ఉమ్మడి ఖమ్మంలో భారీ వర్షం

Sun,September 22, 2019 01:57 AM

-మరో నాలుగు జిల్లాల్లో ఓ మోస్తరు
-అత్యధికంగా ఖమ్మంలో 4.4 సెం.మీ. నమోదు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం వర్షాలు కురిశాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ గా, జగిత్యాల, మహబూబాబాద్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఖమ్మం నగరంతోపాటు పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వాన కురిసింది. దాదాపు అరగంటపాటు ఏకధాటిగా వర్షం కురువడంతో నగరంలోని ప్రధాన వీధులతోపాటు శివారు కాలనీలు జలమయమయ్యాయి. సుమారు 4.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం భారీ వర్షం కురిసింది. కొత్తగూడెంతోపాటు లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో దాదాపు రెండు సెం.మీ. మేర వర్షం కురిసింది.

మహబూబాబాద్ జిల్లాలోని కురవి, నర్సింహులపేట, కేసముద్రం, బయ్యారం, మరిపెడ, చిన్నగూడూరు, గూడూరు, కొత్తగూడ మండలాల్లో వర్షం పడింది. చాలా చెరువులు అలుగుపోస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో అరగంట పాటు భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రంగారావుపేట పెద్దచెరువు, మెట్లచిట్టాపూర్ ఊర చెరువు, ఆత్మకూర్ పెద్దచెరువులు మత్తడి దుంకుతున్నాయి. రాళ్లవాగు మత్తడి దుంకడంతో ఆత్మకూర్‌లోని పెద్దవాగు నీటి ప్రవాహం పెరిగింది. రంగారావుపేట, ఏఎస్సార్ తండా గ్రామాల సమీపంలోని లోలెవల్ కల్వర్టులపైనుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Rain-water1

నిజామాబాద్ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. శనివారం భీమ్‌గల్‌లో భారీ వర్షం కురువగా, మిగతాచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. బోధన్ మండలం లాంగడాపూర్‌లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పసుపు వాగు, రామడుగు ప్రాజెక్టు, ఎడపల్లి మండలం శివారులోని పెద్దవాగు, నర్సాపూర్ వాగులు పారుతున్నాయి. ఇందల్వాయి మండలం గుట్టకింది తండా, ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్‌పల్లి, లోలం, మల్లాపూర్ గ్రామాల్లో దాదాపు 50 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles