ఎగువనఎండమావేనా?

Thu,October 10, 2019 02:37 AM

-ఈ ఏడాదీ గోదావరి నీటికోసం తప్పని ఎదురుచూపులు
-జైక్వాడ్‌కు 121, ఎస్సారెస్పీలోకి 75 టీఎంసీలు మాత్రమే ఇన్‌ఫ్లో
-దిగువన లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు
-కృష్ణా బేసిన్‌లో మళ్లీ మొదలైన ఇన్‌ఫ్లోలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది అంచనాలకుమించి కురుస్తున్న వర్షాలతో దేశవ్యాప్తంగా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణాబేసిన్‌కు దశాబ్దం తర్వాత జలకళ వచ్చింది. గోదావరి ఉపనదుల్లోనూ భారీఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి. ఇంతటి అనుకూల పరిస్థితుల్లోనూ ప్రధానగోదావరిలో వరద ఎండమావిగానే మారింది. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీనుంచి ఇప్పటివరకు ప్రధాన గోదావరి మొదలు దిగువన ధవళేశ్వరం వరకు నమోదైన ఇన్‌ఫ్లోలు పరిశీలిస్తే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తున్నది. ప్రధాన గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన జైక్వాడ్ ప్రాజెక్టుకు ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన వరద 121 టీఎంసీలు మాత్రమే. శ్రీరాంసాగర్‌కు వచ్చింది 75 టీఎంసీలే. శ్రీరాంసాగర్ దిగువన కడెం నుంచి కొంత ఆశాజనకమైన వరద ఉండగా.. ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి ప్రాణం వచ్చింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కాళేశ్వరం మీదుగా వేల టీఎంసీల వరద ఉన్నది. ఆపై ఇంద్రావతి, దిగువన శబరి వంటి ప్రధాన ఉపనదులు తోడై మరింత ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే తాజా నీటి సంవత్సరంలో ఇప్పటివరకు ఏకంగా 3,522.34 టీఎంసీల గోదావరిజలాలు సముద్రంలో కలిశాయి. ఇందులో ప్రధానంగా ప్రాణహిత నుంచి అత్యధికంగా వచ్చాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బుధవారం కూడా శ్రీరాంసాగర్‌కు కేవలం 8170 క్యూసెక్కుల వరద మాత్రమే నమోదవగా... పేరూరు దగ్గర ఏకంగా లక్షన్నర క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం ఉంది.


-శ్రీశైలానికి పెరిగిన వరద
కృష్ణాబేసిన్‌లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపుర జలాశయాలకు 20 వేల నుంచి 25 వేల క్యూసెక్కుల వరద ఉండగా.. తుంగభద్ర నుంచి కూడా 25-30 వేల క్యూసెక్కులు నమోదవుతున్నది. జూరాల జలాశయం నుంచి దిగువకు 50-60వేల క్యూసెక్కుల వరకు వస్తుండగా.. తుంగభద్ర నుంచి క్యూసెక్కుల వరకు తోడవుతుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి బుధవారం లక్ష క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో నమోదయింది. సాగర్ ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉండటంతో బుధవారం అధికారులు రెండు గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువకు నీటిని విడుదలచేశారు.

321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles