ఆలయ భూములు కాపాడుదాం

Sat,November 9, 2019 01:56 AM

-కబ్జాదారులపై క్రిమినల్ కేసులు
-అధికారులు అలసత్వం వీడాలి
-దేవాదాయశాఖ భూములపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆలయ భూములను ఆక్రమించేవారిని ఉపేక్షించేది లేదని, వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన దేవాదాయశాఖ భూముల లీజు, భూ రికార్డుల ప్రక్షాళన, ఆలయభూముల వేలం ప్రక్రియలో పారదర్శకత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా 2,676 ఎకరాల ఆలయ భూములను గుర్తించడంతోపాటు, 181 ఆలయాల భూములకు సరిహద్దు బోర్డులు ఏర్పాటుచేసినట్లు ఈ సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో నిరుపయోగంగాఉన్న ఆలయ భూముల్లో రూ.5 కోట్లతో వాణిజ్య సముదాయాలను నిర్మించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో సత్ఫలితాలు

అనంతరం మంత్రి మాట్లాడుతూ దేవాదాయ భూములు పరాధీనం కాకుండా కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దేవాదాయశాఖ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ సత్ఫలితాన్నిచ్చిందన్నారు. దీన్ని మరింత విస్తృతం చేయాలని, ఆలయ భూముల వ్యవహారంలో అధికారులు అలసత్వం వీడాలని సూచించారు. ఆలయభూముల రక్షణకు సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని చెప్పారు. దేవాదాయశాఖ భూముల వేలం ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలని, లీజు గడువు ముగిసిన వెంటనే ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం తిరిగి వేలం నిర్వహించాలని తెలిపారు. దేవుని మాన్యం వ్యవహారంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన అధికారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

11న దక్షిణాది రాష్ర్టాల నీటిపారుదలశాఖ అధికారుల భేటీ

జల వనరులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 11న దక్షిణాది రాష్ర్టాల నీటిపారుదలశాఖ అధికారులు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో నిర్వహించనున్న సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తోపాటు, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక నీటిపారుదలశాఖ అధికారులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో భేటీ కావడం ఇది రెండోసారి. అధికారిక సమాచారాన్ని ఆయారాష్ర్టాలతోపాటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కూడా కేంద్రం అందించింది. సమావేశంలో చర్చించే ప్రధాన ఎజెండా ఇంకా ఖరారు కానట్టు తెలిసింది.

522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles