బందీపూర్‌కు హైదరాబాద్‌ వేటగాడు

Thu,October 10, 2019 02:21 AM

- నరభక్ష పెద్దపులి వేట..కాల్చివేతకు ఆదేశాలు
- వేటకు వెళ్లిన షఫత్‌అలీ


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కర్ణాటక బందీపూర్‌ అభయారణ్యంలో నరమాంసానికి అలవాటుపడిన పెద్దపులి కోసం వేట మొదలైంది. పెద్దపులిని బంధించాలని లేకపోతే కాల్చిచంపాలని కర్ణాటక అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు పెద్దపులుల వేటలో ఆరితేరిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్‌ నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌, ఆయన కొడుకు అస్గర్‌అలీ బందీపూర్‌కు బయలుదేరి వెళ్లారు. అత్యాధునిక ట్రాంక్వి లైజర్లు, తుపాకులను కలిగి ఉన్న షఫత్‌అలీ దేశంలో ఎక్కడ క్రూరమృగాల సమస్య తలెత్తినా ప్రత్యక్షమవుతారు. బందీపూర్‌ అభయారణ్యంలో ఒక పెద్దపులి చౌదనహళ్లి, హుండిపురాలో ఇద్దరు మనుషులను వేటాడి చంపడం కలకలం సృష్టించింది. పెద్దపులుల దాడుల నేపథ్యంలో స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధికారులను ఘెరావ్‌ చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పెద్దపులిని ట్రాంక్విలైజ్‌ చేసి (మత్తుమందు ఇచ్చి) బంధించడం లేదా కాల్చిచంపాలని అధికారులు నిర్ణయించారు. సమస్యను పరిష్కరించడానికి ప్రజలు తమతో సహకరించాలని కర్ణాటక చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ కోరారు. ఈ క్రమంలో షఫత్‌ అలీ బృందం అక్కడికి చేరుకొన్నది.

షఫత్‌అలీ, అతని కొడుకును అనుమతించరాదని పర్యావరణ, జంతుప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇప్పటివరకు షఫత్‌అలీ దాదాపు 300 క్రూరమృగాలను చంపడం లేదా బంధించి రికార్డు సృష్టించారు. ఇదేక్రమంలో ఇటీవల మహారాష్ట్రలోని యావత్‌మల్‌లో అవని అనే పెద్దపులిని కాల్చిచంపడం దేశవ్యాప్తంగా వివాదాన్ని రేపింది. పెద్దపులిని బంధించే అవకాశమున్నా తండ్రీకొడుకులు కాల్చిచంపుతున్నారని ఆరోపణలున్నాయి. దీంతో మొదట షఫత్‌అలీని ఆహ్వానించిన అటవీశాఖ అధికారులు వెనకడుగువేశారని సమాచారం. తాము మత్తుమందిచ్చి పట్టుకుంటామని అంతవరకు ఎలాంటి చర్య చేపట్టవద్దని షఫత్‌అలీకి స్పష్టంచేసినట్లు బందీపూర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ బాలచంద్ర తెలిపారు.

340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles