గాలిదుమారం


Wed,April 24, 2019 02:12 AM

heavy rain in telangana

-ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలో వర్షం
-నేలకూలిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు
-శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ చర్యలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాల్లో మంగళవారం వర్షం కురిసింది. గాలిదుమారంతో కూడిన వర్షంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, రోడ్లపై చెట్లు కూలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. బలమైన గాలులకు చెట్లు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సత్తుపల్లి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈదురుగాలుల ప్రభావంతో ఆయా మండలాల్లో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలయపాలెం, కూసుమంచి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. కామేపల్లి, ముదిగొండ మండలాల్లో భారీవృక్షాలు నేలకూలాయి. మూడ్రోజుల కిందట కురిసిన అకాల వర్షం, బలమైన గాలులకు రఘునాథపాలెం మండలం, చింతకాని, బోనకల్ మండలాల్లో బొప్పాయి తోటలకు భారీనష్టం వాటిల్లింది.

rain-telangana2

అశ్వారావుపేటలో బీభత్సం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా మంగళవారం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మామిడితోటల్లో కాయలు రాలిపోయాయి. వరి, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి.

సూర్యాపేట జిల్లాలో తడిసిన ధాన్యం

సూర్యాపేట జిల్లాలో మంగళవారం సాయం త్రం పలుచోట్ల గాలిదుమారంతో కూడిన వర్షం బీభత్సం చేసింది. కోదాడ, చివ్వెంల, హుజూర్‌నగర్, మఠంపల్లి, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు తదితర ప్రాం తాల్లో కురిసిన గాలివానకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. మామిడి కాయలు రాలి రైతులకు నష్టం వాటిల్లింది.

SHIVAM-ROAD

హైదరాబాద్‌లో పునరుద్ధరణ చర్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ నగరం సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ధాటికి అతలాకుతలమైంది. అయినప్పటికీ విద్యుత్ సిబ్బంది.. అత్యధిక ప్రాంతాల్లో వర్షం, ఈదురుగాలులు ఆగిపోయిన రెండు గంటల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దాదా పు 30 విద్యుత్ స్తంభాలు, ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురికాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో 760 మంది విద్యుత్ సిబ్బంది, అధికారులు విద్యుత్ రాత్రంతా విధులు నిర్వర్తించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రెండురోజులుగా హైదరాబాద్‌లో వీస్తున్న ఈదురుగాలులకు 637 చెట్లు నేలకూలినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఎక్కడా రాకపోకలకు అంతరాయం లేకుండా కూలిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలిగించినట్టు చెప్పారు. ఈదురు గాలులు, వర్షసూచనతో విద్యుత్‌శాఖ ముందుగానే సరఫరాను నిలిపేయడంతో ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు.

రేపటినుంచి ఎండలు తీవ్రం

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
రాష్ట్రంలో బుధవారం నుంచి దాదాపు పొడివాతావరణమే ఉంటుందని, గురువారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నదని, దీని ప్రభావం తెలంగాణపై నామమాత్రమేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిన ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్నద్రోణి బలహీనపడిందని చెప్పారు. దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడ నం ఏర్పడే అవకాశమున్నదని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అది 36 గంటల్లో మరింత తీవ్రమై దక్షిణ ఉత్తర శ్రీలంక వైపు వేగంగా దూసుకొచ్చే ఆస్కారం ఉన్నదని, అల్పపీడనం తుపాన్‌గామారి దక్షి ణ తమిళనాడును తాకొచ్చని, దీని ప్రభావం రాష్టంపై ఉండకపోవచ్చని తెలిపారు.

3109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles