సభ సాక్షిగా మా వైఖరి చెప్పాం

Tue,September 17, 2019 02:42 AM

-ప్రజల ప్రయోజనమే ప్రభుత్వానికి ముఖ్యం
-ప్రతిపక్షాలకు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలి
-అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యురేనియం తవ్వకాల అంశంపై శాసనసభ సాక్షిగా తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టంచేశామని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన సందర్భంగా ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సినీరంగం నుంచి రాజకీయ నాయకులుగా మారిన కొందరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి, ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వానికి పేదప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, నల్లమలలోని బడుగు బలహీనవర్గాల జాగృతికోసం సీఎం కేసీఆర్ ఎవరితోనైనా కొట్లాడుతారని ఈ చరిత్రాత్మక నిర్ణయంతో మరోసారి రుజువైందని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసర సమావేశాలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అనుమతి ఇచ్చారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తవ్వకాలకు సిద్ధపడుతున్నదని అన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశాలు పెట్టేవారు దమ్ముంటే కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. ఆ పోరాటంలో తాము కూడా కలిసి వస్తామని చెప్పారు.

చెట్లు నరుకుతుంటే ఊరుకోం

పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో కోట్లు వెచ్చించి కోట్ల మొక్కలను నాటిస్తున్న సీఎం కేసీఆర్.. చెట్లను ఎవరో నరుకుతుంటే ఊరుకుంటారా? అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. నల్లమలలో చెట్లను కాదు, చెట్టు కొమ్మను కూడా కొట్టనీయబోమని స్పష్టంచేశారు. యురేనియం తవ్వకాలపై అసెంబ్లీలో తీర్మానం చేయగానే ప్రతిపక్షాలకు ఏంచేయాలో పాలుపోవడంలేదని, డ్రామా కంపెనీలన్నీ బయటికొచ్చాయని ఎద్దేవాచేశారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఉన్నారు.

జీరోఅవర్‌లో యురేనియం ప్రస్తావన

నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జీరోఅవర్‌కు అనుమతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, వివేకానంద, విఠల్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, రసమయి బాలకిషన్, రవీంద్రకుమార్, దుర్గం చిన్నయ్య, నోముల నర్సింహయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రెడ్యానాయక్, క్రాంతికిరణ్ చంటి, నరేందర్, ఎస్ రవిశంకర్, సయ్యద్ పాషాఖాద్రీ, సీతక్క, విద్యాసాగర్‌రావు, ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, భాస్కర్‌రావు, జగ్గారెడ్డి తమ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.

552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles