చెక్కుల పంపిణీ పూర్తి


Wed,May 15, 2019 02:52 AM

mallanna sagar cheques distribution completed

-మల్లన్నకు కోటిదండాలు!
-ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పరిహారం అందజేత
-4,061 కుటుంబాలకు అందిన చెక్కులు
-18 ఏండ్లు పైబడిన 1,055 మందికీ పంపిణీ
-ప్యాకేజీని తిరస్కరించిన 47 కుటుంబాలు
-కోర్టులో డిపాజిట్ చేయనున్న అధికారులు
-ముంపు గ్రామాల్లో పండుగ వాతావరణం
-12 రోజులుగా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
-దేశంలోనే మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంతో మల్లన్నసాగర్ నిర్వాసితుల్లో హర్షాతిరేకాలు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించేందుకు పెద్ద మనసుతో భూమిని ఇచ్చిన ముంపు గ్రామాల నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం అంతే పెద్దమనసుతో ఆదుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో పునరావాసం, పునరోపాధి కింద ఇచ్చే ప్యాకేజీ చెక్కుల పంపిణీ మంగళవారంపూర్తయ్యింది. ప్రతి కుటుంబానికి రూ.7.50 లక్షల ప్యాకేజీ, ఇంట్లో ఇద్దరు పెద్దపిల్లలకు ఐదేసి లక్షల చొప్పున పరిహారంతోపాటు.. ఆ కుటుంబానికి రూ.75 లక్షల మార్కెట్ విలువకలిగిన డబుల్ బెడ్‌రూం ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడం ద్వారా.. దాదాపు కోటిరూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టయింది.

ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల్లో ప్రతి వందమందికి ఒక కౌంటర్ ఏర్పాటుచేసి ఈ నెల మూడు నుంచి చెక్కుల పంపిణీ చేపట్టారు. ఈ 12 రోజుల్లో ఎనిమిది ముంపు గ్రామాల్లో 4,108 కుటుంబాలకుగాను 4,061 కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అన్ని గ్రామాల్లో కలిపి 18 ఏండ్లు నిండిన యువతీయువకులు 1,055 మందికిగాను అందరూ పరిహారం అందుకున్నారు. ఏటిగడ్డకిష్టాపూర్‌లో 11, వేములఘాట్‌లో 36.. మొత్తం 47 కుటుంబాలు ప్యాకేజీని తిరస్కరించడంతో ఆ చెక్కులను కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. మంగళవారం తొగుట మండలం రాంపూర్‌లో 50 మందికి, వేములఘాట్‌లో ఎనిమిది మందికి అధికారులు చెక్కులను పంపిణీ చేశారు.

ముంపు గ్రామాల్లో హర్షాతిరేకాలు

రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంతో ముంపు గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మెరుగైన ప్యాకేజీ ఇచ్చారంటూ ముంపు గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చెక్కుల పంపిణీకి వచ్చిన అధికారులకు ముంపు గ్రామాల ప్రజలు మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. అధికారులను సన్మానించారు. మల్లన్నసాగర్ ముంపు కింద తొగుట మండలంలోని వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లకా్ష్మపూర్, పల్లెపహాడ్, రాంపూర్ గ్రామాలతోపాటు కొండపాక మండలంలోని ఎర్రవల్లి, సింగారం గ్రామాలున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముంపు గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన చెక్కులు పంపిణీ పూర్తి చేయడానికి సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని చకచకా చెక్కులను పంపిణీచేశారు.

ఈ నెల 3న సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయాల్లో మొదటిరోజు చెక్కులు పంపిణీచేయగా మరుసటిరోజు నుంచి ముంపు గ్రామాల్లోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి, కౌంటర్లవారీగా భూనిర్వాసితులకు చెక్కులు అందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌తోపాటు ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, రాజాగౌడ్, అనంతరెడ్డి, విజయేందర్‌రెడ్డి, మధుసూదన్, గడ అధికారి ముత్యంరెడ్డి గ్రామాలవారీగా ఇంచార్జిలుగా వ్యవహరించారు. ఒక్కో గ్రామంలో ఎనిమిది నుంచి పది కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఒక్కో కౌంటర్‌లో జిల్లాస్థాయి అధికారితోపాటు తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్, ఇతర అధికారుల బృందాలు కలిసి మొత్తం 10 నుంచి 15 మంది అధికారులు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు, ఫిర్యాదుల కౌంటర్లు నెలకొల్పారు. వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించి చెక్కులను పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో మిగిలిపోయిన పాత ఇంటి స్థలానికి పరిహారం ఇవ్వడానికి సర్వే నిర్వహిస్తున్నారు. వీరందరికీ చెక్కులు పంపిణీ చేయనున్నారు.

12 రోజుల్లో మొత్తం పంపిణీ జరిగిందిలా..

మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన సింగారం, ఎర్రవల్లి, రాంపూర్, లకా్ష్మపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్‌లో రూ.7.50 లక్షల చొప్పున ప్యాకేజీని 4,061 కుటుంబాలు తీసుకున్నాయి. డబుల్‌బెడ్‌రూం ఇల్లు వద్దనుకునేవారికి రూ.5.04 లక్షల చొప్పున 1,724 కుటుంబాలకు అందించారు. 2బీహెచ్‌కే కింద 5,116 కుటుంబాలకు పట్టాలిచ్చారు. గ్రామాలవారీగా చూస్తే.. సింగారంలో 186 కుటుంబాలకుగాను 186, ఎర్రవల్లిలో 544కు గాను 544, రాంపూర్‌లో 198కి గాను 198, లకా్ష్మపూర్‌లో 223కుగాను 223, బ్రాహ్మణబంజేరుపల్లిలో 212కుగాను 212, వేములఘాట్‌లో 1,031కిగాను 1,020, పల్లెపహాడ్‌లో 743కుగాను 743, ఏటిగడ్డకిష్టాపూర్‌లో 971కిగాను 935 కుటుంబాలు రూ.7.50 లక్షల ప్యాకేజీ కింద చెక్కులను, 250 గజాల ఇంటి స్థల పట్టాలను తీసుకున్నాయి. వేములఘాట్‌లో 11, ఏటిగడ్డకిష్టాపూర్‌లో 36.. మొత్తం 47 కుటుంబాలు మాత్రం ప్రభుత్వం అందిస్తున్న ప్యాకేజీని నిరాకరించాయి.

దేశంలోనే మెరుగైన ప్యాకేజీ

మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ అందించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ భూనిర్వాసితులకు పునరావాసం, పునరోపాధి కింద సాయాన్ని అందించారు. ముంపు గ్రామాల్లో రైతులు కోల్పోయిన భూములు, వ్యవసాయ కొట్టాలు, బావులు, బోరుబావులు తదితర వాటికి ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకున్నది. మల్లన్నసాగర్ నిర్వాసితులకు రూ.5.04 లక్షల విలువైన డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన అందరికీ కలిపి 460 ఎకరాల విస్తీర్ణంలో కట్టిస్తున్నారు. ఈ పనులుకూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. డబుల్ బెడ్‌రూం వద్దనుకునేవారికి 250 గజాల ఇంటి స్థలం, రూ.5.04 లక్షల చెక్కును అందించారు. ముంపు గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న ఇంటిస్థలానికి గజానికి రూ.1600 చొప్పున లెక్కగట్టి పరిహారం ఇచ్చారు. పునరావాసం కింద ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల ప్యాకేజీ ఇవ్వడంతోపాటు.. అదే కుటుంబంలో 18 ఏండ్లు దాటిన యువతీ యువకులకు రూ.5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటిస్థలం ఇచ్చారు.

పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీవో సంతకంతో తాసిల్దార్ పట్టా జారీచేశారు. అవసరమైన పక్షంలో ఆ ఇంటిని అమ్ముకొనేందుకు లేదా బహుమతిగా కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు ఈ పట్టాలు అనుకూలంగా ఉన్నాయి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరావాస, పునరోపాధి కార్యక్రమం కింద ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా కోటి రూపాయల వరకు సాయం అందుతున్నది. మల్లన్నసాగర్ ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి అందే మొత్తం రూ.7.50 లక్షలు, ఇద్దరు పెద్ద పిల్లలు ఉంటే అందే మొత్తం రూ.10 లక్షలు, కుటుంబ పెద్ద పిల్లలకు, యజమానికి కలిపి 750 గజాల విస్తీర్ణంలో ఇంటి జాగ, ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ. 75 లక్షల విలువ ఉంటుందని అధికారులు వివరించారు.

3749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles