కాళేశ్వరం చరిత్రలో నిలిచిపోతుంది

Sun,September 22, 2019 01:58 AM

-జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్‌రావు
-గాయత్రీ పంపుహౌస్, కోమటిబండ సంప్‌హౌస్‌ను సందర్శించిన పలు రాష్ర్టాల ప్రతినిధులు

రామడుగు/గజ్వేల్ రూరల్: సీఎం కేసీఆర్ మదినుంచి రుపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ర్టాలకు చెందిన ఎమ్మెల్సీలు, రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు, నీటి వనరుల పరిశోధకులు, ఇంజినీర్లు శనివారం మొదట సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ మిషన్ భగీరథ సంప్‌హౌస్‌ను, అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండ లం లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రీ పంప్‌హౌస్‌ను సందర్శించారు. గాయత్రీ పంప్‌హౌస్‌లో భూగర్భంలోని సర్వీస్‌బే విభాగానికి చేరుకొని అక్కడి నుంచి బాహుబలి మోటర్లను పరిశీలించారు.

తిరిగి భూ ఉపరితలానికి చేరుకొని డెలివరీ సిస్టర్న్ వద్ద నీరు ఏ విధంగా పైకి వస్తుందో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ద్వారా తెలుసుకున్నారు. కోమటిబండ వద్ద తమిళనాడుకు చెందిన ప్రముఖ న్యాయవాది గురుస్వామి, మాజీ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం బాగున్నదని కొనియాడారు. జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. ఈనెల 23న హైదరాబాద్‌లో నదుల్లోకి వర్షం నీటి మళ్లింపు, నదుల అనుసంధానం తదితర అంశాలపై జాతీయస్థాయి సెమినార్ జరుగనున్నదని, ఇందుకోసం వచ్చిన వివిధ రాష్ర్టాల ప్రతినిధులతో మిషన్ భగీరథ పథకంలోని కోమటిబండ సంప్‌హౌస్, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా గాయత్రీ పంపుహౌస్‌ను సందర్శించినట్టు చెప్పారు. ఇక్కడి నిర్మాణాలు చూసి ఈ బృందం సభ్యులంతా ఆశ్చర్యపోవడంతోపాటు ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి నిర్మాణం ఎక్కడా జరుగలేదని మెచ్చుకున్నారని తెలిపారు.

మేం తెలంగాణలో ఉంటే బాగుండేది

-కాళేశ్వరం ప్రాజెక్టుతో అభివృద్ధి చెందేవాళ్లం
-మహారాష్ట్ర, తమిళనాడు ప్రతినిధుల అభిలాష

తమ ప్రాంతాలు కూడా తెలంగాణలో ఉంటే బాగుండేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో తాము అభివృద్ధి చెందే వాళ్లమని మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్‌రావుతో కలిసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు వచ్చిన ఆ రాష్ర్టాల ప్రతినిధులు తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఇటీవల వెట్ ట్రయల్న్ చేసిన ఆరో పంపు దృశ్యాన్ని ఇంజినీర్లు వారికి సెల్‌ఫోన్‌లో చూపించగా ఆశ్చర్యం వ్యక్తంచేసి చప్పట్లు కొట్టారు. బాహుబలి మోటర్లను చూడటం ఓ అదృష్టంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇంతమంచి నిర్మాణాన్ని తమకు చూపించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles