చిందేస్తున్న చెరువులు


Wed,August 14, 2019 01:59 AM

Increased storage capacity in mission kakatiya Ponds

-రాష్ట్రవ్యాప్తంగా పన్నెండున్నర వేల తటాకాల్లో జలకళ
-గోదావరి బేసిన్‌లో అధికంగా నిండిన చెరువులు
-కృష్ణాబేసిన్‌లో ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల
-మిషన్ కాకతీయ చెరువుల్లో పెరిగిన నిల్వ సామర్థ్యం
-భూగర్భజలాలకు దన్నుగా నిలువనున్న తటాకాలు
-చెరువు ఆయకట్టుకు ఢోకాలేదంటున్న రైతాంగం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఊరికి ఆదెరువు.. జలకళలాడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వేల తటాకాలు నిండుతూ, వాటిల్లో అనేకం మత్తడిదుంకుతున్న దృశ్యాలు.. అన్నదాతల్లో భరోసా నింపుతున్నాయి. గత కొన్నిరోజులుగా కురిసిన భారీవర్షాలకు రాష్ట్రంలో చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరుగటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. సాగునీటి అవసరాలతోపాటు ప్రధానంగా భూగర్భజలాలకు ఇక ఢోకాలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోదావరి బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురియడంతో ఇక్కడి అత్యధిక చెరువులు నిండుకుండల్లా మారాయి. ఏకంగా 21 శాతం చెరువులు మత్తడి దుంకుతుండగా.. అంతకు మూడురెట్ల చెరువులు.. వాటి నిల్వ సామర్థ్యంలో సగానికి పైగా నిండటం విశేషం. కృష్ణా, గోదావరి.. రెండు బేసిన్లలోనూ మొత్తం 42వేల పైచిలుకు చెరువులు ఉండగా.. 50 శాతం నుంచి వందశాతం వరకు నిండినవి, అలుగుపోస్తున్నవి దాదాపు 12,500 ఉన్నాయి. మరో 4700కుపైగా చెరువులు 35%-50% నిండాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 37 శాతానికిపైగా చెరువులు అలుగుపోస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 928 చెరువుల్లో ఏకంగా 927 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మిగిలిన చెరువు కూడా 50-70 శాతం నీటినిల్వకు చేరుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2702 చెరువులకుగాను 892 అలుగుపోస్తున్నాయి.

కృష్ణాబేసిన్ చెరువులకు ప్రాజెక్టుల ద్వారా

గోదావరితో పోలిస్తే కృష్ణాబేసిన్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం తక్కువగా నమోదైంది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆశించినస్థాయిలో వర్షపాతం నమోదుకాలేదు. గోదావరి బేసిన్‌తో పోలిస్తే ఇక్కడి చెరువుల్లో జలకళను సంతరించుకున్నవి తక్కువగా ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 41 చెరువులు మత్తడి దుంకుతుండగా.. ఇందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో ఆరువేలకు పైగా చెరువులు ఉంటే 23 చెరువులే అలుగుపోస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గత కొన్నేండ్లుగా చెరువులకు జీవంపోస్తున్న సర్కారు.. ఈసారి కూడా ముందస్తుగానే అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా విడుదలచేసిన నీటిని ఒకవైపు సాగు అవసరాలకు అందిస్తూనే ప్రధానంగా చెరువులు నింపడంపైనే అధికారులు దృష్టిసారించారు.

ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా రెండు దశల ప్రాజెక్టుల కింద ఏకంగా 700 చెరువులను నింపడం లక్ష్యంగా ఎంచుకున్నారు. గత ఏడాది ఒక్క కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కిందనే రికార్డుస్థాయిలో 340 చెరువులను పలు దఫాలుగా నింపడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరుగటమేకాకుండా.. రైతాంగం విస్తారంగా పం టలు పండించుకున్నది. నాగార్జునసాగర్‌కు ఈసారి ముందుగానే భారీ వరద వచ్చిన దరిమిలా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో భారీ ఎత్తున చెరువులు నింపేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైలెవల్ కాల్వ పరిధిలోని సుమారు 93 చెరువులతోపాటు లోలెవల్ కెనాల్ కింద ఉన్న సుమారు 40 చెరువులకు ఈసారి జలకళ రానుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.
ponds3

ponds2

3678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles