కాకతీయ ఫలాలు


Sat,March 23, 2019 03:23 AM

Mission Kakatiya to renovation ponds in Telangana

-దేశానికే ఆదర్శంగామిషన్ కాకతీయ
-అంతర్జాతీయ వేదికలపైనా ప్రశంసల జల్లు
-నాలుగు దశల్లో 27,671 చెరువులకు పూర్వవైభవం

గుండాల కృష్ణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ;పల్లెపట్టుల్లో అన్ని వృత్తులకు ఆదరువైన చెరువులు కళకళలాడుతున్నాయి. పిచ్చి చెట్లు, తుమ్మలు, పొదలతో బోసిపోయిన తటాకాలు మత్తడి దుంకడానికి ఉరకలెత్తుతున్నాయి. వాననీటిని ఒడిసిపట్టడమేకాదు.. సముద్రంలోకి పరుగులు పెడుతున్న కృష్ణా, గోదావరి జలాలను పొలాల్లోకి పారించేందుకు రాష్ట్రంలోని అన్ని చెరువులు సిద్ధమయ్యాయి. నిన్నమొన్నటిదాకా చెరువులు అంటే ఎక్కడున్నాయనే పరిస్థితి. ఇవాళ తటాకాలు పూర్వవైభవాన్నిసంతరించుకొన్నాయి. తెలంగాణలో రైతు గుండెమీద చెయ్యివేసుకొని నిద్రపోతున్నాడు. మిషన్ కాకతీయ వంటి బృహత్తర పథకంతో చెరువులు పునర్జీవించాయి. గొలుసుకట్లతో రాష్ర్టానికి జలహారంగా మారుతున్నాయి. చెరువులు, కుంటల వంటి చిన్ననీటి వనరుల పునరుద్ధరణ ద్వారా వ్యవసాయాన్ని సుసంపన్నంచేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ జాతీయ వేదికలపై ముఖ్యమంత్రి దూరదృష్టిని చాటి చెప్తున్నది.
ఆరున్నర దశాబ్దాల వలసపాలనలో చెరువుల విధ్వంసమే తప్ప వాటిని బాగుచేసిన ఘటనలు కనపడవు. దారుణమైన విధ్వంసానికి గురైన చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2014 జూన్‌లో రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే సీఎం కేసీఆర్ చెరువుల పునరుద్ధరణపై దృష్టిసారించారు. 2014 జూలైలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమగ్ర సర్వేలో తెలంగాణలో చెరువుల సంఖ్య 46,531 గా తేలింది. వీటికింద దాదాపు 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది.

దీంతో ఈ చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకొన్న సీఎం కేసీఆర్.. 2015 మార్చి 12న మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించారు. దశలవారీగా చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటివరకు నాలుగు దశల్లో 27,721 చెరువులను ఎంపిక చేయగా మొద టి మూడు దశల్లో 17,859 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. నాలుగో దశలో మిగతా చెరువుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 8741.80 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులివ్వగా రూ.3,411.50 కోట్లు ఖర్చయ్యాయి. నాలుగో దశ పనులు కూడా పూర్తయితే ఆయా చెరువుల కింద ఉన్న 21.39 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు లభిస్తుంది. దీంతోపాటు భూగర్భజలాలూ గణనీయంగా పెరుగనున్నాయి.

అందుతున్న ఫలాలు

మిషన్ కాకతీయ ఫలాలు ఇప్పుడు గ్రామాల్లో కంటి ముందు కనిపిస్తున్నాయి. చెరువుల ఆయకట్టు పెరిగింది. వ్యవసాయం విస్తరించింది. భూగర్భజలాలూ పెరిగాయి. నాబ్కాన్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో బయటపడ్డ వాస్తవాలే ఇందుకు నిదర్శనం. మిషన్ కాకతీయ ప్రాజెక్టు ఫలితాలపై ఈ సంస్థ లోతైన పరిశోధనచేసి ఒక నివేదిక రూపొందించింది.

దేశంలోనే అద్భుత కార్యక్రమం: నీతి ఆయోగ్

మిషన్ కాకతీయను దేశంలోనే అద్భుత కార్యక్రమంగా నీతిఆయోగ్ అభివర్ణించింది. ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు నీటి సంరక్షణకోసం చేపడుతున్న పథకాలను సమీక్షించిన నీతి ఆయోగ్, నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతి పథకాలను పేర్కొంటూ నివేదిక రూపొందించింది. ఆ వివరాలను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల్లో మిషన్ కాకతీయ ఒకటని ప్రశంసించింది. 2017 ఆగస్టులో రాష్ట్రంలోని పలు చెరువుల పునరుద్ధరణను పరిశీలించిన నీతిఆయోగ్ ప్రతినిధులు తాము గుర్తించిన అంశాలను నివేదికలో పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటిలభ్యత పెరుగడంతోపాటు సన్న, చిన్నకారు రైతుల వ్యవసాయ ఆధారిత ఆదాయంలో పెరుగుదల కనిపిస్తున్నదని పేర్కొంది. సాగునీరు అందని 63 శాతం గ్యాప్ ఆయకట్టుకు చెరువుల ద్వారా సమృద్ధిగా నీటి లభ్యత పెరిగిందని స్పష్టంచేసింది. దీనిఫలితంగానే సాగు విస్తీర్ణం, పంట దిగుబడులు సైతం పెరగాయని చెప్పింది.

పూడికతీత కారణంగా చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగిందని, దీనిద్వారా సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపింది. భూమిలో నీటి సాంద్రత కూడా పెరిగిందని, మెజార్టీ ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని తెలిపింది. ఎండిపోయిన బోరు బావులకు మిషన్ కాకతీయ ప్రాణం పోసిందని, చెరువుల ఆయకట్టు కింద 17 శాతం ఎండిపోయిన బావులు, బోరు బావులు పునరుజ్జీవం పొందాయని తెలిపింది. చేపల ఉత్పత్తి 62 శాతం పెరిగిందని నీతిఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. నీతి ఆయోగ్‌తోపాటు కేంద్ర మంత్రులు, వివిధ సంస్థలు ఈ పథకాన్ని ప్రశంసించాయి. కేంద్ర మంత్రి ఉమాభారతి జలవనరుల శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులను ఢిల్లీకి పిలిపించుకొని మిషన్ కాకతీయపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను చూశారు. గంగా ప్రక్షాళనలోనూ మిషన్ కాకతీయ మాదిరిగా ప్రజలు, రైతుల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను సంబంధిత అధికారులకు సూచించారు.
Water

చారిత్రాత్మకం.. కొత్త చెరువుల నిర్మాణం

భౌగోళిక అనుకూలత, నీటి లభ్యత సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పాత మెదక్ జిల్లాలో కొత్త చెరువుల నిర్మాణానికిగాను ఇప్పటికే తొలి దశ అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం నిధులు కూడా మంజూరుచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26, మెదక్ జిల్లా పరిధిలో మరో ఎనిమిది కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం గతంలోనే ఆమో దం తెలపగా, భూసేకరణ తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయి.

ఏడాది పొడవునా జలకళ

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానంచేసే బృహత్తర కార్యక్రమ అమలులో కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ మేరకు చేసిన సర్వేలో 12,154 గొలుసుకట్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఏకంగా 27,814 చెరువులు గొలుసుకట్టులో ఉండటం విశేషం. రాష్ట్రంలో ఇప్పటివరకు కాల్వల వ్యవస్థ పూర్తయిన భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలో 16,700 చెరువులు ఉన్నట్లుగా అధికారుల సర్వేలో తేలింది. అంటే ఆయా ప్రాజెక్టుల ద్వారా ఇంతస్థాయిలో చెరువుల్ని వెంటనే నింపే అవకాశముంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సీతారామ వంటి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలోని 46,500 చెరువులు ఏడాదిపాటు నిండుకుండల్లా మారనున్నాయి.
kakrthiya

నాబ్కాన్స్ అధ్యయనంలో గుర్తించిన అంశాలిలా ఉన్నాయి

-గతంలో ఒక చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉంటే 40 ఎకరాలకే నీరందేది. నీరందని ఆయకట్టును గ్యాప్ ఆయకట్టు అంటారు. మిషన్ కాకతీయ అమలు కంటే ముందు గ్యాప్ ఆయకట్టు 42.4% ఉండగా.. అమలు తర్వాత 19.2%కి తగ్గింది.
-చెరువుల్లో నీళ్లుండటం వల్ల భూగర్భజలాలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు తూములను మూసివేసి, బోర్లు, బావుల ద్వారా భూగర్భజలాలను సాగుకు వాడుకున్నారు.
-మిషన్ కాకతీయ వల్ల నీటికి నోచుకోవని ఆశలు వదులుకున్న 17శాతం ఎండిపోయిన బోర్లు, బావులకు మళ్లీ జీవం వచ్చింది. వీటిలో ఆయకట్టు పరిధిలోనివే కాకుండా అవతల ఉన్నవి కూడా ఉన్నాయి.
-2013-14లో భూగర్భజలమట్టం పెరుగుదుల 6.91 మీటర్లు కాగా, 2016-17లో 9.02 మీటర్లకు పెరిగింది.
-నాబ్కాన్స్ అధ్యయనం నిర్వహించిన నాలుగు జిల్లాల పరిధిలోని 400 చెరువుల కింద సాగు విస్తీర్ణం 51.5% పెరిగింది.
-చెరువుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో వరి పంట సాగు 49.2% నుంచి 62.11%కి పెరిగినట్లుగా గుర్తించారు. పత్తి సాగు విస్తీర్ణం 36.2% నుంచి 26.3%కి తగ్గింది. ఇతర పంటల సాగు కూడా తగ్గినట్లుగా తేలింది. నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో తక్కువ కూలీల భాగస్వామ్యంతోపాటు, యాంత్రికంగా తొందరగా పనులు పూర్తయ్యే వరి సాగుపైనే రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు.
-మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీసిన మట్టిన తమ పొలాల్లోకి తరలించుకోవడంతో సరాసరిన 35-50 శాతం మేర ఫర్టిలైజర్స్ వినియోగం తగ్గింది. దీంతో ఒక్కో రైతుకు సుమారు 27.6% అంటే ఎకరాకు రూ.1500-3 వేల వరకు ఆర్థిక భారం తగ్గింది. అంతేకాకుండా ఎకరాకు వరి - 2 నుంచి 5 క్వింటాళ్లు, పత్తి 2 నుంచి 4 క్వింటాళ్లు, కందులు - 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మక్కలు - 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి పెరిగింది. చెరువుల్లో నీటినిల్వ ఎక్కువ కాలం ఉండటం వల్ల చేపల ఉత్పత్తి 36-39 శాతం వరకు పెరిగినట్లుగా అధ్యయనంలో తేలింది.
-రైతులకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 78.5 శాతం మేర పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. కనీస మద్దతు ధర దృష్ట్యా 2013-14 ఏడాదితో పోలిస్తే 2016లో ఆదాయం పెరుగుదల 47.4%గా ఉన్నది.
Mission

ప్రముఖుల ప్రశంసలు

ఒక పర్యావరణవేత్తగా నీటివనరుల పునరుద్ధరణకు ఇంత కృషి చేస్తున్నారు. మరి మీ దేశంలో ప్రభుత్వాలు ఏం చేయడంలేదా? అని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు నన్ను అడిగారు. ఎందుకు చేయడం లేదు.. మా దేశంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నది అని సమాధానమిచ్చా. ఇది నా ఊరు.. ఇది నా చెరువు.. అనే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకువచ్చేందుకు మిషన్ కాకతీయ కార్యక్రమం మంచి వేదిక.
- రాజేంద్రసింగ్, పర్యావరణవేత్త, వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా
చెరువుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ చాలా గొప్ప పథకం
- మసూద్ హుస్సేన్, కేంద్ర జలసంఘం చైర్మన్

2392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles