దశాబ్దాలుగా ఔషధాల దందా

Fri,November 8, 2019 02:19 AM

-సరఫరాదారు నుంచి ఐఎంఎస్‌ను శాసించేస్థాయికి..
-వెలుగులోకి ఓమ్నిమెడి ఎండీ శ్రీహరిబాబు బాగోతం
-2000లోనే కరీంనగర్‌లో ఏసీబీ కేసు నమోదు
-ప్రభుత్వ పెద్దల సిఫారసుతో చార్జిషీట్‌లో పేరు తొలిగింపు
-ఏసీబీ విచారణలో బయటికివస్తున్న పాత కేసులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఐఎంఎస్(ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) ఔషధాల కొనుగోలు కుంభకోణంలో తెరవెనుక కీలక సూత్రధారిగా ఉన్న ఓమ్నిమెడి ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికివస్తున్నాయి. దాదాపు 20 ఏండ్లుగా శ్రీహరిబాబు ఈ దందాలో ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తులో తెలిసింది. తొలుత కంపెనీల నుంచి ఔషధాలు కొనుగోలుచేసి జిల్లాల్లోని దవాఖానలకు చేరవేసే సరఫరాదారుడిగా వ్యాపారంలోకి ప్రవేశించిన శ్రీహరిబాబు, ఈ వ్యవస్థలోని లొసులుగు తెలుసుకుంటూ ఐఎంఎస్ డైరెక్టరేట్‌నే శాసించేస్థాయికి ఎదిగాడు. 1998 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలుజిల్లాలకు శ్రీహరిబాబు ఔషధాల సరఫరాదారుడిగా ఉంటూ అధికారులతో పరిచయాలు పెంచుకున్నట్టు తెలిసింది.

ఔషధాలు సరఫరా చేసే తొలినాళ్లలో అన్నపూర్ణ, బాలాజీ పేరుతో షెల్ కంపెనీలను సృష్టించాడు. వీటితో కరీంనగర్ జిల్లా దవాఖానకు బ్యాండేజ్, ఇతర సామగ్రి సరఫరా చేసినట్టు రికార్డులు సృష్టించి రూ.ఆరు లక్షల నాలుగు వేలు కొల్లగొట్టి ఆధారాలతో పట్టుబడటంతో ఏసీబీ కేసు నమోదైంది. అప్పటి కరీంనగర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ శంకర్‌అలంకార్‌కు ప్రమోషన్ ఇప్పించేందుకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని హామీ ఇచ్చి అవినీతికి పాల్పడ్డట్టు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఈ కేసులో 2007 లో ఏసీబీ అధికారులు చార్జిషీట్ వేశారు.

అప్ప టి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో 15 రోజుల్లోనే చార్జిషీట్‌లో నుంచి శ్రీహరిబాబు తన పేరు తొలిగించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. ఔషధాల కొనుగోళ్లలో లొసుగులు, అధికారుల పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శ్రీహరిబాబు 2004లో ఓమ్ని మెడి సంస్థను స్థాపించి భారీ అవినీతికి తెరలేపాడు. రాష్ట్రవ్యాప్తంగా ఏ డిస్పెన్సరీకి ఔషధాలు వెళ్లాలన్నా సొంతంగా ఇండెంట్లు తయారుచేసి సంతకాలు పెట్టాలంటూ ఐఎంఎస్ డైరెక్టర్ కార్యాలయాన్నే శాసించేస్థాయిలో చక్రం తిప్పాడు. తన కంపెనీ ప్రతినిధి నాగరాజు ద్వారా ఇండెంట్లు పంపించి సంతకాలు పెట్టించుకునేవాడన్న ఆరోపణలున్నాయి. దర్యాప్తు లో శ్రీహరిబాబు బాగోతాలు మరెన్నో వెలుగుచూసే అవకాశం ఉన్నది.

124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles