ఫిట్‌లెస్ యాప్స్


Mon,August 26, 2019 01:46 AM

Fake fitness Mobile apps

-ఫిట్‌నెస్ డాటాల్లో గందరగోళం
-మొబైల్ యాప్‌లలో శాస్త్రీయతకు దూరంగా సూచనలు
-ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
-హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ జర్నల్‌లో కథనం ప్రచురితం
-యాప్స్‌ను ఏకపక్షంగా నమ్మొద్దంటున్న న్యూట్రిషనిస్టులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్మార్ట్‌ఫోన్ ఉండగా చింత ఎందుకు దండుగ.. సన్నబడటం, లేదా బరువు పెరుగటం మనచేతుల్లోనే ఉందిగా అనుకుంటున్నారా.. ఫిట్‌నెస్‌గా ఉండటం సులువే అనుకుంటున్నారా.. అయితే మోసపోతున్నట్లే! ఏరోజు ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎంత దూరం నడువాలి, ఎన్నిక్యాలరీలు ఖర్చుచేయాలి.. ఇలా అంచనావేసి చెప్తున్న మొబైల్స్ యాప్స్‌తో ప్రమాదం పొంచి ఉన్నదని పేర్కొంటున్నారు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్తలు. ఫిట్‌గా ఉండేందుకు అశాస్త్రీయతతో చేస్తున్న ఈ సూచనలను ఏకపక్షంగా పాటించడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం మొబైల్ యాప్స్‌ను అనుసరించడం, ఆహారం కూడా అందులో సూచించిన విధంగానే తీసుకోవటం ఇటీవలి కాలంలో సర్వసాధారణమయింది. అయితే ఈ ఫిట్‌నెస్ యాప్స్‌ను ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు? అవి అందించే సూచనలు ఎంతవరకు శాస్త్రీయంగా ఉన్నాయి? అనే విషయాలపై ఎన్‌ఐఎన్ అధ్యయనం చేసింది. ఎక్కువగా వినియోగంలోఉన్న 20 ఫిట్‌నెస్ యాప్స్‌పై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు వీటిల్లో ఏవీ శాస్త్రీయతను దాదాపు అనుసరించడంలేదని గుర్తించారు.

ఒక్కో యాప్ ఒక్కో రకమైన సూచన

నాణ్యమైన సమాచారం, సాంకేతికత, ఇతర శాస్త్రీయ అంశాలు ప్రామాణికంగా జరిగిన ఈ అధ్యయనంలో 13 యాప్స్ దారుణంగా ఉన్నట్టు గుర్తించారు. ఒక్కోయాప్ ఒక్కోరకమైన సూచనలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నట్టు తేలింది. ఒకేవ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమాచారం ఆయా యాప్స్‌లో ఎంటర్‌చేసి చూడగా.. ఒక్కొక్కటి ఒక్కోరకమైన సూచనలుచేసింది. ఉదాహరణకు 163 సెంటీమీటర్ల పొడవు, 66 కిలోల బరువు గల 22 ఏండ్ల మహిళ వారానికి 500 గ్రాముల బరువు తగ్గాలని అనుకుంటే, ఆయా యాప్స్ క్యాలరీస్ ఖర్చుచేసే విషయంలో, తీసుకునే ఆహారం విషయంలో 20 రకాల సూచనలు చేసినట్టు గుర్తించారు. ఎన్‌ఐఎన్ అధ్యయనం ఇటీవల హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. కూరగాయలు, పండ్లు, సంతృప్త కొవ్వుపదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడాన్ని కేవలం 40 శాతం యాప్స్ సూచిస్తుండగా, ప్రతిరోజూ శారీరక శ్రమను కొన్ని యాప్స్ మాత్రమే సూచిస్తున్నాయి.

నమ్మితే నష్టమే..

బరువు తగ్గాలనో లేక బరువు పెరుగాలనో స్మార్ట్ డివైజ్‌లను నమ్ముకునే వారిసంఖ్య పెరుగుతున్నది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, షూ చిప్ ఇలా.. పలు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. బరువు, వయస్సు ఆధారంగా యాప్స్ ఇచ్చే సూచనలు పూర్తిగా నమ్మితే నష్టపోయే ప్రమాదం ఉన్నది. వ్యాయామంపై సూచనలు చేయాలంటే ముందుగా శరీర సౌష్ఠవం, ఆరోగ్య సమస్యలు, వాతావారణ పరిస్థితులు.. ఇలా అన్నిఅంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు యాప్స్ సూచించినట్టు నడక లేదా రన్నింగ్ ప్రారంభించడం, లేదా ఆహార నియమాలు పాటించడం వల్ల ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. పలురకాల డైట్లతో ఆహార నియమాల్లో వస్తున్న మార్పులు దీర్ఘకాలంలో సమస్యలు చూపే అవకాశం ఉంటుంది. రాత్రికిరాత్రి బరువు తగ్గాలనే కోరికతో యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకొని అనుసరిస్తున్నారు. తక్కువ సమయంలో సన్నబడాలనే లక్ష్యంతో ఎక్కువ క్యాలరీస్‌ను ఖర్చుచేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయడంవల్ల సమస్యలు తప్పవని న్యూట్రిషన్ నిపుణులు చెప్తున్నారు. ఫిట్‌నెస్ యాప్స్ అనేవి రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటివని, అవి కొంతవరకు దారి చూపిస్తున్నప్పటికీ మొత్తం వాటినే గుడ్డిగా నమ్మితే నష్టపోయే ప్రమాదం లేకపోలేదని పేర్కొంటున్నారు.

అన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకోవాలి

భారతీయుల కోసం యాప్ అభివృద్ధి చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. భారతీయ ఆహారప్రమాణాలు, సాంస్కృతిక అంశా లు మరచిపోవద్దు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే న్యూట్రిఫై ఇండియా నౌ యాప్‌కు శ్రీకారం చుట్టాం. భారత ఆహా రం, వంటకాలు, పోషకాహార సమాచారంతో కూడిన ప్రత్యేక డాటాబేస్ ఆధారంగా అభివృద్ధి చేశాం. ఇందులో ప్రామాణికమైన సమాచారం ఉంటుంది.
- డాక్టర్ ఆర్ హేమలత, ఎన్‌ఐఎన్ డైరెక్టర్

1539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles