కోనసీమను తలపించేలా తెలంగాణ

Sat,November 9, 2019 02:09 AM

-ధనిక రైతులకు చిరునామాగా మారుస్తాం
-సాగుకు 24 గంటల కరంట్ ఇచ్చే రాష్ట్రం మనదే
-గులాబీ సేవకులకు బాసులు గల్లీ ప్రజలే
-ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్
-రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృత పర్యటన

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మెట్ట ప్రాంతంలోని ప్రతి చెరువునూ నింపి కోనసీమను తలపించేలా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తాం అని ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ సహా దేశంలో ఎక్కడా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్ ఇవ్వడంలేదని, ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. పరిశ్రమలకు సైతం 24 గంటల కరంటు అందిస్తున్నామని గుర్తుచేశారు. నాణ్యమైన కరంటు సరఫరా కోసమే రెండు, మూడు గ్రామాలకొక 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నామని వివరించారు.
Minister-KTR3
ఒకప్పుడు రైతు అప్పు చెల్లించకపోతే అంజుమన్ బ్యాంకు సిబ్బంది ఇంటి తలుపులు లాక్కొనిపోయేవాళ్లని, టీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధుతో పంట పెట్టుబడికి నగదు సాయం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని వివరించారు. మెట్ట ప్రాంతంలోని ప్రతి చెరువునూ నింపి కోనసీమను తలపించేలా తీర్చిదిద్దుతామని, అదే కేసీఆర్ స్వప్నమని వివరించారు. ధనిక రైతులకు చిరునామాగా తెలంగాణను తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులే కాకుండా అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు. కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లంటూ ఓ రైతు వర్ణించడమే సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. గులాబీ సేవకులకు బాసులు గల్లీ ప్రజలేనని పేర్కొన్నారు. దేశంలో ఏ సర్కారు ప్రవేశపెట్టని పథకాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజాఆశీస్సులు ఉన్నాయని, తిట్లు, శాపనార్థాలు ఏవీ తగలవని పేర్కొన్నారు.

మూడు టీఎంసీలతో మల్కపేట రిజర్వాయర్

గత ఏడాది వానకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఈ ఏడాది అంతకు రెట్టింపుగా 1.98 లక్షల టన్నుల ధ్యానం ఉత్పత్తి అయ్యిందని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్‌ను మూడు టీఎంసీల నీటినితో త్వరలో నింపుతామని వెల్లడించారు. రాజరాజేశ్వర జలాశయానికి గోదావరి జలాలు వస్తే జిల్లా ప్రజలంతా వెళ్లి ప్రాజెక్టును సందర్శించారని గుర్తుచేశారు. అల్మాస్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.
Minister-KTR1

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు

మంత్రి కేటీఆర్ శుక్రవారం తొలుత తంగళ్లపల్లిలో రూ.3 కోట్లతో నిర్మించిన గోదాములను ప్రారంభించారు. జిల్లెల్ల శివారులో రూ. 5.71 కోట్లతో నిర్మించతలపెట్టిన ప్రైమరీ ప్రాసెసింగ్ కేంద్రం (పొడి, శీతల గిడ్డంగి) పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జిల్లెల్లకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త పూసపల్లి రామచంద్రాన్ని పరామర్శించారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, అక్కపల్లి, తిమ్మాపూర్‌లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లను, అల్మాస్‌పూర్‌లో రూ.10.7 లక్షలతో ప్రత్యేక నిధుల కింద గౌడ కులస్థుల కోసం నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Minister-KTR2

1557
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles