బలవంతంగా లాగేసుకున్నాడు!


Wed,August 14, 2019 01:26 AM

Gummadavelli Village Women Farmer Meets Dharmaganta

-తండ్రికి మద్యం తాగించి 9.18 ఎకరాలు రాయించుకున్న పెద్దకొడుకు
-కలెక్టర్ ఆదేశించినా తల్లి పేరిట మారని భూమి రిజిస్ట్రేషన్
-పట్టా మార్చాలని బాధితురాలు వేడుకొన్నా పట్టని అధికారులు
-ధర్మగంటను ఆశ్రయించిన జనగామ జిల్లా గుమ్మడవెల్లివాసి కమలమ్మ

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం గుమ్మడవెల్లికి చెందిన కత్తుల సంజీవరెడ్డికి ఇద్దరు కుమారులు, ముగ్గు రు కుమార్తెలు ఉన్నారు. సంజీవరెడ్డి పేరిట గ్రామంలోని సర్వే నంబర్ 303, 305లో 9.18 ఎకరాల భూమి ఉన్నది. సంజీవరెడ్డి భార్య కమలమ్మ ఇంట్లో లేని సమయంలో పెద్దకుమారుడు రాంరెడ్డి తన తండ్రికి బలవంతంగా మద్యం తాగించి అతడి పేరిట ఉన్న మొత్తం భూమిని తనతోపాటు కుమారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. సంజీవరెడ్డి గత ఏడాది ఆగస్టు 16న మృతిచెందారు. మరుసటి రోజు భూమి విషయమై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, తప్పు ఒప్పుకొన్న రాంరెడ్డి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకొంటానని బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. మూడు రోజులు గడిచినప్పటికీ రాంరెడ్డి రాకపోవడంతో విసుగుచెందిన తల్లి కమలమ్మ గత ఏడాది ఆగస్టు 20న జిల్లా కలెక్టర్‌ను కలిసి తనగోడు వెళ్లబోసుకొన్నారు.

స్పందించిన కలెక్టర్.. రాంరెడ్డి పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ రద్దుచేసి 9.18 ఎకరాలను కమలమ్మ పేరిట రికార్డులో చేర్చాలని ఆర్డీవోను ఆదేశించారు. ఇదే విషయాన్ని తాసిల్దార్, వీఆర్వో దృష్టికి తీసుకెళ్లి తన భర్త పేరిట ఉన్న పాస్‌పుస్తకాల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని బాధితురాలు కోరారు. అయినప్పటికీ వీఆర్వో.. సంజీవరెడ్డి పేరిట ఉన్న పాస్‌పుస్తకాలు, ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణం కోసం భూమి కోల్పోగా నష్టపరిహారంగా వచ్చిన డబ్బులను తీసుకెళ్లి రాంరెడ్డికి ఇచ్చారని బాధితురాలు ఆరోపించారు. రాంరెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి రికార్డులు మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నాడని కమలమ్మ తెలిపారు. బాధితురాలు అధికారులను కలిసి తన భర్త పేరిట ఉన్న భూమిని తన పేరిట మార్చాలని కోరినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు తన కొడుకు రాంరెడ్డితో కుమ్మక్కై భూమిని అతడి పేరిట మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి భూమిని తన పేరిట రికార్డుల్లోకి ఎక్కించాలని కమలమ్మ వేడుకొన్నారు.

136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles