కేంద్ర మంత్రి బాధ్యతలకు పూర్తి న్యాయంచేస్తా: కిషన్‌రెడ్డి

Fri,May 31, 2019 03:59 AM

- తెలంగాణభవన్‌లో ఘనస్వాగతం

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బీజేపీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. బీజేవైఎం జాతీ య అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా వివిధ హోదా ల్లో పనిచేశారు. హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా ఒకసారి, అంబర్‌పేట ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన కిషన్‌రెడ్డి.. తొలిసారి ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు హర్షాతిరేఖాలు వ్యక్తంచేస్తున్నా రు. వాస్తవానికి కిషన్‌రెడ్డి భిన్నమైన పరిస్థితులను చవిచూశారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ లోక్‌సంఘర్ష్ ఉద్యమంలో పాల్గొ ని, గల్లీలీడర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఢిల్లీ వరకు ఎదిగారు. గతంలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. ఆయన సమకాలికులైన శివరాజ్‌సింగ్‌చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ధర్మేంద్రప్రదాన్ కేంద్రమంత్రిగా పనిచేయగా.. కిషన్‌రెడ్డి ఆలస్యంగా జాతీయస్థాయికి ఎదిగారు.
Kishan-Reddy1

ఓడిపోవడమే వరమైంది!

2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీచేసిన కిషన్‌రెడ్డి అనూహ్యంగా స్వల్పతేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. ఎంపీగా గెలువడంతోనే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఒకవేళ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే.. పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాల్సి ఉండేదని, అప్పుడు అంబర్‌పేటలో ఓడిపోవడమే కలిసొచ్చిందని పలువురు నేతలు వ్యాఖ్యానించుకోవడం విశేషం.

సామాన్య రైతుబిడ్డ..

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో సామాన్య రైతుకుటుంబంలో జన్మించిన కిషన్‌రెడ్డి.. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా విద్యనభ్యసించారు. ఆయనకు భార్య కావ్య, కూతురు వైష్ణవి, కుమారుడు తన్మయ్ ఉన్నారు. 1977లో జనతా పార్టీ యువజన విభాగం నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1980లో జనసంఘ్ బీజేపీగా రూపాంతరం చెందిన తర్వాత బీజేపీలో చేరారు. తొలుత రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్‌గా.. రాష్ట్ర కోశాధికారిగా.. 1983-84 వరకు ఉమ్మడి రాష్ట్రంలో యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1986-90 మధ్య బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, 1990-92 వరకు దక్షిణ భారత బీజేవైఎం ఇంచార్జిగా, 1994 వరకు బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాత 2001 వరకు బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2002 నుంచి 2005 వరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉగ్రవాద వ్యతిరేక ప్రపంచ యువజనమండలి (డబ్ల్యువైసీఏటీ)ని ఏర్పాటుచేసి.. 50 దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సీమా సురక్షా జాగరణ్ యాత్రను నిర్వహించి, 8 రాష్ర్టాల్లో 1200 కిలోమీటర్ల మేర 45 రోజుల పాటు పర్యటించారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ప్రవేశించిన కిషన్‌రెడ్డి.. 2001 జూలై నుంచి 2002 ఆగస్టు వరకు బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. స్టేట్ హెడ్‌క్వార్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఇంచార్జిగా పనిచేశారు. 2010 నుంచి 14వరకు ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో 2014 మార్చి నుంచి 2016 ఏప్రిల్ వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరుయాత్ర పేరుతో 25 రోజులపాటు పర్యటించారు.

కేంద్ర మంత్రి బాధ్యతలకు పూర్తి న్యాయంచేస్తా

కేంద్ర మంత్రిగా తనపై ఉంచిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని గురువారం ఢిల్లీలో ప్రమాణం స్వీకరించిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి ప్రకటించారు. తనపై నమ్మకముంచిన ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐదేండ్లూ దేశాభివృద్ధి కోసం ఆయన నేతృత్వంలో సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకువెళతామని చెప్పారు. కేంద్రమంత్రిగా ప్రమాణం అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు వెళ్ళిన కిషన్‌రెడ్డికి అక్కడ బీజేపీ నేతలు, కార్యకర్తలు డప్పువాయిద్యాలు, నృత్యాలతో స్వాగతం పలికారు. పార్టీలో అహర్నిశలు కృషిచేసినవారికి పెద్దపీట వేశారన్న ఆయన.. రెండు తెలుగు రాష్ర్టాల్లో బీజేపీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు. రెండు రాష్ర్టాలు సమన్వయంతో ముందుకెళ్ళడంలో తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు.

417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles