ఆరు జిల్లాల్లో వానలు

Tue,September 17, 2019 02:44 AM

- ఖమ్మంలో భారీగా..
- భద్రాద్రి, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఓ మోస్తరు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/నెట్‌వర్క్‌: ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో సోమవారం ఆరు జిల్లాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో భారీగా, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వికారాబాద్‌, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడిం ది. అత్యధికంగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో 54 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా వచ్చే మూడ్రోజులు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఖమ్మం నగరం లోని ప్రధాన వీధులతోపాటు శివారు కాలనీలు జలమయమయ్యాయి. ఖమ్మం రూరల్‌, చింతకాని, ఏన్కూర్‌, తిరుమలయపాలెం, కూసుమంచి మండలాలతోపాటు వైరా, మధిర, సత్తుపల్లి డివిజన్లలోనూ భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు తల్లాడ మండలంలో 54 మి.మీ., ఏన్కూర్‌లో 47.4 మి.మీ, ఖమ్మం రూరల్‌లో 42.2 మి.మీ., తిరుమలయపాలెంలో 35.4 మి.మీ., ఖమ్మం అర్బన్‌లో 34.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి సాయం త్రం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుండాల, అశ్వారావుపేట, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలో ఓ మోస్తరు వాన పడింది.

వికారాబాద్‌ పట్టణంలో భారీగా..

వికారాబాద్‌ జిల్లాలోని బంట్వారం, నవాబుపేట్‌, ధారూర్‌, పూడూర్‌, తాండూర్‌ మండలా ల్లో ఓ మోస్తరు వర్షం పడగా, వికారాబాద్‌ మండలంతోపాటు వికారాబాద్‌ పట్టణంలో గంటసేపు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. గార్లలో 24.8 మి.మీ., మహబూబాబాద్‌లో 13.8 మి.మీ., గుడూరులో 5.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం రాత్రి కోదాడలో అత్యధికంగా 3 సెంటీ మీటర్ల వర్షం కురవగా సోమవారం తిరుమలగిరి మండలంలో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు!

వచ్చే మూడ్రోజులు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమమధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కి.మీ. నుంచి 4.5 కిలోమీటర్ల మధ్య దూరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఉత్తర మధ్యప్రదేశ్‌ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కాగా రాగల మూడ్రోజులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు ఆయన పేర్కొన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌కూ భారీ వర్షసూచన

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాగల 36 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

1924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles