పాతబట్టలతో కొత్త సంచులు

Thu,October 10, 2019 03:48 AM

-మోడ్రన్ డిజైన్లతో ఆకర్షణ
-ప్లాస్టిక్ నియంత్రణకు చేతి సంచి
-ఉచితంగా కుట్టించేందుకు బాధ్యత ఫౌండేషన్, నిర్మాణ్ సంస్థలు సిద్ధం

శిరందాస్ ప్రవీణ్‌కుమార్. హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సాధారణంగా ఇంట్లో పాతబట్టలుంటే ఏంచేస్తాం.. నిన్నమొన్నటి కాలంలో అయితే.. ఇంటిముందుకు వచ్చి.. కొత్త గిన్నెలిచ్చి.. పాతబట్టలు తీసుకుపోయేవారు. ఇప్పుడు అలా వచ్చేవాళ్లు కరువయ్యారు. సగటు ఉన్నత మధ్యతరగతి, సంపన్న వర్గాల ఇండ్లల్లో గుట్టలు గుట్టలుగా పాతబట్టలు పేరుకుపోతూ ఉంటాయి. వీటిని ఏం చేయాలో తోచదు. బయట పడేయడానికి మనసొప్పదు. ఎవరికైనా ఇద్దామన్నా తీసుకొనేవాళ్లు దాదాపుగా ఉండరు. ఇలాంటి బట్టలను వృథాచేయకుండా.. పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా.. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించే లక్ష్యంతో బాధ్యత ఫౌండేషన్, నిర్మాణ్ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇంట్లో పాతబట్టలతో కొత్త సంచులను కొత్త నమూనాలతో తయారుచేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రెండు సంస్థలు ప్రారంభించాయి. బట్ట సంచులను వాడటం ద్వారా సమాజానికి ఎంతోమేలుచేయగలమని ఈ సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు.

nirmaan-organization2

పర్యావరణ రక్షణ

ఇండ్లలో ఉండే పాత శాలువాలు, చీరెలు, డ్రెస్‌లు, టీషర్టులు, ప్యాంట్లు ఏవైనా సరే.. వాటిని తీసుకొస్తే వాటితో కొత్త సంచులను కుట్టి ఇచ్చే పనిని బాధ్యతా ఫౌండేషన్, నిర్మాణ్ సంస్థలు చేపట్టాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్ (బాధ్యత ఫౌండేషన్ చంధ్రశేఖర్-8008424344, నిర్మాణ్ సంస్థ ప్రసాద్ 9100444093) చేసి సమయాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సికింద్రాబాద్ అడ్డగుట్ట, బోరబండ ప్రాంతాల్లో ఇందుకోసం ఏర్పాట్లుచేశారు. త్వరలోనే మరిన్ని కేంద్రాలను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. డ్రెస్సులతో అందమైన సంచులుగా తయారు చేస్తున్నారు. పాత వస్ర్తాలని ఎవరూ గుర్తించరు. కొత్త నమూనాలతో సంచులకు సరికొత్త రూపు తీసుకొస్తున్నారు. వాటిని పట్టుకొని మార్కెట్‌కి వెళ్తే స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటున్నాయి. మొదటి సంచిని మాత్రం ఉచితంగానే కుట్టిస్తారు. రెండోసంచీ నుంచి రూ.20 వరకు చార్జీ చేస్తున్నారు. సమాజంలో బట్టసంచీ విలువను తెలిపేందుకే ఈ ప్రక్రియకు శ్రీకారంచుట్టారు.

వినియోగమే గొప్ప

20 ఏండ్ల క్రితం.. కిరాణా సామానుకెళ్తే ఓ సంచి.. వంటనూనె కోసం వెళ్తే స్టీలు క్యాను.. మటన్/చికెన్‌కు వెళ్తే గిన్నె, బాక్సు.. బియ్యానికి వెళ్తే బస్తా.. ఇలా ఎక్కడికి వెళ్లినా చేతిలో సంచి ఉండేది. ఇప్పుడేమో అది నామోషీగా మారింది. భుజాన సంచి వేసుకెళ్తే పాతకాలం మనుషులనుకుంటారన్న కలవరం. ఎక్కడికి వెళ్లినా చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు. ఇంటికి వస్తూ ప్లాస్టిక్ కవర్లను మోసుకొస్తున్నారు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు.. చాక్లెట్ నుంచి హోటల్ నుంచి తెచ్చే పార్శిళ్ల వరకు ఎన్ని ప్లాస్టిక్ కవర్లు తీసుకొస్తున్నారో లెక్కించండి. ఏదైనా ఊరికెళ్తే.. ఎన్ని నీళ్ల ప్యాకెట్లు/బాటిళ్లు కొంటున్నాం? వాటిని ఎక్కడ పడేస్తున్నాం? వాటి వల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతున్నది? ఇవి నాలాల్లో, కాల్వల్లో చిక్కుకొని ఎంతటి ప్రమాదానికి కారణమవుతున్నాయి! వాటిని తింటూ ఎన్ని ప్రాణులు విలవిల్లాడుతున్నాయి? యాంత్రిక జీవనంలో ఒక్క చేతి సంచిని మర్చిపోవడం వల్ల చేజేతులా అనర్థ్ధాన్ని కొనితెచ్చుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ఎన్ని కార్యక్రమాలు అమలుచేసినా మనలో మార్పు రాకుంటే ప్రయోజనం శూన్యం.

nirmaan-organization3

ఇలా చేద్దాం!

-ప్రపంచంలో నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లు కొంటున్నారు. సంచిలో ఒక రాగి బాటిల్ ఉంటే బయట ప్లాస్టిక్ బాటిల్ కొనే బాధ తప్పుతుంది.
-చాట్, టిఫిన్ వంటి చిరుతిండి కోసం ప్లాస్టిక్ చెంచాలనే వినియోగిస్తున్నారు. సంచిలో ఓ చెంచా ఉంటే బాగుంటుంది.
-పండ్ల రసాలు తాగేందుకు స్ట్రాలు, ప్లాస్టిక్ గ్లాసులు. కొబ్బరిబోండాలు తాగాలంటే ప్లాస్టిక్ స్ట్రాలే వాడుతున్నారు. ఏటా దేశంలో 4 వేల కోట్ల స్ట్రాలు వృథాగా పడేస్తున్నారు. చేతి సంచిలో ఒక గ్లాసు ఉంటే వృథాను అరికట్టొచ్చు.
-ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి పది లక్షల ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. చేతిలో సంచి ఉంటే ఈ వృథాను నియంత్రించవచ్చు.
-ఎవరైనా ఇంటికొస్తే ఓ బట్ట సంచిని బహుకరించాలి. ఆ సమయంలోనే కుట్టినట్లుగా కనిపిస్తే కష్టపడి కుట్టిచ్చారన్న కృతజ్ఞత వ్యక్తమవుతుంది. దాంతో తప్పక వినియోగిస్తారు.
-ఇంటికి దంపతులు లేదా మహిళలొస్తే పసుపు, కుంకుమ ఇవ్వడం ఆనవాయితీ. అలాగే బ్లౌజ్‌పీసు పెడతారు. దానికి బదులుగా బట్ట సంచిని ఇవ్వాలి.
-ఇంట్లో పాత దుస్తులను పడేయకుండా వాటితో సంచులను కుట్టించి పంచి పెట్టాలి. కాస్త డిజైన్‌తో కుట్టిస్తే అద్భుతంగా ఉన్నాయంటూ స్వీకరిస్తారు.
-ప్రకృతిని బాధించి పూజించడం ద్వారా పుణ్యంరాదు. మంచి సమాజం కోసం ప్లాస్టిక్‌ను నియంత్రించాలని ప్రచారం చేయాలి.
-పుట్టిన రోజుకు చాక్లెట్లకు బదులుగా సంచులే పంపిణీ చేయండి. ప్రకృతిని కాపాడుకునేందుకు మంచిని ప్రబోధించే కొత్త ఆచారాన్ని ప్రారంభించాలి.

nirmaan-organization6

వస్ర్తాల్లోనూ సింథటిక్

చాలా వస్ర్తాలు సింథటిక్‌తో తయారైనవే. వాటితోనూ డేంజరే. వాటిని పునర్వియోగిస్తే మనకు, సమాజానికి మేలు కలుగుతుంది. బట్ట సంచీ చాలా ఏండ్లు వాడొచ్చు. ఒక్కో సంచి దాదాపు ఐదేండ్లు ఉంటుంది. తద్వారా ప్లాస్టిక్ కవర్లకు చేసే ఖర్చును సుమారు రూ.5 వేలు ఆదా చేయొచ్చు. ఒక్క సంచీని ఉచితంగా కుట్టించుకోవడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. సమాజానికి మేలుకొలుపు పలికినట్లు అవుతుంది. బహుమతులుగా పంపిణీ చేయడం ద్వారా ఉన్నతంగా నిలవొచ్చు. ప్రస్తుతం ఏది ధరిస్తే అదే ఫ్యాషన్‌గా నిలుస్తుంది. యువత కూడా వారి డ్రెస్సులకు తగ్గట్లుగా మోడ్రన్ బ్యాగులను ధరించి తోటివారికి స్ఫూర్తిదాయకంగా నిలవొచ్చు. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, కంపెనీలు, ఐటీ కంపెనీలు ఈ మోడ్రన్ బ్యాగుల వినియోగానికి ముందుకు రావాలి. ఎన్జీవోలు కూడా పాతడ్రెస్సులను సంచులుగా కుట్టించేందుకు ముందుకు రావాలి.
- పైడిమర్రి చంద్రశేఖర్, బాధ్యతా ఫౌండేషన్

nirmaan-organization4

ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్‌గా చేపట్టాం

ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడేందుకు మా వంతు కృషి. పాత డ్రెస్సులతో సంచులు కుట్టించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. మేం ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద చేపట్టాం. ప్రజల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడటం వల్ల వచ్చే అనర్థ్ధాలను ప్రచారంచేస్తూనే ఈ మోడ్రన్ ఫ్యాషన్ వైపు అడుగేయాలని కోరుతున్నాం. మొదటి సంచీని ఉచితంగా కుట్టిస్తున్నాం. ఆ తర్వాత సంచులు కుట్టేందుకు రూ.20 వంతున తీసుకుంటాం. సంపన్న వర్గాలు, ఎగువ మధ్య తరగతి వర్గాల ఇళ్లల్లో చాలా డ్రెస్సులు వృథాగా ఉంటాయి. వాటితో సమాజసేవకు శ్రీకారం చుట్టొచ్చు. కాస్త సమయం, డబ్బు ఖర్చుచేస్తే సంచులుగా మారుతాయి. ఏ మార్కెట్లలోనైనా ఉచితంగా పంపిణీ చేయొచ్చు.
- ప్రసాద్, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ

1504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles