నిబంధనల మేరకే మెడికల్ సీట్ల భర్తీ


Wed,August 14, 2019 01:39 AM

High Court Replacement of medical seats as per rules

-550 ప్రకారమే వ్యవహరిస్తున్నాం
-కేఎన్‌ఆర్ హెల్త్‌వర్సిటీ కౌంటర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జారీచేసిన జీవో నంబర్ 550 ప్రకారమే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీచేస్తున్నామని కాళోజీ నారాయణరావు ఆరోగ్యశాస్ర్తాల విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) పేర్కొన్నది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో రిజర్వేషన్లు పాటించడంలేదని పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో యూనివర్సిటీ రిజిష్ర్టార్ డీ ప్రవీణ్‌కుమార్ మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం మొదటి దశ కౌన్సెలింగ్‌లో 50 శాతం ఓపెన్ క్యాటగిరీ సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాటగిరీలతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం, రిజర్వుడు క్యాటగిరీ సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేపట్టామని తెలిపారు. మెరిట్ ప్రకారం ఓపెన్ కోటాలో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉత్తమ కాలేజీ, ఉత్తమ కోర్సుల కోసం తిరిగి రిజర్వుడు క్యాటగిరీలో సీటు పొందేందుకు అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

ఈ విధంగా ఓపెన్ కోటాలో ఖాళీ అయిన సీటును మళ్లీ అదే క్యాటగిరీకి చెందిన మెరిట్ విద్యార్థులతో భర్తీ చేస్తున్నామని చెప్పారు. దీంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఓపెన్ క్యాటగిరీ, రిజర్వుడు సీట్లు 50ః50 శాతానికి మించకుండా వ్యవహరిస్తున్నామని తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులకు ఆయా క్యాటగిరీల్లో కటాఫ్ కన్నా ఎక్కువ నీట్ ర్యాంకు వచ్చినందున వారికి ఎంబీబీఎస్‌లో సీటు లభించలేదని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరకుండా సీట్లు ఖాళీగా ఉండే సందర్భాల్లో ఖాళీగా ఉన్న సీట్లును అదే క్యాటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎవరికీ అన్యాయం జరుగడంలేదని తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదావేసింది.

హైకోర్టుకు లింగన్న రీ-పోస్ట్‌మార్టం రిపోర్ట్

భద్రాద్రి కొత్తగూడెంలోని రాళ్లగడ్డ అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌కు గురైన పున్నం లింగన్న మృతదేహానికి నిర్వహించిన రీ-పోస్ట్‌మార్టం నివేదికను సీల్డ్‌కవర్‌లో ప్రభుత్వం తరఫు న్యాయవాది మంగళవారం హైకోర్టుకు సమర్పించారు. ముగ్గురు వైద్యనిపుణుల సమక్షం లో గాంధీ దవాఖానలో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రీ-పోస్ట్‌మార్టం నివేదికను సీల్డ్ కవర్‌లో ప్రభుత్వ న్యాయవాదికి అందజేశారు. ఈ అంశంపై ఈ నెల 19న విచారణ చేపడుతామని హైకోర్టు పేర్కొన్నది.

512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles