భూరికార్డులు గోల్‌మాల్


Wed,August 14, 2019 01:39 AM

Farmers Suffering Revenue Officer Negated The Land Registration

-రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమేనంటున్న బాధితులు
-ఏండ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కారం శూన్యం
-ధర్మగంటను ఆశ్రయించిన సంగారెడ్డి జిల్లా బాధిత సోదరులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పత్రాలన్నీ సక్రమంగా ఉన్న భూమి కూడా రికార్డుల్లో నుంచి మాయమవుతున్నది. ఒకరి భూమిని మరొకరు అమ్ముకొన్నా అధికారులు స్పందించడం లేదు. తప్పును సవరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో సంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నదమ్ముల భూమి రెండెకరాలు వారికి కాకుండాపోయింది.5.33 ఎకరాలను మోఖాలో ఉండి సాగుచేసుకొంటున్నా రికార్డు లో మాత్రం మొత్తం భూమి లేదు. తాసిల్ చుట్టూ తిరిగినా ఫలితం దక్కకపోవడంతో బాధితులు ధర్మగంటను ఆశ్రయించారు.

మా పేర్లు బిరాదర్ మల్లప్ప, బిరాదర్ బసప్ప. మా తండ్రి పేరు సంగమేశ్వర్. మాది సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కప్పాడ్. గ్రామంలోని సర్వే నంబర్ 129లో మా తాత సంగప్ప పేరిట 23.25 ఎకరాల భూమి ఉండేది. సదరు భూమిని మా తండ్రి సంగమేశ్వర్, చిన్నాన్న మాణెప్పకు మా తాత పంచి ఇచ్చారు. 23.25 ఎకరాల్లో 11.33 ఎకరాలు సంగమేశ్వర్, 11.32 ఎకరాలు మాణెప్ప పేరి ట రికార్డులో కూడా నమోదు చేయించుకొన్నారు. మా చిన్నాన్నకు సర్వే నంబర్ 129/ ఆలో సంక్రమించిన 11.32 ఎకరాలను 1992లోనే మరోవ్యక్తికి అమ్ముకొన్నారు. మా తండ్రి సంగమేశ్వర్ కూడా సర్వే నంబర్ 129/అలోని ఆరెకరాల భూమిని అమ్మేశారు. మా తండ్రి పేరిట ఇంకా 5.33 ఎకరాలు ఉన్నది. దానిని మేమిద్దరం అన్నదమ్ములం పంచుకొన్నాం. మా తాత హయాం నుంచి రికార్డుల్లోలేని రెండెకరాల భూమి మా కబ్జా లో ఉన్నది. అయితే ఆ రెండెకరాలను మా చిన్నాన్న కొడుకు నందప్ప 1993లో అమ్ముకొన్నాడు.

దానిని మా భూమి 5.33 ఎకరాలు ఉన్న సర్వే నంబర్ 129/అలో ఉన్నట్టు చూపి అమ్ముకొన్నాడు. అప్పటికీ మేమే రికార్డులో ఉన్నాం. అయినా రెవెన్యూ అధికారులు మాకు సమాచారం ఇవ్వకుండానే మా 5.33 ఎకరాల్లో నుంచి రెండెకరాలను తొలగించారు. మిగిలిన 3.33 ఎకరాలను మా పేరిట రికార్డులో ఉంచారు. ఇప్పటికీ 5.33 ఎకరాల భూమి మా కబ్జాలోనే ఉన్నది. రికార్డులేని రెండెకరాలు కొన్న వ్యక్తి కూడా మా భూమిలోకి రావడం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు అన్యాయం జరిగింది. మా సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఏండ్లుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. మా పేరిట ఉన్న భూమిలోనుంచి చెరో ఎకరం తొలగించి కొత్త పాస్‌పుస్తకాలు జారీచేశారు. మా సమస్యపై జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తే వెంటనే పరిష్కరించాలని తాసిల్దార్‌ను ఆదేశించినా సరైన స్పందన లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.

మా చేతుల్లో లేదు

నేను వచ్చి నాలుగు నెలలే అవుతున్నది. ఇప్పటివరకు నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ దాదాపు పరిష్కరించాను. కొన్ని సమస్యలుంటే ఉండొచ్చు. కానీ ఈ సమ స్య నాదృష్టికి రాలేదు. వాళ్లు నా వద్దకు వస్తే అసలు సమస్య ఏంటో కనుక్కొని పరిష్కరిస్తాను. అయితే ఒక తాసిల్దార్ ఇచ్చిన ఆర్డర్‌ను మరో తాసిల్దార్ మార్చడానికి వీలులేదు. ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్లు ఆర్డీవోకు కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. అప్పుడు మేం ఆర్డీవోకు సర్వేచేసి నివేదిక పంపిస్తాం. గతంలో జరిగిన తప్పిదాన్ని ఆర్డీవో సరిచేస్తారు.
- అమీర్‌సింగ్, ఝరాసంగం తాసిల్దార్

371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles