చెరువులో ప్లాట్ల దందా


Wed,April 24, 2019 02:45 PM

Illegal Danda of Reuters in Nawab Peta Jangam district

-రియల్టర్ల దాహానికి కుదించుకుపోయిన జలవనరు
-శిఖం భూములు కబ్జా.. ఫీడర్ చానల్ పూడ్చివేత
-సాగుభూముల కన్వర్షన్.. అక్రమనిర్మాణాలు, లేఔట్లు
-జనగామ జిల్లా నవాబ్‌పేటలో రియల్టర్ల అక్రమ దందా
-బాధ్యతలు విస్మరించిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు
-అరికట్టకపోగా అక్రమార్కులకు కొందరి సహకారం

చెరువును మింగేసి.. ఫీడర్ చానల్‌ను పూడ్చేసి..లింగాలఘనపురం మండలం నవాబ్‌పేట శివారు బీసీ కాలనీ వెనుకాల 840 సర్వే నంబర్‌లో 62 ఎకరాల 38 గుంటల విస్తీర్ణంలో చొప్పని చెరువు ఉన్నది. ఈ చెరువు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ప్రభుత్వం ఒకటనుకుంటే కొందరు అధికారులు ఇంకోరకంగా వ్యవహరిస్తారు. అసలు స్ఫూర్తినే దెబ్బతీసి ప్రజలను బాధితులను చేస్తారు. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను బాగుచేసి వ్యవసాయాన్ని పండుగ చేయాలనే కృతనిశ్చయంతో ముందుకు వెళ్తుంటే రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖల్లోని కొందరు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం సర్కార్ లక్ష్యానికి గండికొడుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చడం, చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోకపోవడం.. పైగా రియల్టర్లతో మిలాఖతవుతుండటం ఇలాంటి విపరిణామాలకు దారితీస్తున్నది. తవ్వినకొద్దీ కొందరు రెవెన్యూ అధికారుల అక్రమ వ్యవహారాలు బయటపడుతున్నాయి. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్ల, నవాబ్‌పేట గ్రామాల్లో ఇలాంటి ఉదంతాలే చోటుచేసుకున్నాయి.

పలు చెరువులు, కుంటలు అదృశ్యమై వాటి స్థానంలో వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. వీటిని పరిశీలించి నియంత్రించేవారే కనిపించడం లేదు. నవాబ్‌పేటలోని బీసీ కాలనీ వెనుకాల ఉన్న చొప్పని చెరువును కబ్జా చేసిన రియల్టర్లు ఆ పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్‌గా మార్చారన్న ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీరాజ్‌శాఖల నిర్లక్ష్యం అనుమానాలకు తావిస్తున్నది. కేవలం నోటీసులతో సరిపెట్టిన అధికారులు ముందస్తు చర్యలకు జంకుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రెవెన్యూ మాయాజాలంలో ఇది మరో ఉదంతం.. అక్రమ సంపాదన కోసం ఎంతకైనా తెగించే రియల్టర్లు ఏకంగా ఓ చెరువునే మింగేశారు. ఫీడర్ చానల్‌ను పూడ్చేశారు.
Cheruvu-katta
కొందరు రైతుల నుంచి భూములు కొన్నారు. మరికొందరివి ఆక్రమించారు. వ్యవసాయభూమిని చదును చేసి వెంచర్‌గా మార్చారు. త్వరలోనే ప్లాట్లను చేసి అమ్మడానికి సిద్ధపడుతున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నవాబ్‌పేటలోని తతంగమిది. బీసీ కాలనీ వెనుకాల ఉన్న చొప్పని చెరువు కబ్జా వెనుక కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారుల ప్రమేయముందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్ల, నవాబ్‌పేట గ్రామాల్లో ఇలాగే పలు చెరువులు, కుంటలు అదృశ్యమై వాటి స్థానంలో వెంచర్లు పుట్టుకొస్తున్నాయి.

కింద సుమారు 276 ఎకరాల ఆయకట్టు సాగవుతుందని నీటిపారుదలశాఖ అధికారులు చెప్తున్నారు. ఆ చెరువు శిఖం ఆనుకుని పట్టా భూములున్నాయి. సాగు చేసుకోవడానికి తప్ప వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదని రెవెన్యూ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన చిట్‌ఫండ్ నిర్వాహకుడు శ్రీనివాస్‌రెడ్డి ఆ పట్టా భూములను సంబంధిత రైతులను ఏమార్చి కొనుగోలు చేశాడు. ఆ భూములతోపాటు పక్కనే ఉన్న చొప్పని చెరువులోని కొంత భాగాన్ని ఆక్రమించాడు. అంతేగాకుండా నవాబ్‌పేట వాగు నుంచి చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ చానల్‌ను సైతం పూడ్చేసి ప్రహరీ నిర్మాణం చేశాడు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో వెంచరుగా మార్చాడు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని గ్రామపంచాయతీ అధికారులు సంబంధిత రియల్టర్‌కు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. ఆ నోటీసులకు ఏ మాత్రం స్పందించని రియల్టర్ వెంచర్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోరు వేసి రోడ్లు, వీధి దీపాల కోసం స్తంభాలు ఏర్పాటుచేశాడు.
Katta
ఇంత జరుగుతున్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న రియల్టర్‌పై పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకూడదని రెవెన్యూశాఖ నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. చెరువు శిఖం, ఏక్‌సాల్‌పస్లా భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కన్వర్షన్ చేయరాదని నిబంధనలున్నాయి. నవాబ్‌పేట చొప్పని చెరువుకు అనుకుని ఉన్న పట్టా భూములను నీటితో నిండినప్పుడు వదిలేసి నీళ్లు లేనప్పుడు సాగుచేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి భూములను వ్యవసాయం చేసుకోవడానికే తప్ప వాటిలో ఎలాం టి నిర్మాణాలు చేయడానికి వీల్లేదని నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. ఈ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడంలో కొందరు రెవెన్యూ అధికారులే కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్టర్ వద్ద నుంచి పెద్దమొత్తంలో ముడుపులు తీసుకున్న ఓ అధికారి అక్రమంగా కన్వర్షన్ చేశారనే విమర్శలున్నాయి. రెవెన్యూ, పంచాయతీ అధికారుల అండదండలతో రెచ్చిపోయి సుమారు 70 ఎకరాలను చదును చేసి వెంచర్‌గా మార్చిన రియల్టర్ త్వరలో ప్లాట్లుగా చేసి బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
నా భూమిని ఆక్రమించారు


బూడిది నర్సయ్య

మా తండ్రి ద్వారా సంక్రమించిన 5 ఎకరాల భూమిని సైతం రియల్టర్ ఆక్రమించుకుని ప్రహరీ నిర్మించాడు. దీనిపై కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేశాను. సమాచార హక్కు చట్టం కింద కూడా దరఖాస్తు చేశాను. కానీ ఎవ్వరు కూడా ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదు. రేపు మాపు అంటూ తిప్పుకొంటున్నారు. నా భూమిని ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
- బూడిది నర్సయ్య, బాధిత రైతు, నవాబ్‌పేట
చెరువును మాయంచేశారు


బోయిని శిరీషారాజు

చొప్పని చెరువును కంది శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించాడు. చెరువు శిఖం పట్టా భూములను సైతం కొనుగోలు చేసి అక్రమంగా వ్యవసాయేతర భూములుగా మార్చుకున్నాడు. నవాబ్‌పేట నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేందుకు నిర్మించిన ఫీడర్ చానల్‌ను సైతం పూడ్చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ ఆక్రమణలపై రెవెన్యూ, పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదుచేసిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
- బోయిని శిరీషారాజు, ఎంపీపీ, లింగాలఘనపురం

నోటీసులు జారీచేశాం

చెరువుశిఖం భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి నోటీసులు జారీచేశాం. స్పందన లేకపోవడంతో రెండోసారి కూడా నోటీసులిచ్చాం. అయినప్పటికీ స్పందించని కారణంగా పనులు నిలుపు చేయిం చాం. ఇప్పటికీ ఆ భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం సమాచారం చేరవేశాం. వారి ఆదేశాల మేరకు రియల్టర్‌పై చర్యలు తీసుకుంటాం.
- ప్రభాకర్ ఈవో పీఆర్‌డీ, లింగాలఘనపురం

ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించాల్సి ఉంది

చెరువు శిఖం ఆక్రమణకు గురైన ఫిర్యాదు మేరకు ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించాల్సి ఉంది. ఇరిగేషన్ అధికారులకు లేఖరాశాం. పనిఒత్తిడితో కొంచెం ఆలస్యం అవుతున్నది. వాస్తవానికి శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదు. వ్యవసాయ భూములను సైతం కన్వర్షన్ చేయడానికి వీల్లేదు. ఇరిగేషన్ అధికారులు ఎఫ్‌టీఎల్ హద్దులు ఫిక్స్ చేసిన తర్వాత అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
- రంగా, తాసిల్దార్, లింగాలఘనపురం

5672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles