సర్కారుకే సర్వహక్కులు

Wed,November 20, 2019 02:49 AM

-ఎంవీ యాక్ట్ ద్వారా రవాణాపై పూర్తి అధికారం రాష్ర్టానిదే
-చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించేందుకు మాత్రమే క్యాబినెట్ అనుమతి ఇచ్చింది
-ప్రైవేటు పర్మిట్లు ఇవ్వడం ఇంకా పూర్తికాలేదు
-ఈ దశలో క్యాబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుంది?: హైకోర్టు
-ప్రైవేటీకరణ వద్దని ఏ చట్టం చెప్తున్నది?
-గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ యుగంలో ఉన్నాం
-ఇప్పుడు ఎయిర్ ఇండియా పరిస్థితి ఏమిటి?
-ఆర్టీసీపై సీఎం ఏమన్నారో మాకు సంబంధం లేదు
-క్యాబినెట్ నిర్ణయం చట్టబద్ధమో? కాదో? చూస్తాం
-ప్రైవేట్ బస్‌పర్మిట్లపై దాఖలైన కేసులో హైకోర్టు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మోటర్ వెహికిల్ యాక్ట్ (ఎంవీ యాక్ట్) సెక్షన్ 67 ప్రకారం రాష్ట్రంలోని రవాణావ్యవస్థను నియంత్రించే అంశంలో పూర్తిస్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నాయని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రైవేటు, ప్రభుత్వ రవాణాసంస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నది. రాష్ట్రంలో 5100 బస్సు పర్మిట్లను ప్రైవేటుసంస్థలకు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు దాఖలుచేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ అక్టోబర్ 4వ తేదీ వరకు చర్చలు జరుపకుండా కన్సీలియేషన్ ఆఫీసర్ (కార్మికశాఖ జాయింట్ కమిషనర్) చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎటువంటి కారణాలు లేకుండా చర్చల ప్రక్రియను వాయిదావేస్తూ కావాలని తాత్సారం చేశారని పేర్కొన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. కన్సీలియేషన్ విఫలమైందని కన్సీలియేషన్ అధికారి లేబర్ కమిషనర్‌కు రిపోర్ట్ ఇచ్చారని, కార్మికులు సమ్మెకు వెళ్లారని, తర్వాత ఇక చర్చల ప్రస్తావన ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. కన్సీలియేషన్ అధికారి చర్చలు వాయిదా వేయడానికి ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. అవన్నీ రోజువారీ కార్యక్రమాలని, చర్చలను వాయిదావేయడానికి కారణాలు చెప్పాలనే నిబంధనలు ఏమీలేవని తెలిపింది.

హైకోర్టు కూడా రోజువారీ విచారణలో భాగంగా చాలాసార్లు కేసులను వాయిదా వేస్తుందని, దానికి కారణాలు చూపాల్సిన అవసరంలేదని స్పష్టంచేసింది. కన్సీలియేషన్, చర్చల అంశాలను వదిలేయాలని, ఆ అంశాన్ని లేబర్‌కోర్టుకు రిఫర్ చేయాలని ఇప్పటికే తాము ఆదేశాలు జారీచేసిన అంశాన్ని గుర్తుచేసిన ధర్మాసనం.. 5,100 పర్మిట్లపై క్యాబినెట్ నిర్ణయంపై నేరుగా విషయానికి రావాలని సూచించింది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటుపరం చేస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని చిక్కుడు ప్రభాకర్ పేర్కొనడంతో.. ఎంవీ యాక్ట్ సెక్షన్ 67 టైటిల్‌ను చదువాలని ధర్మాసనం ఆదేశించింది. రోడ్డు రవాణా వ్యవస్థపై పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానివేనని సెక్షన్ 67 టైటిల్‌లోనే ఉన్నదని గుర్తుచేసింది. ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంలో తప్పేమున్నది? ఎంవీ యాక్ట్ సెక్షన్ 67 ద్వారా దఖలుపడ్డ అధికారాల ప్రకారం రవాణావ్యవస్థ నియంత్రణపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు కదా? క్యాబినెట్ నిర్ణయం అన్యాయం, చట్టవిరుద్ధం, ఏకపక్షం అని మీరు చెప్పే పదాలు వినటానికి బాగానే ఉంటాయి. వాటికి తగిన ఆధారాలుండాలి. వాదనలను నిరూపించినప్పుడే అలాంటి పదాలకు అర్థం ఉంటుంది అని ధర్మాసనం పేర్కొన్నది.

ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలు కలిసే ఉంటాయి

ఎంవీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణాను నియంత్రించే విషయంలో ప్రభుత్వ అధికారాలపై ఎక్కడా నిషేధంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. రోడ్డు రవాణాపై పూర్తిస్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నాయని తెలిపింది. ఏ రంగంలోనైనా ప్రైవేటు, ప్రభుత్వ వ్యవస్థలు కలిసే ఉంటాయని, అందుకే రవాణారంగంలో ప్రైవేటుసంస్థలకు అనుమతి ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపింది. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం రోడ్డు రవాణాలో ఆర్టీసీకి ఉన్న ఏకస్వామ్యాన్ని తొలిగించి, అందరికీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చని, అది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

ఆర్టీసీకి నోటీసులు ఇచ్చిన తర్వాతే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలా? అని ధర్మాసం ప్రశ్నించింది. ఎంవీ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం.. ప్రస్తుతం ఉన్న విధానాన్ని రద్దుచేసేందుకు లేదా సవరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాలని, స్థానిక భాషాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని, సదరు నిర్ణయం ద్వారా ప్రభావితమయ్యే ఆర్టీసీ, ఇతర వ్యక్తుల వాదనలు వినాలని, అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల సమయం ఇవ్వాలని చిక్కుడు ప్రభాకర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సీల్డ్ కవర్‌లో సమర్పించిన క్యాబినెట్ పత్రాలను పరిశీలించిన ధర్మాసనం.. 5,100 బస్సు పర్మిట్లు ఇచ్చేందుకు చట్టప్రకారం ప్రక్రియను చేపట్టేందునే క్యాబినెట్ అనుమతి ఇచ్చిందని స్పష్టంచేసింది. కనుక ప్రస్తుత పిటిషన్ ప్రీమెచ్యూర్ అవుతుందని వ్యాఖ్యానించింది. ఎంవీయాక్ట్ సెక్షన్ 102లో పేర్కొన్న ప్రొసీజర్‌ను అనుసరిస్తారో? లేదో? ఇప్పుడే ఎలా చెప్పగలుగుతామని, ఒకవేళ నిబంధనలను అనుసరించకుండా నిర్ణయిస్తే అప్పుడు హైకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొన్నది.

ప్రైవేటీకరణ వద్దని ఎక్కడ ఉన్నది?

ప్రైవేటు సంస్థలకు 5,100 బస్సు పర్మిట్లు ఇవ్వాలనే క్యాబినెట్ నిర్ణయం వల్ల ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ప్రభావితం అవుతారని, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సమ్మె జరుగుతుండగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కుట్రపూరిత ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగం ఎక్కడ జరిగిందో చూపించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె జరుగుతున్న సమయంలో నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారని, సమ్మె లేకుండా మామూలు సమయంలో నిర్ణయం తీసుకుంటే తప్పు కాదా? అని ప్రశ్నించింది. సెక్షన్ 67లో కార్మికుల ప్రస్తావన, వారిపై పడే ప్రభావం గురించి ఎక్కడా లేదని, ప్రైవేటుసంస్థలకు పర్మిట్లు ఇవ్వొచ్చని స్పష్టంగా ఉన్నదని ధర్మాసనం తెలిపింది. ఎంవీ యాక్ట్‌కు, కార్మికులకు సంబంధం లేనేలేదని చెప్పింది. అసలు ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టంలో ఉన్నదో చూపాలని కోరింది. ఒకప్పుడు విమానయానరంగానికి సంబంధించి ఎయిర్ ఇండియాకు ఏకస్వామ్యం ఉండేదని, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌కు అనుమతులు ఇచ్చిన తర్వాత కింగ్‌ఫిషర్ లాంటి సంస్థలు తప్ప అన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. పోటీని తట్టుకోలేని సంస్థలు వెళ్లిపోయాయని తెలిపింది.

ఇది గ్లోబలైజేషన్ యుగం..

1947లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, అప్పటి చట్టాలకు కూడా కాలంచెల్లిపోతున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ యుగం నడుస్తున్నదని తెలిపింది. అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలు దూసుకొస్తున్నాయని, ప్రస్తుతం ఎయిర్‌ఇండియా పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు కలిసే ఉంటాయని పేర్కొన్నది. చివరికి రైల్వేలను కూడా ప్రైవేటీకరించే విషయంలో కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలిపింది. పోటీని తట్టుకుని నిలబడినవారు ఉంటారని, ప్రైవేటీకరణ తప్పని ఎక్కడా లేదని పేర్కొన్నది. రోడ్డు రవాణాపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అయినప్పుడు ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవచ్చని స్పష్టంచేసింది.

ముఖ్యమంత్రి ఏమన్నారో మాకు సంబంధం లేదు..

ఆర్టీసీని ప్రైవేటీకరించబోమని ముఖ్యమంత్రి చెప్పారని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి ఏమన్నారనే విషయంతో తమకు సంబంధం లేదని, క్యాబినెట్ నిర్ణయం చట్టబద్ధమా? కాదా? అనే విషయాన్ని మాత్రమే తాము పరిశీలిస్తామని స్పష్టంచేసింది. ప్రాథమిక హక్కులను ఉల్లఘించేలా ప్రైవేటైజేషన్ చేయరాదని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ప్రభాకర్ తెలిపారు. కోర్టు సమయం పూర్తికావడంతో తదుపరి విచారణ బుధవారం చేపడుతామని చెప్పన ధర్మాసనం కేసును వాయిదా వేసింది.

ఆత్మహత్యలపై సీఎస్ కౌంటర్ అఫిడవిట్

ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కేసులో సీఎస్ ఎస్కే జోషి మంగళవారం హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేశారు. ఆత్మహత్యలకు కారణం ఆర్టీసీ సమ్మె అని చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్యలు ఎందుకు జరిగాయనేది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు జరిపే అంశంలో ఇప్పటికే లేబర్‌కోర్టుకు రిఫర్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని, ప్రస్తుతం విషయం కార్మికశాఖ కమిషనర్ పరిధిలో ఉన్నదని తెలిపారు.

ఉదారతతో డిమాండ్లు పరిష్కరించండి

సీఎం కేసీఆర్‌కు లోక్‌సత్తా నేత జేపీ లేఖ
విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టడంతో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన మిగిలిన అంశాలపై ఉదారతతో పరిశీలించి, పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక లేఖ రాశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేయాలన్న డిమాండ్‌ను కార్మికులు పక్కనపెట్టడం ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ వాదనలకు లభించిన విజయమని జేపీ పేర్కొన్నారు. కార్మికులపట్ల సానుభూతితో వ్యవహరించాలని, చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి ఉదారంగా చొరవ తీసుకోవాలని కోరారు.

4302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles