పైసలు తీసుకొని పరార్


Wed,April 24, 2019 02:13 AM

Farmers struggle For Revenue offices in Nalgonda

-తొమ్మిది నెలలుగా వీఆర్వో జాడ కరువు
-పట్టామార్పిడి కోసం రైతుల నుంచి భారీగా వసూళ్లు
-ఒరిజినల్ డాక్యుమెంట్లు సైతం అతనివద్దే
-వీఆర్వో నిర్వాకంతో రెండునెలల క్రితం రైతు బలవన్మరణం
-పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా నమోదు కాని కేసు
-నల్లగొండ జిల్లా ఘనిపల్లి, భీమనపల్లి రైతుల వ్యథ ఇది

గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించి రైతులకు బాసటగా నిలవాల్సిన వీఆర్వో భారీగా డబ్బులు దండుకొని బిచాణా ఎత్తేశాడు. కొత్త పాస్‌పుస్తకాలు ఇస్తానంటూ నమ్మబలికి రైతుల నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్లు సైతం తీసుకున్నాడు. తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లినా ఆ కర్షకులకు న్యాయం జరుగలేదు. పాస్‌పుస్తకం రాకపోవటంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సదరు అధికారిపై బాధిత రైతులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. తొమ్మిది నెలలు కావస్తున్నా తమకు అన్యాయం చేసిన వీఆర్వో రామ్మోహన్‌రావు జాడ కనిపించడం లేదంటున్నారు నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం ఘనిపల్లి, భీమనపల్లి గ్రామాల రైతులు.

పెద్ద అడిశర్లపల్లి: నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని ఘనిపల్లి, భీమనపల్లి గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వీఆర్వోగా రామ్మోహన్‌రావు పనిచేశాడు. భూములు కొనుగోలు చేసి కొత్త పాస్ బుక్కుల కోసం వెళ్లిన, ఫౌతీ అమలు కోసం ఆశ్రయించిన ప్రతి రైతు నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేశాడు. అయినా సదరు రైతులకు పాస్‌బుక్కులు ఇవ్వలేదు. డబ్బులు తీసుకొని దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా వీఆర్వో జాడలేదు. బాధిత రైతులు వీఆర్వో రామ్మోహన్‌రావు జాడ కోసం వెతుకని చోటంటూ లేదు. ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నాడని తెలిసి ఇంటికి వెళ్లినా దొరుకలేదు. విసిగివేసారి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్‌తో సరిపెట్టారు తప్ప రైతులకు న్యాయం చేయలేదు.

ఏసీబీకి పట్టుబడి..మళ్లీ అవకాశం వచ్చినా..

రామ్మోహన్‌రావు గతంలో దేవరకొండ మండలంలో వీఆర్వోగా పనిచేసిన సమయంలో ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేయగా.. కొంతకాలం తర్వాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. అయినా బుద్ధి మార్చుకోలేదు.

వీఆర్వో నిర్లక్ష్యానికి రైతు బలి

భీమనపల్లి గ్రామానికి చెందిన కంభంపాటి రాములు తండ్రికి సర్వే నెంబర్ 364, 365లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. తన తండ్రి పేరుమీద ఉన్న భూమి పట్టాను తన పేరిట మార్పిడి చేయాలని వీఆర్వో రామ్మోహన్‌రావుకు దరఖాస్తు చేసుకుని రూ.5వేలతోపాటు ఒరిజనల్ పాస్‌పుస్తకాలు అందజేశాడు. రాములుకు కొంత అప్పు ఉండటంతో ఆ భూమిని అమ్మి అప్పులు తీర్చాలనుకొన్నాడు. కొంత బయాన కూడా తీసుకున్నాడు. వీఆర్వో రోజుల తరబడి తిప్పుకున్నప్పటికీ ఫౌతీ అమలు చేయపోవడంతో కొత్త పాస్‌పుస్తకం రాలేదు. ఇటు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతోపాటు.. భూమిని కొనుగోలు చేసిన వారు కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటూ రాములుపై ఒత్తిడి తెచ్చారు. కానీ భూమి తన పేరిట లేకపోవడంతో రిజిష్ర్టేషన్ చేయలేక.. అప్పుల వాళ్లకు సమాధానం చేప్పలేక రెండు నెలల క్రితం పొలం వద్దనే క్రిమిసంహారక మందు తాగి రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఒక వీఆర్వో నిర్లక్ష్యం పేద రైతు ప్రాణాలు తీసింది.

వీఆర్వో రామ్మోహన్‌రావు అవినీతి లీలల్లో కొన్ని..

-భీమనపల్లి గ్రామానికి చెందిన బిల్లకంటి వంశీకృష్ణ 271 సర్వే నెంబరులోని 30 గుంటల భూమిని లచ్చయ్య, వెంకులు, నందుప్రియల నుంచి కొనుగోలు చేశాడు. ఒరిజినల్ డాంక్యుమెంట్లతో పాటు రూ. ఆరు వేలను వీఆర్వోకు లంచంగా ఇచ్చినప్పటికీ పాస్‌పుస్తకాలు రాలేదు.
-భీమనపల్లికి చెందిన ఖమ్మంపాటి సైదయ్య తన తండ్రి రాములు పేరుమీద ఉన్న భూమి భాగం పంపిణీ కోసం వీఆర్వోను ఆశ్రయించాడు. సర్వే నంబర్లు 405,406,321,323 లలోని తన తండ్రి నుంచి సంక్రమించే భూమిని తనతోపాటు తన సోదరులు మల్లేశ్, సత్తయ్యలకు పట్టా మార్పిడి చేయాలని తన తండ్రి పేరున ఉన్న టైటిల్ డీడ్‌తో సహా వీఆర్వోకు అప్పగించాడు. మొదట్లోనే ఒక్కొక్కరు రూ.2 వేల చొప్పున ముట్ట చెప్పినప్పటికీ పట్టా మార్పిడి చేయకపోగా పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ సహా వీఆర్వో వద్దనే ఉండిపోయాయి.
-రాయినిపాలేనికి చెందిన కొప్పెర సైదమ్మ సర్వే నంబర్ 260లో మహ్మదియా అనే వ్యక్తి నుంచి ఎకరం భూమి రెండేండ్ల క్రితం కొనుగోలు చేసింది. పాస్‌పుస్తకాల కోసం వీఆర్వోను ఆశ్రయించి రూ. రెండు వేలు ఇచ్చినప్పటికీ పని జరుగలేదు.
-బిల్లకంటి పాపయ్య సర్వే నంబర్ 249లో తన తండ్రి పేరున ఉన్న మూడెకరాలను వారసత్వంగా తన పేరిట చేయాలని రూ. ఆరు వేలు లంచం ఇవ్వడంతోపాటు తన తండ్రి పాస్‌పుస్తకాలను అందజేశాడు. పాస్‌పుస్తకాలు వీఆర్వో వద్దే ఉండగా పట్టామార్పిడి జరగలేదు.
-రాయినిపాలేనికి చెందిన మరో రైతు గొడుగు మహేశ్వరికి కొత్త పాస్‌పుస్తకాన్ని జారీ చేసినప్పటికీ వీఆర్వో తన వద్దనే పెట్టుకున్నారు. ఈమెకు వ్యవసాయశాఖ నుంచి రైతుబంధు చెక్కు వచ్చింది. కొత్త పాస్‌పుస్తకం కోసం వీఆర్వో చుట్టూ తిరిగినా రాలేదు.

ఆరు నెలలు తిప్పుకున్నడుకొప్పెర నర్సయ్య

మా అన్న చిన సైదయ్య దగ్గర రెండెకరాల భూమిని కొన్న. మా ఊళ్లోకి వీఆర్వో వచ్చినప్పుడు పాస్‌పుస్తకం ఇవ్వాలని అడిగితే అంగడిపేటకు వచ్చి కలవమన్నడు. అక్కడికి వెళ్లి రూ. ఆరువేలు ఇచ్చిన. ఆ తర్వాత ఆర్నెళ్లపాటు వీఆర్వో చుట్టూ తిరిగినా నా పేరిట పట్టా కాలేదు. ఇప్పుడు తాసిల్దార్ ఆఫీసుకు పోయి అడిగితే వీఆర్వో పరారైండు.. మరోసారి కాగితాలు ఇవ్వుమని అధికారులు అంటున్నరు. ఈ మధ్యనే ఎమ్మార్వో కాడికి పోయి మళ్లీ కాగితాలు ఇచ్చిన. అయినా పని కాలే.
- కొప్పెర నర్సయ్య, రాయిని పాలెం

దశలవారీగా పరిష్కరిస్తున్నాంగుగులోతు లింగ్యానాయక్

విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు ఎటువంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో వీఆర్వో రామ్మోహన్‌రావును సస్పెండ్ చేశాం. అతని వద్ద ఉన్న రికార్డులను కూడా స్వాధీన పర్చుకున్నాం. వీఆర్వో రామ్మోహన్‌రావు పనిచేసిన గ్రామాల్లో స్పెషల్ క్యాంపు నిర్వహించి కొంత వరకు సమస్యలను పరిష్కరించాం. మిగిలిన సమస్యలను ఎన్నికల తరువాత దశల వారీగా పరిష్కరిస్తాం.
-గుగులోతు లింగ్యానాయక్, ఆర్డీవో, దేవరకొండ.

అవినీతి వ్యవస్థను అంతమొందించాలిటీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించినప్పటికీ కొన్నిశాఖల తీరుతో లబ్ధిదారులకు ఫలితం దక్కడం లేదు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో పేరుకుపోయిన అవినీతి ప్రజలకు శాపంగా మారింది. వాటిలోని అవినీతిని అంతమొందించి రైతన్నలకు, లబ్ధిదారులకు అభివృద్ధి ఫలాలను అందించడానికి సీఎం కేసీఆర్ కొత్త చట్టాలను తీసుకురానుండటం అభినందనీయం. ఈ ప్రయత్నాన్ని టీఆర్‌ఎస్ ఎన్నారైల తరఫున స్వాగతిస్తున్నాం. ఎన్నారైలకు కూడా భూసమస్యలు ఉన్నాయి. కొత్త పాసుపుస్తకాలు రాక రైతుబంధు పథకానికి కొందరు అనర్హులయ్యారు. గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైలకు ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణకు ఎప్పుడో ఒకసారి వస్తారని, ఎన్నారైలను రెవెన్యూశాఖ అధికారులు బ్లాక్‌మెయిల్‌చేసి లంచం అడుగుతున్నారు. ఈ సమస్యలన్నీ పోవాలంటే ధరణి వెబ్‌సైట్‌తోపాటు కట్టుదిట్టమైన చట్టాలను తీసుకురావాలి.
-టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల

మార్పులను స్వాగతించాలికూరపాటి సీతారామారావు

తెలంగాణ ప్రజల మేలుకోసమే సీఎం కేసీఆర్ రెవెన్యూ చట్టంలో మార్పులు తెచ్చేందుకు సంకల్పించారు. పాతకాలం నాటి చట్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులు వాటిని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో రెవెన్యూ చట్టంలో మార్పులు తప్పనిసరి అని గ్రహించి చర్యలు చేపట్టిన సీఎం నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం తాసిల్దార్ ఆఫీసులో పనులు ఎంత స్వేచ్ఛగా, ఎంత నీతివంతంగా జరుగుతాయో ప్రజలకు తెలుసు. రెవెన్యూశాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, పనుల జాప్యం మనం రోజూ పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగంటలో వచ్చే రైతుల బాధలు, గాధలు చూస్తుంటే ఒక్కో చిన్నపనికి ఎన్ని సంవత్సరాలుగా ప్రజలు తిరుగుతున్నారో రెవెన్యూ వారికి తెలియడం లేదా.. నేడు అన్ని విషయాలలో టెక్నాలజీలో మార్పులు వచ్చినట్లే రెవెన్యూ శాఖలో కూడా ఉన్నత ప్రమాణాలతో, సంస్కరణలు, మార్పులు వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ మార్పులను అందరం స్వాగతిద్దాం.
- కూరపాటి సీతారామారావు, (మాజీ రెవెన్యూ అధికారి, సంయుక్త కమిషనర్ దేవాదాయశాఖ), మామిళ్లగూడెం, ఖమ్మం జిల్లా
సీఎం కేసీఆర్ నిర్ణయం సాహసోపేతంజే శశిధర్

సీఎం కేసీఆర్ రైతులు, ప్రజల సంక్షేమానికి తీసుకునే చర్యలను విద్యావంతులు, మేధావులు అన్నివర్గాల ప్రజలు, న్యాయవాదులు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు. సీఎం నిర్ణయం సాహసోపేతం. రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులు ఎన్ని ఉన్నాయో గణాంకాలను ప్రభుత్వ ఉద్యోగులు ధ్రువీకరించి చిత్తశుద్ధి చాటుకోవాలి. దీంతో సమస్యల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో ప్రజలకు, ప్రభుత్వానికి తెలుస్తుంది. సిటిజన్ చార్టర్ కాగితాలకే పరిమితమైంది. సిటిజన్ చార్టర్‌కు చట్టబద్ధత కల్పిస్తే ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. భూమి యాజమాన్య హక్కుపత్రంలో రైతుల వ్యవసాయ భూమి సర్వే చేయించి, హద్దులు నిర్ణయిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. సమస్యలు పరిష్కరించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తుల సలహాలను తీసుకుంటే ఉపకరిస్తుంది.
-జే శశిధర్, పూర్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాది- సూర్యాపేట)
రైతుల వద్దకే అధికారులుకృష్ణ

నమస్తే తెలంగాణ చేపట్టిన ధర్మగంట.. సమస్యల వలయంలో చిక్కుకున్న రైతులపాలిట వరంగా మారింది. గతంలో భూసమస్యలను తొలిగించాలని సంవత్సరాల తరబడి కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులకు ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన ఫలితాలను అందించింది. ఇప్పుడు ధర్మగంట ద్వారా అనేక మంది రైతుల సమస్యలు పరిష్కారమవు తున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకువచ్చే రెవెన్యూ సంస్కరణల తో భవిష్యత్‌లో మంచి ఫలితాలను సాధించేందుకు ఇది మార్గం చూపనున్నది. గతంలో అనేక కారణాలు చెప్పిన అధికారులు ప్రస్తుతం స్వయంగా రైతుల వద్దకు వచ్చి మరీ పట్టా పుస్తకాలు అందించడం శుభ పరిణామం.
-కృష్ణ, డిగ్రీ కళాశాల అధ్యాపకుడు, సూర్యాపేట

3728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles