పంట రుణాలపై బ్యాంకుల నిర్లక్ష్యం

Thu,October 10, 2019 03:37 AM

- వానకాలం లక్ష్యంలో 59శాతం దాటని రుణాలు
- లక్ష్యం రూ.29,244 కోట్లు.. సెప్టెంబర్‌ 23నాటికి ఇచ్చింది రూ.17,087కోట్లు
- లక్ష్యాన్ని నెరవేర్చకుండానే యాసంగిలో ఇస్తామని ఎస్సెల్బీసీలో హామీ!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులకు పంట రుణాలివ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు ఎస్సెల్బీసీ సమావేశాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా పంట రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. బ్యాంకర్లకు అవేమీపట్టడం లేదు. వానకాలం ముగుస్తున్నా పంట రుణాలు 59శాతం కూడా దాటలేదు.ఈ వానకాలం పంట రుణలక్ష్యం రూ.29,244కోట్లు కాగా, సెప్టెంబర్‌ 23వరకు కేవలం రూ.17,087కోట్లు మాత్రమే పంపిణీచేశాయి. లక్ష్యంలో కేవలం 58.84శాతం మాత్రమే పంపిణీ చేసినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నివేదిక ద్వారా స్పష్టమవుతున్నది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18 ఉంటే వీటిలో రెండు బ్యాంకులు మాత్రమే లక్ష్యాన్ని మించి పంట రుణాలు ఇచ్చాయి. ఇందులో కెనరా, ఇండియన్‌ బ్యాంకులున్నాయి. మిగిలిన 16 బ్యాంకుల రుణాలు 75శాతం దాటలేదు.

ప్రధాన బ్యాంక్‌ కావడంతోపాటు ఎస్‌ఎల్‌బీసీ లీడ్‌ బ్యాంక్‌గా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణాల పంపిణీ లక్ష్యం రూ.7,986కోట్లు కాగా గత నెల 23 వరకు ఇచ్చినవి కేవలం రూ.4,667కోట్లు (58.44 శాతం) మాత్రమే ఇచ్చింది. ఇక ప్రైవేట్‌ సెక్టార్‌లో మొత్తం 16 బ్యాంకులకుగాను ఒకే ఒక బ్యాంకు మాత్రమే లక్ష్యాన్ని మించి పంట రుణాలు ఇచ్చింది. ప్రైవేట్‌ బ్యాంకుల వానకాలం పంట రుణ లక్ష్యం రూ.2,433కోట్లు కాగా, ఇచ్చింది సగం దాటలేదు. కేవలం రూ.1,249 కోట్లు మాత్రమే పంపిణీచేశాయి. కో-ఆపరేటీవ్‌ బ్యాంకుల పరిస్థితి కొంత పర్వాలేదు. రుణ పంపిణీ లక్ష్యం రూ.3,335కోట్లు కాగా, రూ.2,092 కోట్లు (62శాతం) ఇచ్చాయి. వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాల చెల్లింపుపై ప్రభుత్వం త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని బ్యాంకర్లకు స్పష్టంచేసింది. అయినా చాలాచోట్ల బ్యాంకులు ముక్కుపిండి రైతుల నుంచే వడ్డీ వసూలు చేస్తున్నాయి. పావలా వడ్డీకి రుణాలు, వడ్డీలేని రుణాల కింద ప్రభుత్వం నుంచి బ్యాంకులకు రూ.1,043 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది.

60శాతం రైతులకు అందని రుణాలు

రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులు ఉన్నారని వ్యవసాయశాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటివరకు పంట రుణాలు తీసుకున్న రైతులు 19.22 లక్షల మంది మాత్రమే. అంటే 37.78లక్షల మంది రైతులకు బ్యాంకులు మొండిచేయి చూపాయి. ఇక అగ్రిమెంట్‌ టర్మ్‌ రుణాలు ఇప్పటివరకు 14.66శాతమే ఇచ్చారు. ఈ ఏడాది వ్యవసాయ టర్మ్‌ రుణాలు రూ.11,445 కోట్లు, అనుబంధరంగాలకు రూ.8,410 కోట్లు పంపిణీ లక్ష్యంగా ఉండగా, సెప్టెంబర్‌ చివరినాటికి రూ.2,911 కోట్లు మాత్రమే ఇచ్చాయి.

1073
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles