- ముస్లింల ‘ఏ టీమ్' మా పార్టీ
- బెంగాల్లో ముస్లింల పరిస్థితి అధ్వానం
- మమతపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తాము బీజేపీకి ‘బీ’ టీమ్‌గా పనిచేయడంలేదని ముస్లిం మైనార్టీల హక్కుల కోసం పనిచేస్తున్న ఒకే ఒక్క ‘ఏ’ పార్టీ తమదని మజ్ల్లిస్ -ఎ-ఇత్తేహాదుల్ ముస్ల్లిమిన్ (ఎంఐఎం) పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మైనార్టీల ఓట్లను చీల్చడానికి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మజ్లిస్ పార్టీ పోటీ చేస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. నిజానికి పశ్చిమబెంగాల్లో ముస్లింల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. ‘మైనార్టీలలో కొందరు అతివాదులున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మవద్దు’ అంటూ పరోక్షంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నుద్దేశించి అన్నారు. మంగళవారం దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందించారు.
‘ఇది మతపరమైన అతివాదం కాదు. బెంగాల్లో మైనార్టీల పరిస్థితి మానవ అభివృద్ధి సూచికలో అధ్వానంగా ఉన్నది. మమత ప్రభుత్వం మంచి చేస్తే ముస్లింల పరిస్థితి ఎందుకు అంత దయనీయంగా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. బెంగాల్లో తాము బలమైన శక్తిగా ఎదుగుతున్నామని, ముస్లిం అతివాదులమంటూ మమత వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శమని ఒవైసీ అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బెంగాల్‌లోని కిషన్‌గంజ్ నియోజకవర్గంలో ఎంఐఎం విజయం సాధించడంతో ఆ రాష్ట్రంలోనూ పార్టీని విస్తరించే వ్యూహంలో ఒవైసీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై మమత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు అయోధ్యలోవివాదాస్పద స్థలంపై నవంబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసంపూర్తిగా, అసమంజసంగా ఉందని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.