వరద హోరు.. యాసంగి జోరు

Sat,November 9, 2019 02:02 AM

-నిండుకుండల్లా కృష్ణా, గోదావరి జలాశయాలు
-వానకాలం ముగిసి.. యాసంగికి సిద్ధమైన రైతు
-ఈ దఫా 50 లక్షల ఎకరాలకుపైగానే సాగు
-శ్రీశైలం, సాగర్‌లో మన వాటా 112.51 టీఎంసీలు
-ఎస్సారెస్పీ, ఎల్లంపల్లిల్లోనూ పుష్కలంగా నీళ్లు
-గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాలం కలిసిరావాలేగానీ.. రైతన్నకు ఎదురుండదు. ఈ ఏడాది విస్తారమైన వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతుండటంతో ఏరువాక హుషారుగా సాగుతున్నది. వానకాలం సీజన్ పూర్తిచేసుకున్న అన్నదాతలు.. యాసంగి సాగు కూడా మొదలుపెట్టారు. కృష్ణా.. గోదావరి బేసిన్లలో నిండుకుండల్లా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు వారికి పూర్తి భరోసానిస్తున్నాయి. భూగర్భజలాలూ గణనీయంగా పెరుగటంతో ఈసారి యాసంగి సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాలకుపైగానే ఉంటుందని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ సీజన్ మొదట్లో వరుణుడు నిరాశపరిచినా.. ఆ తర్వాత వానలు పుంజుకోవడంతో వ్యవసాయం భారీఎత్తున సాగింది. సాగునీటి ప్రాజెక్టుల కింద ఆశించిన స్థాయిలోనే సాగు విస్తీర్ణం నమోదైంది. కృష్ణాబేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందింది. గోదావరి బేసిన్‌కు సంబంధించి శ్రీరాంసాగర్ జలాశయంలోకి చాలా ఆలస్యంగా వరద వచ్చింది. రైతాంగం మొదట్లో కొంత ఇబ్బంది పడినా.. ఆ తర్వాత వర్షాలు పుంజుకున్నాయి. భూగర్భజలాలు సరాసరి ఆరున్నర మీటర్లకుపైగా ఎగబాకడంతో బోర్లు, బావుల కింద సాగునీటికి ఢోకా లేకుండాపోయింది. దీంతో వానకాలం సీజన్‌లో సాగువిస్తీర్ణం కూడా భారీ ఎత్తున నమోదైంది.

సాగర్ కింద పూర్తిస్థాయిలో..

కొన్నేండ్లుగా సాగర్ ఎడమకాల్వ కింద పూర్తిస్థాయిలో సాగునీరు అందిన దాఖలాలు తక్కువే. ఈసారి ఆయకట్టు పరిధిలో రెండు పంటలకు పూర్తిస్థాయి సాగునీరు అందుతున్నది. జోన్-1, జోన్-2 పరిధిలోని 6.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు భరోసా ఇచ్చారు. సాగర్‌పై ఆధారపడిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోనూ మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. జూరాల పరిధిలోని నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా వంటి లిఫ్టులతోపాటు దానికింద ఉన్న ఆయకట్టు సహా మూ డులక్షల ఎకరాలకు, శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి లిఫ్టు ద్వారా దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

గోదావరి బేసిన్‌లోనూ ఆశాభావం

గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉండటంతో యాసంగిలో దాని పరిధిలోని 9.68 లక్షల ఎకరాలతోపాటు ఎస్సారెస్పీ రెండో దశ కింద మరో 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు పారనున్నది. ఎల్లంపల్లిలోనూ పూర్తిస్థాయి నీటి నిల్వ ఉన్నందున దాని పరిధిలో లక్ష ఎకరాలు, దేవాదుల కింద మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇవి కాకుండా మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ జలకళ ఉట్టిపడుతున్నది. వాటి పరిధిలోనూ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మరోవైపు విస్తారమైన వర్షాలతో రాష్ట్రంలోని చెరువులన్నీ జలకళ సంతరించుకోవడంతో వాటికింద ఈసారి యాసంగి సాగు 16 లక్షల ఎకరాల పైమాటేనని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా రికార్డుల ఆధారంగానే ఏకంగా 50 లక్షల ఎకరాల వరకు యాసంగి సాగు విస్తీర్ణం కనిపిస్తున్నది. బోర్లు, బావుల కింద సాగును పరిగణనలోనికి తీసుకుంటే భారీ విస్తీర్ణం నమోదు కానున్నది.

906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles