లెక్కల్లో తేడాలేంటి?

Fri,November 8, 2019 03:04 AM

-రవాణామంత్రిని, ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారు
-మిమ్మల్ని హైకోర్టు ఎలా నమ్మాలి?
-ప్రమాణపత్రంలో అబద్ధాలు చెప్పి.. క్షమాపణ కోరితే ఎలా?
-మేం ధిక్కరణ కింద పరిగణిస్తే ఏమవుతుందో తెలుసా?
-ఆర్టీసీ సమ్మె కేసులో సీనియర్ ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం
-టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధమైన గుర్తింపు లేదు
-ఏపీఎస్‌ఆర్టీసీ విభజనకు కేంద్రం అనుమతి తప్పనిసరి
-ఇంతవరకు కేంద్రం అనుమతి కోరలేదు
-హైకోర్టుకు వెల్లడించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్
-కేంద్రం అనుమతి ఎందుకు కోరలేదు?
-ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ప్రశ్న
-పూర్తి వివరాలు తెలియజేస్తామన్న అడ్వకేట్ జనరల్
-తెలంగాణ సంక్షేమ పథకాలు కేంద్రంకంటే ఉత్తమమైనవి
-తెలంగాణ ప్రాజెక్టులను చూసి దేశం ఆశ్చర్యపోయింది
-రైతులపట్ల ఉదారంగా ఉన్న ప్రభుత్వం
-కార్మికుల పట్ల కూడా అంతే ఉదారంగా ఉండాలి
-శక్తిమంతమైన ప్రభుత్వం దయ చూపించాలి
-రూ.30 వేల కోట్ల అప్పులో రూ.47 కోట్లు ఎంత?
-రూ.47 కోట్లు ఇచ్చే అంశాన్ని పునరాలోచించండి: హైకోర్టు
-విచారణ 11వ తేదీకి వాయిదా
-మూడున్నర గంటలపాటు కోర్టులో నిలబడ్డ సీనియర్ ఐఏఎస్‌లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీనియర్ ఐఏఎస్ అధికారులు తప్పుడు లెక్కలు ఎలా ఇస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ లెక్కలతో ఉన్నతాధికారులు రవాణాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారని అసహనం వెలిబుచ్చింది. ఇంతకుముందు సమర్పించిన అఫిడవిట్లలోని లెక్కలకు, ప్రస్తుత అఫిడవిట్లలోని లెక్కలకు తేడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్టీసీ సమ్మెను విరమింపజేసి ప్రజలకు రవాణాసౌకర్యాలు మెరుగయ్యేలా చూడాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఇచ్చిన అఫిడవిట్లతో మీరు సంతృప్తి చెందారా? అని సీఎస్ జోషిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను సంతృప్తి చెందానని, గతంలో కొన్ని లోటుపాట్లను సరిచేసుకుని ప్రస్తుతం కచ్చితమైన వివరాలతో అఫిడవిట్లు సమర్పించారని సీఎస్ ధర్మాసనానికి నివేదించారు.

మొదట ప్రమాణం చేసి ఇచ్చిన అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చామని ఒప్పుకొంటున్నారా? మొదట ఇచ్చింది తప్పయితే ఈ అఫిడవిట్లను మేం ఎలా నమ్మాలి? రికార్డుల సూక్ష్మ పరిశీలన అని ఒకసారి, మైక్రోస్కోపిక్ పరిశీలన అని ఇంకోసారి చెప్తారా? అఫిడవిట్ అంటే ఏమిటో తెలుసా? హైకోర్టుకు తప్పుడు లెక్కలు ఎలా ఇస్తారు? ప్రమాణం చేసి తప్పుడు ప్రకటన చేయడం, కోర్టును తప్పుదోవ పట్టించడం నేరం. దీనిని మేం ధిక్కరణ కింద పరిగ ణిస్తే ఏమవుతుంది? సీనియర్ ఐఏఎస్‌లు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇలా అబద్ధాలు చెప్తారని మేం ఊహించలేదు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు వాదనలు వినిపిస్తూ.. అఫిడవిట్ సమర్పించడానికి చాలా తక్కువ సమయం ఉండటంతో అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వివరాలను ఇచ్చానని పేర్కొన్నారు. గత అఫిడవిట్‌లో రూ.500 కోట్లు తక్కువగా చెప్పామని, మొత్తం ఇచ్చింది రూ.3,903 కోట్లు అని తెలిపారు. లెక్క తక్కువగా చెప్పినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. క్షమాపణలతో సమస్య పరిష్కారంకాదన్న కోర్టు.. అధికారులు తమ వైఖరిని పలుమార్లు మార్చుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అంతర్గత రికార్డుల్లో కచ్చితమైన లెక్కలు ఎందుకులేవని, అఫిడవిట్లు ఇచ్చే ముందే పే అండ్ అకౌంట్స్ వివరాలను ఎందుకు
తెప్పించుకోలేదని ప్రశ్నించింది.

ఇలాంటి అధికారులను చూడలేదు

జీహెచ్‌ఎంసీ నుంచి, ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉన్నదని రవాణాశాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారని, ఆర్టీసీ ఎండీ ఇచ్చిన లెక్కల ప్రకారమే మంత్రి ఆ ప్రకటన చేశారని ప్రస్తావించిన ధర్మాసనం.. ప్రస్తుతం రావాల్సిన నిధులు ఏమీలేవంటూ ఆర్టీసీ ఎండీ హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన అంశాన్ని ఎత్తిచూపింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున ఎక్కువ నిధుల కోసం మంత్రితో నిర్వహించిన అంతర్గత సమావేశంలో నిధులు రావాలని చెప్పామని ఆర్టీసీ ఎండీ హైకోర్టుకు తెలిపారు. రవాణాశాఖ మంత్రితో అంతర్గత సమావేశంలో వివరాలు చెప్పింది సెప్టెంబర్‌లో అని, అఫిడవిట్ ఇచ్చింది అక్టోబర్‌లో అని పేర్కొన్నారు. అన్ని రికార్డులు పరిశీలించి అఫిడవిట్ ఇచ్చామన్నారు. ఈ దశలో ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ బాస్‌ను తప్పుదోవ పట్టించినట్టు మీరే అంగీకరిస్తున్నారు.

హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించరని గ్యారెంటీ ఏమిటి? అసలు మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీరు రవాణాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని, ప్రజలను తప్పుదోవపట్టించారు. న్యాయమూర్తిగా మూడు హైకోర్టుల్లో పనిచేశాను. నా 15 ఏండ్ల సర్వీస్‌లో ఇలాంటి అధికారులను చూడలేదు. మీ లెక్కలన్నీ అర్థరహితం అని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ బకాయిలు చెల్లించడం తప్పనిసరి కాకపోతే మరి ఎందుకు అడుగుతున్నారని కోర్టు ప్రశ్నించింది. నష్టాలను భర్తీ చేయాలని జీహెచ్‌ఎంసీకి విజ్ఞప్తిచేశామని ఆర్టీసీ ఎండీ పేర్కొనగా.. జీహెచ్‌ఎంసీ ఏమైనా ట్రస్టును నడుతున్నదా? జీహెచ్‌ఎంసీ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు.. జీహెచ్‌ఎంసీ నుంచి బకాయిలు రావాలని రవాణాశాఖ మంత్రికి ఎందుకు చెప్పారు? ఆర్థికశాఖ, ఆర్టీసీ ఎండీ, జీహెచ్‌ఎంసీ ముగ్గురు మూడురకాల రాగాలు పాడుతున్నారు. ప్రభుత్వానికి మీరు లాయల్టీ చూపండి.. తప్పులేదు. కానీ హైకోర్టుకు లాయల్టీ చూపకుండా తప్పుడు వివరాలు ఇవ్వడం శోచనీయం అని ధర్మాసనం మండిపడింది.
TS-HighCourt1

తెలంగాణ పథకాలు కేంద్రం కంటే గొప్పవి: సీజే

సీనియర్ అధికారుల లెక్కలు నమ్మదగిన విధంగా లేవని, వాస్తవాలు ఏమిటో ప్రభుత్వమే చెప్పాలని చీఫ్ జస్టిస్ చౌహాన్.. ఏజీ బీఎస్ ప్రసాద్‌ను ఉద్దేశించి అన్నారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రధాన ప్రార్థన (మెయిన్ ప్రేయర్) ఏమిటో చూడాలని, దాని ప్రకారం విచారణ జరుపాలని విజ్ఞప్తిచేశారు. దీనికి ధర్మాసనం.. మెయిన్ ప్రేయర్ విషయం గురించి పక్కన పెట్టండి. కార్మికుల డిమాండ్లలోని నాలుగు డిమాండ్ల పరిష్కారానికి, ఇరుపక్షాల మధ్య పరస్పర విశ్వాసాన్ని నెలకొల్పేందుకు రూ.47 కోట్లు ఇస్తారా? ఇవ్వరా? అని ఏజీని ప్రశ్నించింది. ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం రాష్ట్రం రూ.30 వేల కోట్ల అప్పులు చేసిందని, అవే ఇప్పుడు భారంగా మారాయని ఏజీ తెలిపారు. రైతుల బాగుకోసం రూ.30 వేల కోట్ల అప్పుచేసిన మీరు రూ.47 కోట్లు ఇవ్వలేరా? రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు చేసింది.

తెలంగాణ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. కేంద్రం అమలుచేస్తున్న పథకాల కంటే గొప్పగా ఉన్నాయి. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. తెలంగాణ నిర్మించిన (కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశిస్తూ) ప్రాజెక్టు ఓ వండర్‌గా నిలిచింది. రాష్ట్రంలోని రైతుల 80% సాగునీటి అవసరాలను తీర్చామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 100% సాగునీటి అవసరాలను తీరుస్తామని, సాగునీటిపారుదల విషయంలో రాష్ర్టాన్ని సుభిక్షం చేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. తెలంగాణ ప్రాజెక్టులు, పథకాలపై అంతటా చర్చ జరుగుతున్నది. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు చేపడుతున్నారు. రైతుల పట్ల ఇంత ఉదారంగా ఉన్న ప్రభుత్వం.. రూ.47 కోట్ల విషయంలో ఎందుకు కఠిన వైఖరి తీసుకుంటున్నది? ప్రభుత్వం ప్రజలను తన సొంతబిడ్డల్లా భావించాలి. ధర్మశాస్ర్తాలు కూడా ఇదే చెప్తున్నాయి. తనను నమ్మి వచ్చిన పక్షి కోసం ఓ చక్రవర్తి తన రక్తమాంసాలను ధారపోశాడు. తాను తిన్నా తినకపోయినా తల్లి తన బిడ్డల కడుపు నింపడం కోసం తాపత్రయపడుతుంది. రూ.30 వేల కోట్ల అప్పులో రూ.47 కోట్లు ఎంత? సముద్రంలో నీటి బిందువు అంత కూడా కాదు. ప్రభుత్వం ఎంత శక్తిమంతమైనదైతే అంత దయ, ఉదార స్వభావం కలిగి ఉండాలి. రూ.47 కోట్లు ఇచ్చే అంశాన్ని పునరాలోచించండి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదు: ఏఎస్‌జీ

టీఎస్‌ఆర్టీసీలో 33% వాటా ఉన్న కేంద్రం తన వైఖరిని తెలుపాలని కోరడంతో.. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు తన వాదనలు వినిపించారు. టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధమైన గుర్తింపు (లీగల్ శాన్టిటీ) లేదని పేర్కొన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదని తెలిపారు. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చట్టం- 1950 సెక్షన్ 47 (ఏ) ప్రకారం ఏపీఎస్‌ఆర్టీసీని రీకాన్‌స్టిట్యూట్ చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని చెప్పారు. కేంద్రాన్ని ఇప్పటి వరకు అనుమతి కోరలేదని తెలిపారు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఉన్న 33% వాటా ఆటోమేటిక్‌గా టీఎస్‌ఆర్టీసీలో అలాగే కొనసాగాలని లేదని పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వ్యవహారాలను చూస్తున్న ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ చట్టం సెక్షన్ 3 ప్రకారం టీఎస్ ఆర్టీసీని కొత్త కార్పొరేషన్‌గా ఏర్పాటుచేశామని తెలిపారు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన వ్యవహారాలన్నీ కేంద్రం పరిధిలో ఉన్నాయని, ఇప్పటివరకు విభజన జరుగలేదని తెలిపారు. విభజనకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున సెక్షన్ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటుచేశామని వివరించారు.

కొత్తగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసినప్పుడు మాతృసంస్థ ఆస్తుల్లో హక్కు ఎలా కోరుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ షెడ్యూల్ 9 సంస్థల్లో ఉన్నందున విభజన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నదని, అధికారికంగా విభజన పూర్తికాలేదని రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో రవాణా అవసరాల కోసం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ యాక్ట్ 47 (ఏ) ప్రకారం కేంద్రం అనుమతి ఎందుకు కోరలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీ యాక్ట్ సెక్షన్ 47 (ఏ), సెక్షన్ 3, ఏపీ పునర్విభజన చట్టం తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలియజేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు. ఈ మేరకు విచారణను 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ధర్మాసనం.. అందరు అధికారులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అయితే రూ.47 కోట్లు ఇచ్చే అంశాన్ని మాత్రం పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపింది. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ముందుకు రావాలని తాము కోరుతున్నామని, ఎక్కువ బలం ఉన్నవారు, పెద్దవారే మొదట ముందడుగు వేయాలని పేర్కొన్నది. తమ విజ్ఞప్తిని ప్రభుత్వానికి తెలియజేయాలని సీఎస్ ఎస్కే జోషికి హైకోర్టు సూచించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. విచారణకు హాజరైన సీనియర్ ఐఏఎస్‌లు మూడున్నర గంటలపాటు హైకోర్టుకు వివరణ ఇస్తూ నిలబడి ఉన్నారు.

4715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles