నైరుతి రాక మరింత ఆలస్యం


Wed,June 12, 2019 03:00 AM

Monsoon 2019 Arrival likely to be delayed in Telangana

-అడ్డంకిగా మారిన వాయుతుఫాన్
-రుతుపవనాల మందగమనం
-తెలంగాణను తాకేందుకు మరికొంత సమయం
-15 లేదా 16న రాష్ర్టానికి నైరుతి!
-రెండురోజులపాటు వడగాలులు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నైరుతి రుతుపవనాల రాక మందగించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాన్ రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారింది. దీంతో తెలంగాణకు నైరుతి రాక మరింత ఆలస్యం కావచ్చునని వాతావరణశాఖ పేర్కొన్నది. ఈ నెల 13 లేదా 14వ తేదీన నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకవచ్చని వాతావరణశాఖ ముందుగా అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా రుతుపవనాలు వేగంగా కదిలి శ్రీలంక మీదుగా ఈ నెల 8న కేరళను తాకాయి. కేరళలోని చాలాప్రాంతాల్లో, తమిళనాడులోని కొన్నిప్రాంతాల్లో విస్తరించాయి. అక్కడి నుంచి రుతుపవనాలు 12వ తేదీన రాయలసీమను తాకి.. 13వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని భావించారు. అయితే రాయలసీమలోకి ప్రవేశించబోతున్న సమయంలోనే అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు అనే తుఫాన్ రుతుపవనాల కదలికకు బ్రేక్ వేసిందని అధికారులు చెప్తున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్ర రూపందాల్చి తుఫాన్‌గా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇది గురువారం గుజరాత్ తీరాన్ని తాకనున్నదని..110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉత్తరదిశగా పయనిస్తున్నదని తెలిపింది. ఈ కారణంగా మిగతా ప్రాంతాల్లో ఉన్న తేమను తుఫాన్ మింగేయడంతో పొడివాతావరణం ఏర్పడుతుందని, తేమ తగ్గిపోవడంతో మేఘాలు మందగమనంలో కదులుతాయని అధికారులు వివరించారు. కాగా, ప్రతిఏటా జూన్ 15వ తేదీలోపే నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తుండగా.. గతేడాది జూన్ 8వ తేదీనే రాష్ర్టాన్ని తాకాయి. 2014, 16లలో మాత్రం చాలా ఆలస్యంగా జూన్ 19, 20వ తేదీల్లో రాష్ట్రాన్ని తాకాయి.

మళ్లీ ఠారెత్తిన ఎండలు

రాష్ట్రంలో మంగళవారం మళ్లీ ఎండలు ఠారెత్తాయి. గాలిలో తేమలేక ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంగళవారం వడదెబ్బతో రాష్ట్రంలో ఐదుగురు మృతిచెందారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భద్రాచలంలో 41.2, హన్మకొండలో 41.5, హైదరాబాద్‌లో 38.4, మహబూబ్‌నగర్‌లో 38.9 మెదక్ లో 42.2, నల్లగొండలో 40.4, నిజామాబాద్‌లో 41.9 రామగుండంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. దీనిప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశముందన్నారు. రాగల మూడురోజులలో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాలలో వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు.

7256
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles