రుణలక్ష్యం 6,584 కోట్లు


Mon,August 26, 2019 01:40 AM

Loans to womens unions

-26 బ్యాంకుల నుంచి 3,44,353 మహిళా సంఘాలకు రుణాలు
-కొత్త సంఘాలకు రూ.120 కోట్లు
-వ్యవసాయం, వ్యాపారానికి ప్రాధాన్యం
-వచ్చేనెల నుంచి మొదలుకానున్న రుణాల మంజూరు
-గతేడాది రూ.6,166 కోట్ల రుణాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వారికి వ్యవసాయం, వ్యాపారంగాల్లో మరింత ప్రోత్సాహమిచ్చేందుకు ఈసారి భారీగా రుణసాయం చేయనున్నారు. రాష్ట్రంలోని మహిళాసంఘాలకు ఈ ఏడాది రూ. 6,584.13 కోట్ల రుణాలిచ్చేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నాలుగు విడుతల్లో 26 బ్యాంకుల నుంచి 3,44,353 మహిళా సంఘాలకు ఈ రుణాలను అందజేయనున్నారు. మహిళా సంఘాలకు రుణసాయం, దానితో వ్యాపారంచేసే అంశాలపై గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సర్వేమొదలైంది. గతంలో ఎరువుల అమ్మకం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్థానిక అవసరాలకు అనుగుణంగా చేసిన వ్యాపారాలు, లాభాలపై ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఫార్మాట్‌లో గ్రామాల్లో మహిళా సంఘాల నుంచి వివరాలను సేకరిస్తున్న సర్వే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్ నుంచి మొదలైంది. ఈ నెలాఖరులోగా పూర్తి నివేదికను సిద్ధంచేసి, వచ్చేనెల నుంచి రుణ మంజూరు చేపట్టాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి మహిళాసంఘాల రుణాల మంజూరు అంశాన్ని వేగవంతం చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

మహిళా రుణాలతో వ్యవసాయ పనులు

మహిళా సంఘాలు తీసుకున్న రుణాలతో వ్యవసాయ పనులకు వెచ్చించడం మరో రికార్డుగా నిలిచింది. వ్యవసాయరంగానికి కూడా మహిళా సంఘాలు రుణాలు తీసుకున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో మహిళాసంఘాల సభ్యులు ఏ ఏ పనులు చేస్తున్నారనే అంశంపై సెర్ప్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి మహిళలు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టారు. తొలి ఏడాది మహిళా సంఘాల్లో సభ్యులు వ్యవసాయ పనుల కోసం రూ. 1561.86 కోట్లను వినియోగించారు. మొత్తం విడుదల చేసిన రుణాల్లో 30.1 శాతం వ్యవసాయ పనులు కోసం వెచ్చించారు. అదే విధంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 807.49 కోట్లను వ్యవసాయానికి వినియోగించారు. మొత్తం రుణాల్లో 28.7 శాతం వ్యవసాయ పనులకు వెచ్చించి ఆర్థిక ప్రగతి సాధించారు.

చెల్లింపుల్లో ముందే

గతేడాది వార్షిక ప్రణాళిక ప్రకారం 3,01,596 మహిళా సంఘాలకు రూ. 6,048.27 కోట్ల వార్షిక రుణ లక్ష్యం ఉండగా.. లక్ష్యానికి మించి రుణాలిచ్చారు. రుణ పరిమితి పెరుగడం, వాయిదాల చెల్లింపులు సక్రమంగా ఉండటంతో బ్యాంకులు పోటీపడీ రుణాలిచ్చాయి. గతేడాది 1,51,598 సంఘాలకు రూ.6,166 కోట్ల రుణాలిచ్చారు. రుణ లక్ష్యంలో 102 శాతాన్ని చేరుకుని రికార్డు సాధించాయి. గతేడాది రీజినల్ రూరల్ బ్యాంకులు అత్యధికంగా రుణాలిచ్చాయి. తీసుకున్న రుణాలు సకాలంలో క్రమంతప్పక చెల్లించడంలో మహిళా సంఘాలు ముందున్నాయి. దాదాపు దేశంలో రుణవాయిదాల చెల్లింపులో మన రాష్ట్రం ప్రథమంగా కొనసాగుతున్నది. 98.7 శాతం రుణాల తిరిగి చెల్లింపులు చేస్తున్నది.

నాలుగు విడుతల్లో రుణాలు

బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు తీసుకోవడం, వాటితో లాభదాయకమైన వ్యాపారం చేయడంలో తెలంగాణ మహిళలు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. మహిళాసంఘాలకు ఈ ఏడాది బ్యాంకులు మొత్తం రూ.6,584.13 కోట్ల రుణ లక్ష్యం విధించుకున్నాయి. నాలుగువిడుతల్లో ఈ రుణాలు ఇవ్వనున్నారు. ఈసారి కొత్తగా ఏర్పాటైన 12,025 మహిళా సంఘాలకు కూడా రుణాలివ్వాలని సెర్ప్, బ్యాంకర్లు నిర్ణయించారు. ఒక్కో సంఘానికి రూ.50వేల చొప్పున రూ.120.25 కోట్లు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇప్పటికే సక్రమ చెల్లింపులు చేసిన 3,32,328 సంఘాలకు రూ. 6,468.88 కోట్ల రుణాలుగా ఇవ్వనున్నారు. రుణాలివ్వడంలో కమర్షియల్ బ్యాంకుల కంటే గ్రామీణ బ్యాంకులే ముందుంటున్నాయి.

తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి 50,601 మహిళా సంఘాలకు రూ. 936.53 కోట్లు, ఏపీజీవీబీ నుంచి 88,754 సంఘాలకు రూ. 1912.32 కోట్లను ఈ ఏడాది రుణంగా ఇవ్వనున్నాయి. రాష్ట్రంలోని 16 కమర్షియల్ బ్యాంకుల పరిధిలో మొత్తం 2,01,296 స్వశక్తి సంఘాలకు రూ. 3650.22 కోట్లు ఇవ్వనున్నారు. అత్యధికంగా ఎస్బీఐ రూ.1,782.05 కోట్లు, ఆ తర్వాత ఆంధ్రాబ్యాంక్ రూ. 874.85 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈసారి డీసీసీబీ బ్యాంకులు కూడా రుణలక్ష్యాన్ని విధించుకున్నాయి. 8 జిల్లాల్లోని డీసీసీబీ బ్యాంకులు ఈ ఏడాది 3617 మహిళా సంఘాలకు రూ. 83.05 కోట్లు రుణాలివ్వనున్నాయి. అత్యధికంగా కరీంనగర్ డీసీసీబీ 1389 సంఘాలకు రూ. 33.55 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో స్థానిక బ్యాంకులు రూ. 2.02 కోట్ల రుణాలుగా ఇవ్వనున్నారు.

1416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles