హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

Sun,September 22, 2019 02:14 AM

-ఖరారుచేసిన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్
-నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల సంబురాలు
-గులాబీ జెండా ఎగురవేస్తాం
- ఉత్తమ్ వల్లే హుజూర్‌నగర్ వెనుకబాటు
-విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
-హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి
-ఖరారుచేసిన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్

హైదరాబాద్/సూర్యాపేట ప్రతినిధి/ హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌పై గులాబీ జెండా ఎగురవేయడానికి టీఆర్‌ఎస్ పక్కా ప్రణాళికను రూపొందించింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలచేసిన వెంటనే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారుచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి అనేక మంది నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు వివిధ పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందుకొచ్చారు. అదేదారిలో మరికొందరు ఉత్సాహం చూపుతున్నారు. హుజూర్‌నగర్ ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, హుజూర్‌నగర్ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకొన్నాయి. హుజూర్‌నగర్, మేళ్లచెర్వు, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లోని రహదారులపై పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. మఠంపల్లిలో సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకంచేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొంటామన్నారు.
Sanampudi-SaidiReddy

ఉద్యమానికి మద్దతుగా ఎన్నారై సంఘం ఏర్పాటు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం, గుండ్లపల్లి గ్రామానికి చెందిన శానంపూడి సైదిరెడ్డి తల్లిదండ్రులు శానంపూడి అంకిరెడ్డి, సత్యావతి వ్యవసాయ కుటుంబానికి చెందినవారే. సైదిరెడ్డికి భార్య రజిత, కుమారులు అంకిత్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి ఉన్నారు. 18 ఏప్రిల్ 1974లో జన్మించిన సైదిరెడ్డి పదో తరగతివరకు మఠంపల్లిలోని వీవీఎం హైస్కూల్‌లో, ఇంటర్ హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, డిగ్రీ హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిని కాలేజీలో చదివారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అక్కడే ఉద్యోగం సంపాదించారు. 1999 నుంచి 2000 వరకు మఠంపల్లి మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా ఎన్నారై అసోసియేషన్ ఏర్పాటుచేశారు. కెనడాలో ఉంటూ తెలంగాణలోని గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కామాక్షి సొసైటీ ద్వారా నిరుపేద విద్యార్థులకు సాయం, గ్రామీణ విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
Sanampudi-SaidiReddy1

టీఆర్‌ఎస్‌దే గెలుపు: మంత్రి జగదీశ్‌రెడ్డి

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిదే గెలుపని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించారని మీడియాతో అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారణంగానే హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురయిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారని చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల శానంపూడి సైదిరెడ్డి శనివారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

1282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles