ప్రతి విద్యార్థి లైబ్రరీకి వెళ్లాలి

Fri,November 15, 2019 02:31 AM

-పుస్తక పఠనంతోనే విజ్ఞానం
-త్వరలోనే ఈ-లైబ్రరీలకు కార్యరూపం
-గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
-సకల సౌకర్యాలతో గ్రంథాలయాల ఆధునీకరణ
-20 వరకు వారోత్సవాలు: గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌

ఆర్కేపురం: పుస్తక పఠనమనేది సాధారణ విజ్ఞానాన్నివ్వడమే కాకుండా మానసిక వికాసానికి దోహదపడుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం సరూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో 571 గ్రంథాలయాలు ఉన్నాయని, సుమారు ఐదు లక్షల మంది వీటిని వినియోగించుకొంటున్నారని చెప్పారు. పోటీ పరీక్షలు వచ్చినప్పుడు నిరుద్యోగ యువత గ్రంథాలయాలకు వస్తారని.. వారికి ఉపయోగపడే పుస్తకాలను లైబ్రరీలలో అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. టెక్నాలజీ పెరుగటంతో పుస్తకపఠనం తగ్గిందని, ఉపాధ్యాయులు.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పుస్తక పఠనంచేసేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి విద్యార్థికి చిన్నప్పటినుంచే చదివే అలవాటుచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-గ్రంథాలయాలకు త్వరలోనే కార్యరూపం తెస్తామని మంత్రి వెల్లడించారు. అన్ని లైబ్రరీల్లో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. సీనియర్‌ సిటిజెన్లు పుస్తకాలను తీసుకెళ్లి లైబ్రరీలకు తిరిగి ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల్లోనే ఆలయం ఉంటుందని అన్నారు.

చిన్నతనం నుంచే ఏవరైతే గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుంటారో వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రంలోని 571 గ్రంథాలయాలను ప్రభుత్వం, అధికారుల సహకారంతో సకల సౌకర్యాలతో తీర్చిదిద్దామని చెప్పారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మనిషికి పుస్తకపఠనంతోనే మేధాశక్తి పెరుగుతుందని, దానిని నలుగురికి పంచాలన్నారు. ప్రతి గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలని యువత అడుగుతున్నారని అన్నారు. నిరుద్యోగ యువత గ్రంథాలయాలకు వెళ్లి అక్కడ పుస్తకాలు చదివి ఉద్యోగాలు సంపాదించారని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాల ప్రాధాన్యం తెలుసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. ఈ నెల 20 తేదీ వరకు వారోత్సవాలు ఉంటాయని అయాచితం శ్రీధర్‌ తెలిపారు. అంతకుముందు విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరమల్ల రామ్‌నర్సింహాగౌడ్‌, గ్రంథాలయ కార్యదర్శి జీ శ్రీహరి, పాలకవర్గసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles