టీడీపీ ఆగమాగం


Fri,March 15, 2019 04:04 AM

Magunta Srinivasulu Reddy resigns from TDP will join YSRCP

-వలసలతో విలవిల.. వైసీపీకి క్యూకట్టిన నేతలు
-తాజాగా ఎమ్మెల్సీ మాగుంట రాంరాం
-వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటన
-అదే బాటలో మాజీ మంత్రి కొణతాల
-పచ్చపార్టీలో ముదురుతున్న ముసలం
-అన్ని జిల్లాల్లో అంతర్గత విభేదాలు
-నియంత్రించలేకపోతున్న అధిష్ఠానం
-ప్రజావ్యతిరేకత.. ఇంటిపోరుతో సతమతం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకత.. మరోవైపు రోజుకురోజుకు తీవ్రమవుతున్న ఇంటిపోరుతో ఏపీలో టీడీపీ ఆగమాగం అవుతున్నది. వీటికితోడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు ముఖ్యనేతలు ప్రతిపక్ష వైసీపీలోకి క్యూ కడుతుండటంతో కీలకమైన ఎన్నికల వేళ టీడీపీ చతికిలపడుతున్నది. దాదాపు అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న అంతర్గత పోరే టీడీపీనుంచి వలసలకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ప్రజావ్యతిరేకతతో సతమతమవుతున్న టీడీపీ అధిష్ఠానానికి తాజాగా ఇంటిపోరు తలనొప్పులు సృష్టిస్తున్నది. పార్టీ నాయకులను సమన్వయపర్చలేక ముఖ్యనేతలు చేతులెత్తేస్తుండటంతో ఏపీలో టీడీపీ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నది. వరుసగా పార్టీని వీడుతున్నవారితో పార్టీ పరువు బజారున పడుతున్నది. టైమ్ బాగోలేకపోతే తాడే పామై కరుస్తుందన్నమాటకు టీడీపీలో పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తలప్రాణం తోకకు..

రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతతో మళ్లీ అధికారంలోకి వచ్చేది కలేనని నిర్ధారణకు వచ్చిన టీడీపీ కీలక నేతలందరూ వైసీపీ బాట పడుతున్నారు. మిగిలి ఉన్నవారికైకి సీట్లు సర్దుబాటు చేయటంలో అధిష్ఠానానికి తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. మూడు అలకలు.. ఆరు బుజ్జగింపులు అన్న చందాన ఒక్కొకరిని సర్దుబాటుచేస్తూ తొలి విడుతలో గురువారం రాత్రి 126 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చింది. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్సెస్ ఇతర నాయకులు.. పరిటాల వర్సెస్ పయ్యావుల, కడపలో రామసుబ్బారావు వర్సెస్ ఆదినారాయణరెడ్డి మధ్య గొడవలు చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయనేది బహిరంగ రహస్యం. కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్సెస్ కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేశ్ వర్సెస్ మోహన్‌రెడ్డి, మంత్రి అఖిలప్రియ వర్సెస్ సుబ్బారెడ్డి, నెల్లూరులో సోమిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి మధ్య గొడవలు ఉండనే ఉన్నాయి.

కృష్ణాజిల్లాలో వంగవీటి- దేవినేని కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది బెజవాడ రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల వంగవీటి రాధాకు చంద్రబాబు పచ్చ కండువా కప్పడంతో జిల్లా టీడీపీలో విభేదాలు ఇప్పట్లో ఆరేలా కనిపించటం లేదు. ప్రకాశం జిల్లాలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అంతర్గతపోరుతోపాటు పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తులేదనే నిర్ధారణకు వచ్చి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అద్దంకిలో కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి రవి మధ్య అంతర్గత పోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. చీరాలలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల వైసీపీ గూటికి చేరారు. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు వర్సెస్ జిల్లా టీడీపీ అన్నట్లు వర్గపోరు ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

విజయనగరంలో అశోక్ గజపతిరాజు.. వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చిన సుజయకృష్ణ రంగారావు వర్గాల మధ్య పోరుతో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. విశాఖపట్నంలో గం టా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య విభే దాలతో అక్కడ పార్టీ బతికిబట్టకట్టే పరిస్థితి లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి విభేదాలే కనిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోనూ ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పట్టున్న పర్వత బాపనమ్మ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే జిల్లాలో యనమలతో ఉన్న విభేదాలతో ఎంపీ తోట నర్సింహులు ఇటీవల తన భార్యతో సహా లోటస్‌పాండ్‌లో జగన్ పంచకుచేరారు. అయినప్పటికీ యనమల, మరో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మధ్య విభేదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరిలోనూ పార్టీ అంతర్గత విభేదాలతో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదనేది అధిష్ఠానానికి ఉన్న పక్కా సమాచారం. అటు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత, ఇటు అన్ని జిల్లాల్లోనూ ఇంట్లో విభేదాల కుంపటితో టీడీపీ సైకిల్ చక్రం ముందుకు కదల్లేని స్థితిలో పడిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

టీడీపీకి మాగుంట, కొణతాల గుడ్‌బై

ప్రకాశం జిల్లాలో పార్టీ కీలకనేత, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నందున తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఒంగోలులో వెల్లడించారు. మాగుంట బాటలోనే మాజీ మంత్రి, టీడీపీ నేత కొణతాల రామకృష్ణ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. గురువారం కూడా వైసీపీలోకి చేరికలు కొనసాగాయి. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ వైసీపీలో చేరారు.

5974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles