంత మాత్రాన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తిరస్కరించినట్లు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓటర్లను మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లి ఓట్లు వేయండంటే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందిగానీ అదే మున్సిపాల్టీలో ఓటరు వార్డులు మారడాన్ని పెద్ద పొరపాటుగా చూడలేమని పేర్కొంది. చిన్నచిన్న లోపాలను ఎత్తిచూపడం కంటే సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)కు కొంత సమ యం ఇచ్చి ఎన్నికలపై ముందుకెళ్లడం మంచిదని సూచించింది. మున్సిపల్ ఎన్నికల ప్రీఎలక్షన్ ప్రాసెస్‌ను హడావుడిగా ముగించారని, వార్డుల విభజనను అసంబద్ధంగా చేపట్టారని దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా వార్డులవారీగా జనాభా, ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయని, పత్రికల్లో ప్రచురించిన ప్రతిపాదనలో ఓ రకంగా, తుది నోటిఫికేషన్‌లో ఓ రకంగా వార్డులను చూపించారని పిటిషన్ తరఫు లాయర్ తెలిపారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రతిపాదన అంటే మార్పులు చేర్పులు ఉంటాయని, ఒక ఓటరు ఓటు 38వ వార్డు నుంచి 39వ వార్డుకు మారినంత మాత్రాన ఓటుహక్కు తిరస్కరించినట్లు కాద ని పేర్కొన్నది. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ తప్ప వరంగల్ సహా నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ అన్నీ చిన్న పట్టణాలేనని, ఈ పట్టణాల్లో వార్డులు మారినంత మాత్రాన ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులేమీ ఉండవని అభిప్రాయపడింది. పోలింగ్ తేదీన తమ ఓటుహక్కు ఎక్కడ ఉందో ఓటర్లకు తెలుస్తుందని, ఆ మేరకు అధికారులు ఏర్పాట్లుచేస్తారని పేర్కొంది. ఓటు హక్కును వినియోగించుకోవాలనుకునే పౌరుడు కచ్చితంగా తన ఓటు ఎక్కడ ఉందో తెలుసుకుంటాడని పేర్కొంది. అంతకుముందు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ఓటర్ల విజ్ఞప్తులన్నీ పరిష్కరించామ న్నారు. అభ్యంతరాలకు సం బంధించి హైకోర్టు కోరిన విధంగా అన్ని వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేశామని చెప్పారు. ప్రీఎలక్షన్ ప్రాసెస్ పూర్తిచేశామని, ఇక ఎన్నికల నిర్వహణే తరువాయి అని తెలిపారు. దీనిపై దాఖలైన కేసులు జూలైనుంచి పెండింగ్‌లో ఉన్నాయని, ఇన్ని రోజులు ఆలస్యం అయితే ఎలా అని ప్రశ్నించిన ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles