కృష్ణాలో స్థిరంగా వరద

Sun,September 22, 2019 01:59 AM

-నిలకడగా ఇన్‌ఫ్లోలు, అవుట్‌ఫ్లోలు
-జూరాల ఐదు, శ్రీశైలం ఒకటి, సాగర్ ఆరుగేట్ల ఎత్తివేత
-భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

హైదరాబాద్ / జోగుళాంబ గద్వాల ప్రతినిధి / నాగర్‌కర్నూల్ ప్రతినిధి / నందికొండ / చింతలపాలెం / కేతేపల్లి/ మెండోరా / కాళేశ్వరం / భైంసా / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కృష్ణానది ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండటంతో శనివారం ఇన్‌ఫ్లోలకు అనుగుణంగా అవుట్‌ఫ్లోలు నిర్వహిస్తున్నారు. గోదావరిలో మాత్రం వరద ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రతోపాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నది. కృష్ణాబేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపుర, ఉజ్జయినీ ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది.

కర్ణాటకలోని ఎగువప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో స్వల్పంగా ఉన్నది. జూరాలకు స్థిరంగా 81 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో ఐదుగేట్లను ఎత్తి నీటిని విడుదలచేస్తున్నారు. శనివారం తుంగభద్ర జలాశయానికి 12,129 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి లక్షకుపైగా క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ఒకగేటు ఎత్తి నీటిని వదులుతున్నారు. శనివారం నాగార్జునసాగర్ ఆరు క్రస్ట్‌గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ ప్రాం తాల నుంచి సుమారు 1,32,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతేమేర అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. ప్రకాశం బరాజ్ వద్ద 1.40 లక్షల పైచిలుకు ఇన్‌ఫ్లో ఉంటే అవుట్‌ఫ్లో కూడా అలాగే ఉన్నది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకుగాను శనివారం సాయంత్రం 633.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు 1,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
Krishnariver1

ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో

మహారాష్ట్రతోపాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో గత మూడ్రోజులుగా కురిసిన వర్షాలకు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శనివారం భారీ ఇన్‌ఫ్లో వస్తున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అముదుర ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టులోకి 87వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు రెండు గేట్లను శనివారం అధికారులు ఎత్తివేశారు. ఎల్లంపల్లి, శ్రీరాజరాజేశ్వర, లోయర్ మానేరుకు నిలకడగా ఇన్‌ఫ్లోలు రికార్డయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బరాజ్‌లకు గోదావరి ఇన్‌ఫ్లో తగ్గుతున్నది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి, నవీపేట మండలం యంచ, ఏర్గట్ల మండలం తడపాకల్ వద్ద గోదావరి నిండుగా పారుతున్నది. బోధన్ మండలంలోని సాలూర వద్ద మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.4 అడుగుల వద్ద నిలకడగా సాగుతు న్నది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు భారీగా వరద వస్తున్నది.
Krishnariver2

967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles