అనుభవం నేర్పిన పాఠం


Tue,August 13, 2019 02:45 AM

Huge inflow to Srisailam dam

-శ్రీశైలానికి భారీ ఇన్‌ఫ్లోతో జనం మదిలో 2009 పరిణామాలు
-సీడబ్ల్యూసీ సూచనలతో శ్రీశైలంలో సాఫీగా వరద నియంత్రణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సెప్టెంబర్ 2009.. కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేసింది. శ్రీశైలం జలాశయానికి వరద లక్షల క్యూసెక్కులో పోటెత్తింది. కానీ, అప్పటి అధికారులో, నాటి సర్కారో, కారకులెవరైనా కేంద్ర జల సంఘం హెచ్చరికలను సైతం పెడచెవినపెట్టి శ్రీశైలం జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపిన తర్వాతే దిగువకు నీటిని విడుదలచేస్తామంటూ భీష్మించుకుకూర్చున్నారు. అంతే! ఎగువనుంచి ఏకంగా పది లక్షలు.. 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ముంచెత్తడంతో జలాశయం గరిష్ఠ నీటిమట్టాన్ని దాటింది. ఫలితంగా కర్నూలు పట్టణం పెను ప్రమాదంలో పడింది. అదృష్టవశాత్తు ఎగువనుంచి వరద కాస్త తగ్గుముఖం పట్టడం, జలాశయం నుంచి పెద్దఎత్తున నీటిని దిగువకు వదలడంతో ముప్పుతప్పింది. నాటి అనుభవం పాఠాలు నేర్పింది. అందుకే ఇప్పుడు శ్రీశైలం జలాశయంలో వరద నీటి నిర్వహణ సాఫీగా సాగుతున్నది. గత తప్పిదాన్ని పునరావృతం చేయకుండా ప్రాజెక్టు అధికారులు ముందునుంచే సీడబ్ల్యూసీ సూచనలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు ఎగువ వరదను అంచనావేస్తూ జలాశయ నీటిమట్టం, అవుట్‌ఫ్లోను నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఎగువనుంచి భారీ వరద వస్తున్నా ప్రతికూల పరిణామాలకు ఆస్కారం లేకుండా ఉన్నది.

ఆ సమీక్షకు అనుగుణంగానే

శ్రీశైలం విషయంలో 2009 జరిగిన పరిణామాల తర్వాత ఉన్నతస్థాయి నిపుణులు డ్యాం భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఎగువ నుంచి భారీ వరద (20 లక్షల క్యూసెక్కులను ప్రామాణికంగా తీసుకొని) వస్తే ఏం చేయాలనే దానిపై సూచనలుచేశారు. 24 గంటల ముందే జలాశయానికి భారీ వరద వస్తుందనే సమాచారం ఉన్నట్లయితే వెంటనే జలాశయంలో నీటిమట్టాన్ని 876.60 అడుగుల వరకు తగ్గించాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్‌లో పూర్తిస్థాయి నిల్వ (ఎఫ్‌ఆర్‌ఎల్) 892 అడుగులుగా రూపొందించారు. డ్యాం పైభా గం(టాప్) స్థాయి 904 అడుగులుగా ఉం టుంది. 892 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కర్నూలు నగ రం ముంపునకు గురికానుందని గుర్తించి.. శ్రీశైలం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 885 అడుగులకు కుదించారు. డ్యాంకు ఏర్పాటుచేసిన 12 రేడియల్ గేట్లను గరిష్ఠంగా 19 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జితో డిజైన్‌చేశారు. ఆధునీకరణ తర్వాత 13,55,680 క్యూసెక్కులుగా డిజైన్‌చేశారు. ఇందులో 2-11 అంటే పది గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా నీటిని వదలాల్సి ఉంటుంది. రెండు చివరల్లో ఉన్న 1-12 గేట్లను మాత్రం కేవలం అత్యవసర సమయాల్లోనే వినియోగించాల్సి ఉంటుంది.

వీటి వినియోగం వల్ల డ్యాంకు రెండువైపులా ఉన్న నిర్మాణం (ఫ్లాంక్స్) కోతకు గురవుతాయి. 2009 వరకు ప్రాజెక్టు చరిత్రలో వీటినెప్పుడూ వినియోగించలేదని నిపుణుల కమిటీ నివేదికలో ఉన్నది. 2009, సెప్టెంబర్ నాలుగో తేదీన మధ్యాహ్నం 12.30 గంటలనుంచి ఒంటి గంట మధ్య శ్రీశైలం నీటిమట్టం 896.2 అడుగులుగా నమోదైంది. జలాశయం నుంచి ఏకంగా 14.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడం ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు. పోతిరెడ్డిపాడు ద్వారా డిశ్చార్జి 1.10 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారిక రికార్డుల్లోనే నమోదు చేశారని అధికారి ఒకరు తెలిపారు. ఫలితంగానే కర్నూలు నగరంపై వరద పడగ విప్పింది. అదృష్టవశాత్తు పెను ముప్పు సంభవించనప్పటికీ ప్రాజెక్టు చరిత్రలో అదో చేదు అనుభవమని అధికారులు చెప్తున్నారు. ఈస్థాయి పరిణామాల్లోనూ డ్యాంకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడం పటిష్ట నిర్మాణానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

5058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles