వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు

Tue,October 8, 2019 03:10 AM

- వ్యవసాయ, ఉద్యానశాఖల కసరత్తు
- వచ్చే ఏడాది చివరి నాటికి స్పైస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటుచేసేందుకు వ్యవసాయ, ఉద్యానశాఖలు కసరత్తును వేగవంతంచేశాయి. మహిళా సంఘాల సహకారంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కూరగాయలు, ఇతర ఉత్పత్తులు పంపిణీచేస్తామని సీఎం కేసీఆర్‌ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ విషయమై ఐటీసీ కంపెనీ ఇప్పటికే వ్యవసాయశాఖకు పలు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. మరోవైపు ఉద్యానశాఖ కూడా స్పైస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటును వేగవంతంచేసింది. వచ్చే ఏడాది చివరినాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఏటా 6.34 లక్షల టన్నుల కూరగాయల కొరత

రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి అవసరాలకు తగినట్టుగా లేదు. ఉద్యానశాఖ నివేదిక ప్రకారం రాష్ర్టానికి ఏటా 22.28 లక్షల టన్నుల కూరగాయలు అవసరంకాగా 15.94 లక్షల టన్నులు మాత్రమే సాగవుతున్నాయి. ఈ లెక్కన 6.34 లక్షల టన్నుల కొరత వేధిస్తున్నది. ముఖ్యంగా పచ్చిమిర్చి, కాకరకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ, బీన్స్‌, క్యాప్సికం, ఆలుగడ్డ, చామగడ్డ, క్యారట్‌, కందగడ్డ, ఆకుకూరలు, ఉల్లిగడ్డ సహా 14 రకాల కూరగాయలు అవసరాలకు సరిపడా ఉత్పత్తి కావడంలేదు.

మహిళా సంఘాలకు చిన్న యూనిట్లు

రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లలో మహిళా సంఘాలకు చిన్న యూనిట్లు ఇవ్వనున్నారు. టమాటా సాగయ్యే ప్రాంతాల్లో పచ్చడి తయారీతోపాటు, సాస్‌, కెచప్‌ లాంటి ఉత్పత్తులు తీసుకొస్తే రైతులకు, మహిళలకు లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. పసుపు అధికంగా పండే ఐదు జిల్లాల్లో పసుపు పౌడర్‌, ఓలియోరిసిస్‌, కుర్కుమిన్‌ లాంటి ఉత్పత్తులు తయారుచేసే యూనిట్లను, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో మిర్చిపంటకు సంబంధించిన విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు.

559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles