పలుచోట్ల ఓ మోస్తరు వాన

Mon,September 23, 2019 02:23 AM

-రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు
-హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. మరికొన్నిచోట్ల చినుకులు పడ్డాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆదివారం కరీంనగర్ జిల్లాలో 2.11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీణవంకలో 7.64 సెం.మీ. వర్షం కురిసింది. సైదాపూర్ మండలంలోని మూడు ఇండ్లు వర్షానికి కూలిపోయాయి. సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసింది. చేర్యాల ప్రాంతంలో వాగులు ప్రవహిస్తున్నాయి. కొమురవెల్లి మండలంలోని లెనిన్‌నగర్‌లో వాన నీటిలో గ్రామానికి చెందిన పాడిరైతు దాసరి బాలనర్సుకు చెందిన పాడిగేదె చిక్కుకొని మృతిచెందింది. జిల్లాలో 1.37 సెం.మీ. వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ పట్టణాల్లో జల్లులు కురిశాయి.

ఏనుమాముల మార్కెట్ ప్రాంతంలో, హన్మకొండలో రహదారులు జలమయమయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పరకాలలో 2.15 సెం.మీ వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలోని కట్టంగూర్, శాలిగౌరారం, కేతేపల్లి, దామరచర్ల, డిండి, నార్కట్‌పల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, మిగతాచోట్ల జల్లులు పడ్డాయి. అత్యధికంగా కట్టంగూర్‌లో 5.75 సెం.మీ. వర్షం పడింది. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చెరువులు అలుగు పోస్తున్నాయి. సూర్యాపేట జిల్లాకేంద్రంతోపాటు చివ్వెంల, ఆత్మకూర్.ఎస్, మోతె మండలాల్లో చిరుజల్లులు పడగా.. మద్దిరాల, తిరుమలగిరిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు, మాచారం, వెంకటేశ్వర్లబావి, తుర్కపల్లి గ్రామాల్లో భారీ వర్షం పడింది.

కొండాపూర్‌లో 5.9 సెం.మీ. వర్షం

గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొండాపూర్‌లో అత్యధికంగా 5.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అల్వాల్‌లోని బొల్లారంలో 5.7 సెం.మీ., మియాపూర్‌లో 5.6 సెం.మీ., కాప్రాలో 5.1 సెం.మీ., గచ్చిబౌలిలో 4.2 సెం.మీ., జూబ్లీహిల్స్‌లో 3.2 సెం.మీ. వర్షం కురిసింది. దాదాపు అన్నిప్రాంతాల్లో రెండు సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాగల 48 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

నిజాంపేట నాలాలో వ్యక్తి గల్లంతు

బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేట నాలాలో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన రకీబుల్‌షేక్ (36) హైదరాబాద్‌కు వలసవచ్చి నిజాంపేటలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. నిజాంపేటలో కురిసిన భారీ వర్షానికి వరదనీరు రోడ్లపైకి చేరింది. సాయత్రం స్నేహితుడితో కలిసి చాయ్ తాగేందుకు వెళ్లిన రకీబుల్‌షేక్ తిరిగివస్తూ.. ప్రమాదవశాత్తు ఓపెన్‌నాలాలో పడిపోయాడు. స్నేహితుడు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా నాలాలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఫలితం దక్కలేదు. అధికారులు నాలావెంట నాలుగు గంటలపాటు వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు.
RAIN1

వచ్చే నాలుగురోజులు వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర కోస్తా, ఆంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు తిరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles