ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య

Tue,September 17, 2019 03:21 AM

-ఇంట్లో ఉరేసుకొని..
-కోడెల ఆత్మహత్య ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణం..
-అపస్మారకస్థితిలో బసవతారకం దవాఖానకు తరలింపు
-అపస్మారకస్థితిలో బసవతారకం దవాఖానకు
-గంటపాటు ప్రయత్నించిన వైద్యులు
-ఫలితం లేకపోవడంతో మృతిపై ప్రకటన
-ఉస్మానియా దవాఖానలో పోస్టుమార్టం
-ఆత్మహత్యగా నిర్ధారించిన వైద్యులు
-నేడు నర్సరావుపేటలో అంత్యక్రియలు
-కోడెల మృతిపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంతాపం
-కోడెల మరణంపై రాజకీయ రగడ
-ఏపీ ప్రభుత్వ వేధింపుల వల్లే ఆత్మహత్య: టీడీపీ
-ఆరోపణలను కొట్టిపారేసిన వైఎస్సార్సీపీ నేతలు
-ఆస్తికోసం కొడుకే వేధించాడు: ఏపీలో సమీప బంధువు ఫిర్యాదు
-నేడు నర్సరావుపేటలో అంత్యక్రియలు

టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లోని తన నివాసంలోని మొదటి అంతస్థులో ఉన్న బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కోడెల మరణం పట్ల ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కోడెల పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం రోడ్డుమార్గంలో గుంటూరుకు, అక్కడినుంచి ఆయన సొంతూరైన నర్సరావుపేటకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. కోడెల ఆత్మహత్య రాజకీయంగా ప్రకంపనలు రేపింది.

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ బంజారాహిల్స్/ సుల్తాన్‌బజార్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు (72) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లోని తన నివాసంలోని మొదటి అంతస్థులో ఉన్న బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉద యం 10 గంటలకు భార్య శశికళతో కలిసి అల్పాహారం తీసుకున్న కోడెల.. అనంతరం మొదటి అంతస్తులోని తన గదిలోకి వెళ్లారు. అరగంటవరకు కిందకు రాకపోవడంతో కుమార్తె విజయలక్ష్మి.. కోడెల గదికి వెళ్లి తండ్రిని పిలిచారు. ఎంతసేపటికీ పలుకకపోవటం, తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా.. ఆయన ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని విజయలక్ష్మి చెప్పారు. దీంతో వెంటనే కింద ఉన్న గన్‌మెన్, డ్రైవర్‌ను విజయలక్ష్మి పిలిచారు. వారి సహాయంతో గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆయన ఆపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ దవాఖానకు ఉదయం 11.35 గంటల సమయంలో తీసుకెళ్లారు. వైద్యులు ఆయనను అత్యవసర విభాగంలో చేర్పించి గంటపాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కోడెల మృతిచెందినట్టు మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రకటించారు. ఉరి వేసుకోవడం వల్లే చనిపోయారని కోడెల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు తేల్చారు.

kodela-siva-prasad3

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కోడెల పార్థివదేహం

పోస్టుమార్టం అనంతరం కోడెల మృతదేహాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు చేరుకుని కోడెలకు నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, దేవినేని ఉమ, ఎన్‌ఎండీ ఫారూఖ్ తదితరులు నివాళులర్పించారు. కోడెల కుమారుడు శివరామకృష్ణ పదిరోజులక్రితం కెన్యా వెళ్లారు. తండ్రి మరణ తెలిసి తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం ఉదయం కోడెల పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో గుంటూరుకు తరలిస్తామని, అనంతరం నర్సరావుపేట తీసుకెళ్లి.. అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి.

సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

సీనియర్ రాజకీయ నాయకుడు కోడెల శివప్రసాద్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఏపీ సీఎం జగన్ సంతాపం

కోడెల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

జీర్ణించుకోలేకపోతున్నా: చంద్రబాబు

పల్నాడు పులిగా పేరొందిన కోడెల మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. భయమనేది ఎరుగని వ్యక్తి అవమానాన్ని భరించలేక, మానసికక్షోభతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించిన మహానేత.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వేధింపులు భరించలేక, అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్ ప్రభుత్వం రాక్షసంగా, అమానవీయంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నదని మండిపడ్డారు.

ఆత్మహత్య కలచివేసింది: పవన్‌కళ్యాణ్

రాజకీయంగా ఒడిదుడుకులను తట్టుకోలేక కోడెల తుదిశ్వాస వదలటం తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చెప్పారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై కోడెల రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదన్నారు.

ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్య : సోమిరెడ్డి

వైఎస్సార్సీపీ ప్రభుత్వం బనాయించిన కేసులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కోడెల చనిపోయారని టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఫౌండర్ చైర్మన్‌గా బసవతారకం క్యాన్సర్ దవాఖాన అభివృద్ధిలో కోడెల కీలకపాత్ర వహించారని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

కోడెల వల్ల ఇబ్బంది పడ్డవారే కేసులు పెట్టారు: బొత్స

మాజీ స్పీకర్ కోడెల మృతి దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారనటాన్ని ఆయన ఖండించారు. తమ ప్రభుత్వం కోడెలను ఇబ్బం ది పెట్టలేదని, కోడెల వల్ల ఇబ్బందిపడ్డవాళ్లే కేసులు నమోదుచేశారని తెలిపారు. కోడెలపై ఎలాంటి కేసులను ప్రభుత్వం పెట్టలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు.

తెలంగాణ నాయకుల సంతాపం

కోడెల మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తంచేశారు. ప్రజాసేవయే పరమావధిగా భావించిన కోడెల అకాలమరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామానాగేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో తెంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి, తెలంగాణ టీడీపీ నాయకులు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వీ హన్మంతరావు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ తదితరులు కోడెల మృతికి సంతాపం తెలిపారు.

ఏపీకి చెందిన నాయకులు ఆశోక్‌గజపతిరాజు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పరిటాల శ్రీరామ్, నన్నపనేని రాజకుమారి, దివి శ్రీరామ్ బసవతారకం దవాఖానకు వచ్చి సంతాపం వ్యక్తంచేశారు. క్యాన్సర్ దవాఖానకు వచ్చిన మాజీ మంత్రి కడియం శ్రీహరి.. కోడెల మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెలపై వేధింపులు పెరుగటంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. నాయకుడిగా, వైద్యుడిగా ఎన్నోసేవలు అందించిన కోడెల మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చెప్పారు.

k-siva-prasad

వైద్యవృత్తినుంచి రాజకీయాల్లోకి..

వృత్తిరీత్యా వైద్యుడైన కోడెల శివప్రసాదరావు.. 1983లో టీడీపీ అధినేత ఎన్టీ రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. నర్సరావుపేట నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత రెండుసార్లు ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో గెలిచి, ఏపీ రాష్ట్ర పునర్విభజన అనంతరం మొదటి అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో ఉన్నారు. 1947 మే 2న గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో కోడెల జన్మించారు. చిన్నతనంలో తన తోబుట్టువులు అనారోగ్యంతో మృతిచెందడాన్ని జీర్ణించుకోలేని కోడెల.. వైద్యుడు కావాలని నిర్ణయించుకొని, లక్ష్యాన్ని సాధించారు. నరసరావుపేటలో దవాఖాన నెలకొల్పి వైద్యవృత్తిని కొనసాగించారు. అనతికాలంలోనే ప్రముఖ సర్జన్‌గా కీర్తిగడించారు. కోడెలకు భార్య శశికళ, పిల్లలు విజయలక్ష్మి, శివరామకృష్ణ ఉన్నారు. రెండో కుమారుడు సత్యనారాయణ గతంలో రోడ్డుప్రమాదంలో చనిపోయారు. పిల్లలు ముగ్గురూ వైద్యులే.

పులిలా బతికా..

-అవమానాలు తట్టుకోలేను..చివరిరోజుల్లో కోడెల వ్యాఖ్యలు?
-పార్టీలో ఒంటరిగా మారిన కోడెల!.. తోడైన కుమారుడి వేధింపులు?

కొంతకాలంగా కోడెల తీవ్ర మానసికవేదనతో ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు. పులిలా బతికిన తాను తలవంపులు, అవమానాలు తట్టుకోలేక పోతున్నానని సోమవారం ఉదయం కూడా సన్నిహితులతో చెప్పారని తెలుస్తున్నది. అయితే.. తనపై ఉన్న కేసులతో మనస్తాపానికి గురై కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న వాదనలతో పలువురు ఏకీభవించడం లేదు. టీడీపీలో ఆగస్ట్ సంక్షోభం సమయంలో ఎన్టీఆర్‌కు అండగా నిలిచిన అతికొద్దిమందిలో కోడెల ఒకరని, అటువంటి వ్యక్తి.. జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడి ఉరి తీసుకుంటారా? అనే సందేహిస్తున్నారు. సొంతపార్టీ నేతల నుంచి ఎదురైన అవహేళనలు ఆయనను కుంగదీశాయంటున్నారు.2014లో కోడెల గెలిస్తే మంత్రి అవుతారనుకున్నారు. కానీ.. చంద్రబాబు ఆయన్ను స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న సమయంలో వారిపై అనర్హతవేటు పడకుండా కోడెలను శిఖండిలా వాడుకున్నారన్న విమర్శలున్నాయి.

2019 ఎన్నికల్లో కోడెలకు నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు ఆఖరినిమిషం వరకు ఏడిపించారంటున్నారు. కోడెల బాధితులను టీడీపీ నేతలే ఎగదోసి కేసులు పెట్టించారని, ఈ విషయాన్ని కోడెల చంద్రబాబుతో మొరపెట్టుకున్నా ఫలితంలేకపోయిందని చెప్తున్నారు. ఒకదశలో కోడెల ఒంటరిగా మారిపోయారని అంటున్నారు. ఇప్పుడు విచారం వ్యక్తంచేస్తున్న టీడీపీ నేతలు గడిచిన మూడునెలల్లో ఆయనను మనిషిగా చూడలేదని, పైపెచ్చు టీడీపీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేశారంటున్నారు. ఇక తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోడెల కొడుకు శివరామ్, కూతురు విజయలక్ష్మి జనాన్ని పీక్కుతిన్నారన్న ఆరోపణలున్నాయి. ఆ సమయంలో జనం తిట్టుకుంటుంటే మౌనంగా భరించారని పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఫర్నిచర్, స్కిల్ డెవలప్‌మెంట్ కంప్యూటర్లను దొంగతనంగా తెచ్చి షోరూంలో పెట్టుకున్నది కొడుకు ధనదాహమేనని అంటున్నారు.

kodela-siva-prasad2

తప్పుడు కేసులతో మానసికంగా వేధించారు

కోడెల కూతురు విజయలక్ష్మి ఆవేదన
జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని అనుకోలేదని కోడెల కుమార్తె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ తప్పుడు కేసులతో తమ తండ్రిని మానసికంగా వేధించారని చెప్పారు. మూడున్నర నెలలుగా ఆయనకు కంటిమీద కునుకులేదని తెలిపారు. కోడెల మరణంపై రకరకాల వదంతులు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఎంతో బాధ, నరకం అనుభవించామని, ఇప్పుడైనా సీనియారిటీకి కనీస గౌరవం ఇచ్చి తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని వేడుకున్నారు.

k-sai-babu

కొడుకు బెదిరింపులతోనే!

ఏపీ పోలీసులకు కోడెల బావమరిది ఫిర్యాదు
కోడెల మరణానికి ఆయన కుమారుడు శివరామ్ కారణమని కోడెల బావమరిదిగా చెప్పుకొన్న కంచేటి సాయిబాబు అనే వ్యక్తి ఏపీలోని సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. కోడెలను ఆయన కుమారుడు ఆస్తికోసం మానసికంగా, శారీరకంగా వేధించాడని, చంపుతానని బెదిరించాడని పేర్కొన్నారు. కొడుకు వేధింపులను కోడెల పలుమార్లు తనకు ఫోన్‌లో చెప్పారని పేర్కొన్నారు. తనకు కొడుకు నుంచి ప్రాణహాని ఉన్నదని, అతడి బారి నుంచి కాపాడాలని కోరారని తెలిపారు. కోడెలను ఆయన కొడుకే చంపి, లేదా చంపించి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నట్టు ఫిర్యాదులో అనుమానం వ్యక్తంచేశారు.

2129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles