బాబ్రీ సక్రమమా?.. అక్రమమా?

Mon,November 11, 2019 02:26 AM

- సక్రమమైతే రామ్‌లల్లాకు ఎలా అప్పగిస్తారు?
- అక్రమ కట్టడమైతే అద్వానీ తదితరులపై విచారణ ఎందుకు?
- స్థలం కోసం కాదు.. మసీదు కోసమే మా పోరాటం: ఒవైసీ

హైదరాబాద్‌: బాబ్రీ మసీదు సక్రమమా?.. అక్రమమా? అని మజ్ల్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. శనివారం రాత్రి దారుసలాంలో మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘బాబ్రీ మసీదు కట్టడం సక్రమమైతే, దాన్ని కూల్చిన వారికి ఆ స్థలాన్ని ఎలా అప్పగిస్తారు? అది అక్రమ కట్టడమైతే అద్వానీ తదిరులపై ఎందుకు విచారణ జరుపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ సక్రమమే అయితే మసీదును మాకు అప్పగించాలి. తీర్పుపట్ల మేం అసంతృప్తిగా ఉన్నాం. బాబ్రీ మసీదుపై మాకు చట్టపరమైన హక్కు ఉన్నది. మసీదు కోసమే నా పోరాటం తప్ప స్థలంపై కాదు’ అని వ్యాఖ్యానించారు. ఆదివారం కూడా అసదుద్దీన్‌ పలు ట్వీట్లు చేశారు. ‘ప్రస్తుతం ముస్లింలు ఎలా భావించాలి? చాలా ఏండ్లుగా అక్కడ ఉన్న ఒక మసీదును కూల్చివేశారు. ఆ స్థలం రామ్‌లల్లాకు చెందుతుందని, అక్కడ మందిరం నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మాకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని చెప్పి మమ్మల్ని అవమానించింది.

మేం బిచ్చగాళ్లం కాదు.. గౌరవనీయమైన భారత పౌరులం. చట్టపరమైన హక్కు కోసమే మా పోరాటం. న్యాయం కోరుతున్నాం తప్ప బిచ్చం కాదు’ అని పేర్కొన్నారు. ‘మీ ఇంటిని కూల్చివేసినప్పుడు మీరు కోర్టును ఆశ్రయిస్తే.. ఆ ఇంటిని మీకు అప్పగిస్తారా లేక కూల్చివేసిన వారికి ఇస్తారా?’ అని మరో ట్వీట్‌లో ఒవైసీ ప్రశ్నించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ కలిసి మరెన్నో మసీదులను మందిరాలుగా మార్చడానికి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles