కూకట్‌పల్లిలో డబుల్ సంబురం

Fri,November 15, 2019 04:11 AM

-108 గృహాలను పేదలకు అందించిన మంత్రి కేటీఆర్
-ఉత్సాహపూరిత వాతావరణంలో గృహప్రవేశాలు
-రూ.83 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన
-కూకట్‌పల్లిలో రూ.101.69 కోట్ల విలువైన పథకాలు ప్రారంభం

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో రూ. 101.69 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలకు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు గురువారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలుచేశారు. నిరుపేదలకు రూ. 9.34 కోట్లతో నిర్మించిన 108 డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీచేయడంతోపాటు ఇం డోర్ స్టేడియం, మోడ్రన్ ఫిష్ మార్కెట్‌ను ప్రారంభించారు. రూ.83 కోట్లతో నిర్మించనున్న రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)కి శంకుస్థాపనచేశారు. హైదరాబాద్‌లోని పేదలకోసం సుమారు రూ.8,500 కోట్లతో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇదివరకే నాచారంలోని సింగంచెరువు తండాలో ఇన్ సిటూ (స్వస్థానంలో) పద్ధతిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీని ప్రారంభించగా, తాజాగా రెండో కాలనీని కూకట్‌పల్లి నియోజకవర్గం చిత్తారమ్మ బస్తీలో ప్రారంభించారు.
KTR-KPHP1
ఈ కాలనీలో ఇదివరకే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీచేయగా, వారు గురువారం మంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవం అనంతరం గృహప్రవేశాలు చేశారు. మంత్రు లు కేటీఆర్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో కలిసి పాలు పొంగించి సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు లబ్ధిదారులు బోనాలు, పటాకులతో ఘనంగా స్వాగతం పలికారు. సెల్లార్, స్టిల్ట్‌తోపాటు తొమ్మిది అంతస్తుల్లో నిర్మించిన ఈ గృహాల సముదాయంలో సెల్లార్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. స్టిల్ట్ ఫ్లోర్‌లో సుమారు 20 దుకాణాలను నిర్మించారు. లిఫ్ట్ కూడా ఏర్పాటుచేశారు. దుకాణాల ద్వారా వచ్చే అద్దెలతో ఈ ఇండ్ల సముదాయాన్ని నిర్వహించాలని నిశ్చయించారు. ఒక్కో ఫ్లాట్ వైశాల్యం 560 చదరపు అడుగులు కాగా, ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ.8.65 లక్షలు ఖర్చుచేశారు. దశాబ్దాలుగా మురికివాడలోని చిన్నచిన్న గుడిసెల్లో నివసించిన కుటుంబాలకు విశాలమైన, సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇవ్వడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

రూ.6.51 కోట్లతో రెండు ఇండోర్ స్టేడియాల ప్రారంభం

కూకట్‌పల్లితోపాటు పరిసర ప్రాంతాల యువ త సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.6.51కోట్లతో నిర్మించిన రెండు ఇండోర్ స్టేడియాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక అయ్యప్ప సొసైటీలోని గాయత్రీనగర్‌లో రూ.86 లక్షలతో నిర్మించిన షటిల్ ఇండోర్ స్టేడియాన్ని, అనంతరం కూకట్‌పల్లి ఆరో ఫేజ్‌లో రూ.5.65 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని కేటీఆర్ ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఇండోర్ స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్, బ్యాడ్మింటన్, కరాటే తదితర ఇండోర్ క్రీడలకు సౌకర్యం కల్పించడంతోపాటు కెఫ్టేరియా ఏర్పాటుచేశారు.
KTR-KPHP3

ఆధునిక ఫిష్ మార్కెట్ ప్రారంభం

కూకట్‌పల్లిలో రూ.2.78కోట్లతో నిర్మించిన హోల్‌సేల్ మోడ్రన్ ఫిష్ మార్కెట్‌ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 1651 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మార్కెట్ కు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ రూ.2.25 కోట్లు అందించగా, జీహెచ్‌ఎంసీ రూ.53.20 లక్షలు ఖర్చుచేసింది. 81 ఫిష్‌స్టాల్స్ ఉన్న ఈ మార్కెట్‌లో రెండు హోల్‌సేల్ స్టాల్స్, ఆరు డ్రైఫిష్ స్టాల్స్, ఒక ఫుడ్‌కోర్టు నిర్మించారు.

ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఆర్వోబీ

కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌లో రూ.83కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో రైల్వేపట్టాలపై వంతెన నిర్మాణానికి రూ.18.06 కోట్లు రైల్వేకు కేటాయించగా, రెండువైపులా అప్రోచ్‌ల నిర్మాణానికి రూ.40 కోట్లు, భూసేకరణకు రూ.25 కోట్లు కేటాయించారు. 676 మీటర్ల పొడవైన ఈ ఆర్వోబీ నాలుగు లేన్లతో 16.61 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ ఆర్వోబీ కూకట్‌పల్లి నుంచి హైటెక్‌సిటీకి ప్రత్యామ్నాయరోడ్డుగా ఉపయోగపడుతుంది. దీనివల్ల జేఎన్‌టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్‌షిప్ జంక్షన్, హైటెక్‌సిటీ ైఫ్లెఓవర్, సైబర్ టవర్ జంక్షన్ తదితరచోట్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
KTR-KPHP4

3100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles