చివరి చెరువూ చిందేసింది

Wed,November 20, 2019 02:18 AM

-టెయిల్ టు హెడ్ విధానంతో కాల్వ చివరనుంచి
-చెరువులను నింపుకొంటూ వస్తున్న నీటిపారుదలశాఖ
-సాగునీటి విడుదలతో విజయవంతమవుతున్న వినూత్న ప్రయోగం
-ఆయకట్టు చివరి భూములకూ పుష్కలంగా నీరు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టెయిల్ టు హెడ్.. ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు ముందుగా నీటిని అందించడానికి కొన్నేండ్లుగా తెలంగాణ నీటిపారుదలశాఖ అనుసరిస్తున్న విధానమిది. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశాక ఆయకట్టు చివరిభూములకు ముందుగా నీటిని అందించి.. క్రమంగా ఎగువ పొలాలకు పారించడమే ఈ చివరినుంచి మొదటికి విధానం. తెలంగాణలోని ప్రాజెక్టుల కింద ఆయకట్టు మొత్తానికి సమానంగా నీళ్లందేలా అనుసరిస్తున్న ఈ విధానాన్ని నీటిపారుదలశాఖ ఇప్పుడు చెరువులను నింపడంలోనూ పాటిస్తున్నది. దీంతో రాష్ట్రంలో వేల చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. గతంలో ప్రాజెక్టుల కింద కాల్వలకు నీటిని విడుదల చేస్తే ఆయకట్టు ముందున్న భూములకే నీళ్లందేవి. చివరిభూములకు నీళ్లొచ్చేసరికి సీజన్ ముగిసిపోయేది.

ఆయకట్టు మొదటి రైతులు కోతలకు సిద్ధమవుతుంటే.. చివరి రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకొనేవారు. దీంతోపాటు, ముందున్న ఆయకట్టు పారాక నీళ్లు వృథాగా పోయేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి ప్రత్యామ్నాయంగా నాలుగైదేండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో టెయిల్ టు హెడ్ విధానాన్ని అనుసరిస్తున్నది. ముందుగా నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఈ విధానాన్ని అమలుచేసి అద్భుతమైన ఫలితాలు సాధించింది. నీటివృథాను భారీఎత్తున అరికట్టడంతో ఆయకట్టులో రైతులందరికీ సమానంగా సాగునీరందింది. తర్వాత తెలంగాణ నీటిపారుదలశాఖ దాదాపు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పరిధిలో టెయిల్ టు హెడ్ విధానాన్ని అమలుచేస్తూ వస్తున్నది. దీంతో మునుపెన్నడూలేని విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద సాగునీటి వినియోగ సామర్థ్యం గణనీయంగా పెరిగింది.

చెరువులు నింపడంలోనూ అమలు

ప్రాజెక్టుల పరిధిలో అమలుచేసిన టెయిల్ టు హెడ్ విధానాన్ని నీటిపారుదలశాఖ ఈసారి చెరువులను నింపడంలో అమలుచేస్తున్నది. సాధారణంగా ప్రాజెక్టుల నుంచి కాల్వల్లోకి నీటిని వదిలిన తర్వాత తొలుత ఎగువన ఉన్న చెరువులకు నీటిని తరలించేవారు. దీంతో కాల్వ చివరలోఉన్న చెరువులు నింపడం కష్టతరంగా మారేది. కానీ ఈ ఏడాది ముందుగా కాల్వ చివరలో ఉన్న చెరువులను నింపారు. తర్వాత క్రమంగా పైకి వస్తూ మొదట్లో ఉన్న చెరువులకు నీటిని తరలిస్తున్నారు. ప్రధానంగా శ్రీరాంసాగర్ పరిధిలో కాకతీయకాల్వ, వరదకాల్వలపై ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రతి ప్రాజెక్టు పరిధిలోనూ దీనిని అమలుచేయడంతో ఈసారి వేల చెరువులకు జలకళ వచ్చింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో.. ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండగానే సగం చెరువులు పూర్తిస్థాయిలో నిండటమే ఇందుకు నిదర్శనం. దీంతో ప్రతిసారి ఇదే విధానాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.

603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles