ఆరెకరాలు ఆరగించారు!


Wed,September 11, 2019 02:55 AM

farmer rajanna requests for passbook over revenue officers negligence

-రెండు లక్షలు లంచం తీసుకొని ఇతరుల పేరున భూమి ఎక్కించారు
-భూమి మాది.. కాస్తులో మేమే ఉన్నాం
-ఏడాదిన్నరగా తిరుగుతున్నా పట్టించుకుంటలేరు
-నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం రెవెన్యూ అధికారుల తీరుపై బాధితురాలి ఆగ్రహం
ఎలాంటి ఆధారాలు లేకున్నా భూమి రికార్డులు మార్చడంలో ఆరితేరిన రెవెన్యూ అధికారులు కొందరు.. ఓ రైతు కుటుంబం కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేశారు. కాస్తులో ఉన్న భూమి యజమానికి నోటీసులు కాదు.. కనీసం సమాచారమైనా ఇవ్వకుండా భూమిని ఇతరుల పేరుమీదకు మార్చేశారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకున్నది.

మోర్తాడ్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల పాలెం గ్రామానికి చెందిన ఆశన్నగారి రాజన్న అనే రైతుకు సర్వే నంబర్ 315 లో 6.2 ఎకరాలు భూమి ఉన్నది. ఆ భూమిని తన మనమరాలు (బిడ్డ కుమార్తె) బద్ధం స్రవంతికి బహుమతిగా (గిఫ్ట్ డీడ్) రాసి, రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 6.2 ఎకరాల భూమి ఆమె పేరున పట్టా అయి పాస్‌బుక్ కూడా వచ్చింది. నాటినుంచి నేటివరకు ఆ భూమికి స్రవంతియే కాస్తులో ఉన్నారు. కానీ, భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో స్రవంతికి ఆరెకరాలకు సంబంధించి కొత్తగా పాస్‌బుక్ రాకపోగా.. ఆ భూమి ఇతరులకు ఆర్వోఆర్ చేసినట్టుగా ఉన్న ది. ఈ సమాచారంతో రాజన్న అవాక్కయ్యా రు. తమకు తెలియకుండా తమ భూమి ని ఇతరుల పేరుమీద ఎలా మార్పిడి చేస్తారని, తాతతో కలిసి స్రవంతి ఏడాదిన్నరగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రూ.2 లక్షల లంచం తీసుకుని తన భూమిని ఇతరుల పేరుమీదకు మార్చారని బాధితురా లు ఆరోపిస్తున్నారు. లక్షల విలువైన భూమిని మాయంచేస్తూ మానసికంగా కుంగిపోయేలా చేస్తున్న అధికారుల తీరుపై విచారణ జరుపాలని ఆమె డిమాండ్‌చేశారు.

పాలెంలో భూరికార్డుల ప్రక్షాళనలో అవినీతి

భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాలెం గ్రామ రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడి భూ రికార్డులు తారుమారుచేశారనే ఆరోపణలున్నాయి. లంచం ఎక్కువ ఇచ్చిన వారికి భూమి ఎక్కువ వచ్చేలా.. డబ్బులు ఇవ్వనివారిని ఇబ్బంది పెట్టేలా వివరాలు రాయడం వంటి ఘటనలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈబీసీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఇక్కడ రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారని, ఇలాంటి విషయాల్లో గ్రామ రెవెన్యూ అధికారుల పని తీరుపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మాకు న్యాయం చేయాలి

నా భూమి నాకు ఇప్పించి న్యాయంచేయాలి. నాకు సంబంధం లేకుండా నా భూమి ఇతరుల పేరు మీద ఎవరు చేశారు. ఎలా చేశారు అనే అంశంపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
- స్రవంతి, బాధితురాలు, పాలెం

విచారణ జరుపుతున్నాం

పాలెం గ్రామానికి చెందిన సర్వే నంబర్ 315 లోని ఆరెకరాల భూమికి సంబంధించి విచారణ జరుపుతున్నాం. ఈ భూమికి సంబంధించి భూరికార్డుల ప్రక్షాళన సమయంలో అబ్జక్షన్ రావడంతో ఇరువర్గాల వాదనలు, పత్రాలను తీసుకుని విచారణ జరుపుతున్నాం.
-వెంకట్రావ్, తాసిల్దార్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా

388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles