పుట్టకముందే.. భూమి కొన్నాడట!


Tue,August 13, 2019 03:49 AM

farmers meets dharmaganta over revenue officers negligence

-43 ఏండ్ల వ్యక్తి.. 46 ఏండ్ల క్రితం భూకొనుగోలు
-దశాబ్దం తర్వాత వెలుగులోకి
-జగిత్యాల జిల్లా రెవెన్యూ లీలలు
-లబోదిబోమంటున్న బాధితులు

అతను పుట్టడానికి మూడేండ్ల ముందే భూమికి యజమాని అయ్యాడు. నలభై మూడేండ్ల వ్యక్తి.. నలభై ఆరేండ్ల క్రితం భూమిని కొన్నట్టు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారుల లీలావిన్యాసమిది. పూటగడవక పొట్టకూటి కోసం ముంబైకి వెళ్లినందుకు.. వారసత్వంగా సంక్రమించిన భూమిని.. దాన్ని ఆనుకొని ఉన్న భూమిలో కౌలు చేసుకొంటున్న వ్యక్తికి రెవెన్యూ అధికారులు రాసిచ్చేశారు. చిత్రమేమంటే.. ఆ వ్యక్తి వయస్సు సుమారు 43 ఏండ్లయితే.. 46 ఏండ్ల క్రితమే కొన్నట్టు రికార్డులు సృష్టించడంతో అసలు హక్కుదారు అవాక్కయ్యాడు. ఇంతటితో ఆగలేదు. అతను కౌలుకు చేసుకొంటున్న భూమిలో సగం భూమిని కూడా పట్టాచేసేశారు. జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన రైతులు న్యాయంకోసం ధర్మగంటను ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు, వీఆర్వోల పుణ్యమా అని తమ బతుకుదెరువు పూర్తిగా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం పొలాసకు చెందిన దేశవేని రాజనర్సు, గంగారాం, భీమయ్యకు తమ తండ్రి ద్వారా సర్వే నంబర్ 639 లో 2.16 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. ఇందులో రాజనర్సు, గంగారాంలకు 24 గుంటల చొప్పున, భీమయ్యకు 1.08 ఎకరాల చొప్పున వచ్చింది. ఈ మేరకు వారికి పాస్‌పుస్తకాలు కూడా ఉన్నాయి. ముగ్గు రు సోదరుల్లో రాజనర్సు, గంగారాం మరణించడంతో వారి వారసులు లక్ష్మణ్, శకుంతల పేరిట ఈ భూములు ఫౌతీ కూడా అయ్యాయి. పూట గడవని పరిస్థితుల్లో లక్ష్మ ణ్, శకుంతల, భీమయ్య ముగ్గురు కూడా ముంబైకి వెళ్లి కూలి పనిచేసుకొంటూ జీవిస్తున్నారు. లక్ష్మణ్, శకుంతల తమ భూములను రాజిరెడ్డి అలియాస్ తిరుపతిరెడ్డికి కౌలు కు ఇచ్చారు. భీమయ్య మాత్రం తన భూమిని ఎవరికీ కౌలుకు ఇవ్వకుండా పడావు పెట్టారు. కొంతకాలం తర్వా త లక్ష్మణ్ తనకున్న 24 గుంటల్లో పది గుంటలను, శకుంతల తన 24 గుంటల్లో 14 గుంటలను కౌలుదారు రాజిరెడ్డికే అమ్మారు.

land2
మిగతా 24 గుంటలు అమ్మలేదు. ఈ అమ్మకాలన్నీ సాదాబైనామా ద్వారానే జరిగాయి. ఇప్పటివరకు అంతా సవ్యంగానే జరిగింది. కొద్దిరోజుల క్రితం శకుంతల, లక్ష్మణ్ పొలాసకు వచ్చి మిగిలిన 24 గుంటల భూమిని సాగుచేసుకోవడానికి ప్రయత్నించగా.. రాజిరెడ్డి అడ్డుకొన్నారు. ఈ భూమి తనదని, పదేండ్ల క్రితమే తన పేరిట పట్టా అయిందని చెప్పాడు. తాము మొత్తం భూమిని అమ్మనప్పుడు పట్టా ఎలా మారుతుందంటూ బాధితులు అధికారులను విచారించగా అసలువిషయం బయటపడింది. శకుంతల, లక్ష్మణ్.. రాజిరెడ్డికి అమ్మిన భూమి 24 గుంటలే అయినా.. వారికి చెందిన మొత్తం 1.08 ఎకరాల భూమి అతని పేరిట మారింది. బీ/326/2008న ఆర్వోఆర్‌చేశారనీ, 2009 మార్చి 19న పట్టామార్పిడి అయినట్టు రికార్డులో ఉండటంతో శకుంతల, లక్ష్మణ్ లబోదిబోమంటున్నారు. భూమి తమదేనంటూ, ఇరువర్గాలూ మోఖాపైకి వెళ్లేందుకు యత్నించిన క్రమంలో పరస్పరం దాడి చేసుకోవడంతో కథ కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

భీమయ్య భూమీ హాంఫట్

ఇదే సందర్భంలో అధికారులు మరోమాయచేశారు. పక్కనే పడావుగా పడి ఉన్న దేశవేని భీమయ్య భూమి (1.08 ఎకరాలు)ని కూడా రెవెన్యూ సిబ్బంది రాజిరెడ్డికి రాసిచ్చారు. తమ భూమిని కోల్పోవడంతో ఆందోళన చెందిన లక్ష్మణ్, శకుంతల.. భీమయ్యకు సమాచారమివ్వడంతో అతను పరుగుపరుగున పొలాసకు వచ్చి ఆరా తీయగా తన భూమి మొత్తం రాజిరెడ్డి పరమైందని తెలిసింది. తాను ఎవరికీ అమ్మకుండా.. పట్టామార్పు ఎలా జరిగిందని ప్రశ్నించగా.. రెవెన్యూ అధికారుల లీలలు బయటపడ్డాయి. భీమయ్య 1973లో కొంత, 1980లో మరికొంత భూమిని రాజిరెడ్డికి అమ్మినట్టుగా సాదాబైనామా ఉన్నదని.. దాని ఆధారంగానే 2008లో పట్టామార్పిడి అయిందని అధికారులు చెప్పడంతో భీమయ్య బిక్కమొఖమేశారు.

పుట్టకముందే సాదాబైనామా

రెవెన్యూ అధికారులు దొంగ రికార్డులు సృష్టిస్తున్నప్పుడు.. తమను ఎవరేమంటారనుకొన్నారేమో.. ముందు వెనుక ఆలోచించకుండా తేదీలు.. సంవత్సరాలు వేసేశారు. మామూలుగా భూములు కొనాలంటే.. మేజర్ అయి ఉం డాలి. మైనర్ అయితే గార్డియన్ ఉండాలి. ఇవేవీ వాళ్లకు గుర్తుకు రాలేదు. పొలాసలోని భీమయ్య భూమికి సంబంధించిన వ్యవహారంలో దొంగ సాదాబైనామా సృష్టించిన వ్యక్తులు ఏకంగా తాను పుట్టిన తేదీకి ముందే భూమిని కొన్నట్టుగా రాశారు. అంతేకాదు.. అందులో సర్వే నంబర్లు లేవు.. ఎంత భూమి అమ్మారన్న వివరాలూ లేవు. కేవలం పేర్లతో మాత్రమే సాదాబైనామా రాశారు. 1973నాటి సాదాబైనామా ఒకటి కాగా.. 1980 సంవత్సరంతో మరో సాదాబైనామా సృష్టించారు.

మొదటి సాదాబైనామా జరిగిన సంవత్సరానికి సదరు రాజిరెడ్డి పుట్టనేలేదు. రెండో సాదాబైనామా నాటికి శిశువుగా ఉన్నాడు. రాజిరెడ్డి ఓటర్ ఐడీ ప్రకారం అతని వయస్సు 43 సంవత్సరాలు. అంటే.. అతను పుట్టడానికి ముందే అతనిపేరుమీద భూమి కొన్నట్టు తొలి సాదాబైనామా పుట్టుకొచ్చింది. ఈ రెండు సాదాబైనామాల ఆధారంగా రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకొని తప్పుడు మార్గంలో పట్టాచేశారన్నది స్పష్టమైంది. ఇంత గుడ్డిగా అధికారులు ఎలా వ్యవహరిస్తారని తోటి ఉద్యోగులే విస్తుపోతున్నారు.

మాజీ వీఆర్వోనే సూత్రధారి?

దేశవేని భీమయ్య, దేశవేని శకుంతల, దేశవేని లక్ష్మణ్‌కు సంబంధించిన భూముల పట్టాల మార్పు వెనుకాల పొలాస గ్రామంలో గతంలో వీఆర్వోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. పదేండ్ల క్రితం ఉద్యోగంలో ఉన్న సమయంలో, పట్టాదారులైన శకుంతల, లక్ష్మణ్, భీమయ్య స్థానికంగా లేకపోవడాన్ని ఆసరాచేసుకొని, సాదాబైనామాలతో వ్యవహారాన్ని గుట్టుగా చక్కబెట్టినట్టు తెలుస్తున్నది. పొలాసలో శకుంతల, లక్ష్మణ్, భీమయ్యవే కాకుండా అనేక మంది రైతులు సదరు వీఆర్వో వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం.

పరిశీలిస్తున్నాం

జగిత్యాల రూరల్ మండలంలోని పొలాసలో 629, 639 సర్వే నంబర్ భూముల వ్యవహారంలో సమస్యలు తలెత్తిన విషయం వాస్తవమే. 639 సర్వే నంబర్ భూమిలోని 2.16 ఎకరాల భూమిని రౌతు రాజిరెడ్డి అనే వ్యక్తికి 2009లో పట్టాచేసినట్లు ఉన్నది. సాదాబైనామాల ద్వారా ఈ వ్యవహారం జరిగింది. ఈ విషయమై ప్రస్తుతం భీమయ్య, శకుంతల, లక్ష్మణ్ ఫిర్యాదుచేశారు. ఈ భూమికి సంబంధించి గతేడాది కోర్టులో సైతం సివిల్‌కేసు వేశారు. అది నడుస్తున్నది. అన్ని వివరాలనూ పరిశీలిస్తున్నాం. అన్ని కోణాల్లో పరిశీలించి, అర్హులకు న్యాయం చేస్తాం. తప్పుడు పద్ధతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకొంటాం.
- జీ శ్రీనివాసరావు, తాసిల్దార్, జగిత్యాల రూరల్


కనుకు పద్మశ్రీను, అర్వపల్లి, సూర్యాపేట జిల్లా

ఏండ్ల సమస్యలు తీరిపోతున్నాయి

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఏండ్లుగా అనేక భూసమస్యలు పెరిగాయి. సీఎం కేసీఆర్ భూరికార్డుల ప్రక్షాళన చేపట్టిన తర్వాత కొంతవరకు పరిష్కారమైనా.. కొంతమంది అధికారుల అవినీతి కారణంగా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. రైతుల భూసమస్యలపై నమస్తే తెలంగాణ చేపట్టిన ధర్మగంటతో చాలావరకు పరిష్కారమవుతున్నాయి. రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం చూపుతున్న నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు.
- కనుకు పద్మశ్రీను, అర్వపల్లి, సూర్యాపేట జిల్లా

ఉగ్గిడి లింగయ్య. వేములపల్లి, నల్లగొండ జిల్లా

రెవెన్యూశాఖ ప్రక్షాళన గొప్ప విషయం

ఏండ్లుగా పరిష్కారం కాని రైతుల భూసమస్యలు ధర్మగంట ద్వారా పరిష్కారమవుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ రెవెన్యూశాఖ ప్రక్షాళనకు పూనుకోవడం గొప్ప విషయం. అవినీతి వ్యవస్థను నిర్మూలించడానికి, ఇతర ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడానికి ఈ ప్రక్షాళన ఎంతగానో ఉపయోగపడనున్నది. ఎంతో మంది నిరుపేద రైతుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి.
-ఉగ్గిడి లింగయ్య. వేములపల్లి, నల్లగొండ జిల్లా
బల్గూరి విష్ణువర్ధన్, నర్సింహులగూడెం, నాంపల్లి, నల్లగొండ జిల్లా

సీఎం కేసీఆర్ కృషి అభినందనీయం

భూసమస్యల పరిష్కారానికి ధర్మగంట రైతులకు అండగా నిలుస్తున్నది. రైతుల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్. రెవెన్యూశాఖ ప్రక్షాళన ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. రైతులను ఇబ్బంది పెడుతున్న రెవెన్యూశాఖను ప్రక్షాళనచేస్తేనే అధికారుల్లో మార్పు, వారిలో బాధ్యత పెరుగుతుంది. ఇందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం.
- బల్గూరి విష్ణువర్ధన్, నర్సింహులగూడెం, నాంపల్లి, నల్లగొండ జిల్లా

3385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles